కళాశాల ఏర్పాటు కలేనా..?

ABN , First Publish Date - 2021-12-07T05:02:10+05:30 IST

మండలకేంద్రంలో జూనియర్‌ కళా శాల

కళాశాల ఏర్పాటు కలేనా..?

  • తలకొండపల్లిలో జూనియర్‌ కాలేజీ లేక అవస్థలు
  • ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు 


తలకొండపల్లి : మండలకేంద్రంలో జూనియర్‌ కళా శాల లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతు న్నారు. ప్రతిఏటా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తారని.. తమ ఇబ్బందులు తీరుతాయని విద్యార్థులు ఏళ్లకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగులుతుంది. కళాశాల అందుబాటులో లేక.. దూరప్రాం తాలకు వెళ్లలేక చాలామంది విద్యార్థులు పదోతరగతితోనే చదువు ఆపేస్తున్నారు. మండలంలో దాదాపు 12 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతిఏటా వందల మంది విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణత పొంది ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్‌ కళాశాలలో ఫీజులు చెల్లించలేక అర్ధాంతరంగా చదువులను నిలిపి వేస్తున్నారు. విధిలేక కొంతమంది కల్వకుర్తి, ఆమనగల్లు,  కడ్తాల్‌, షాద్‌నగర్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లి చదు వును కొనసాగిస్తున్నారు. దాదాపు 20 గ్రామాలకు కూడలిగా ఉన్న తలకొండ పల్లి మండలకేంద్రంలో జూనియర్‌ కళా శాల ఏర్పాటుకు ఎవరూ చొరవ చూప కపోవడం విమర్శలకు తావిస్తోంది. కళాశాల ఏర్పాటు గురించి విద్యార్థి సం ఘాలు ఆందోళనలు సైతం చేపట్టాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పలు మార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కోసం నేతలు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థి, సంఘాల, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


కళాశాల ఏర్పాటు చేయాలి

మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి. విదార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కళాశాల ఏర్పాటు కోసం ఆందోళనలు సైతం చేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు  ఉన్నత విద్య అందుతుంది. కళాశాల ఏర్పాటు దిశగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చొరవ తీసుకోవాలి.

- వెంకటేశ్‌ నాయక్‌, విద్యార్థి సంఘం నాయకుడు, తలకొండపల్లి


ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నాం..

తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. పలు మార్లు మండల సమావేశాలలో తీర్మానాలు చేశాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వివిధ సందర్భాల్లో మండలానికి వచ్చిన మంత్రులకు, ఉన్నతస్థాయి అధికారులకు జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించాం. కళాశాల లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  

- నిర్మలశ్రీశైలంగౌడ్‌, ఎంపీపీ, తలకొండపల్లి 


Updated Date - 2021-12-07T05:02:10+05:30 IST