కరోనా కల్లోలం!

ABN , First Publish Date - 2021-04-19T05:48:55+05:30 IST

తెలుగు ప్రజలు శ్రీరామనవమి నాడు సీతారామచంద్రస్వామికల్యాణాన్ని కనులారా తిలకించాలని భావిస్తారు. కానీ కరోనా వైరస్‌ రెండో ఉధృతి ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులు లేకుండానే ఈసారీ సైతం స్వామి వారి కల్యాణాన్ని ఆంతరంగికంగా నిర్వహించనున్నారు.

కరోనా కల్లోలం!

ఇప్పటికే నవమి వైదిక బృందంలో ఇరువురికి పాజిటివ్‌!

పరిపాలన, వైదిక సిబ్బందిలో కొవిడ్‌ భయం

శ్రీరామనవమి వేళ అందరూ కలిపి వంద మందిలోపే ఉంటారంటున్న అధికారులు

భద్రాచలం, ఏప్రిల్‌ 18: తెలుగు ప్రజలు శ్రీరామనవమి నాడు సీతారామచంద్రస్వామికల్యాణాన్ని కనులారా తిలకించాలని భావిస్తారు. కానీ కరోనా వైరస్‌ రెండో ఉధృతి ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులు లేకుండానే ఈసారీ సైతం స్వామి వారి కల్యాణాన్ని ఆంతరంగికంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం రామాలయంలోని నిత్య కల్యాణ మండప వేదిక వద్ద ఏర్పాట్లను చేశారు. బుధవారం స్వామి వారి కల్యాణంను నిర్వహించనున్నారు. ఇప్పటికే కల్యాణ బృందంలోని ఇరువురు వైదిక సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా దేవస్థానం వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో రామాలయంలోని పరిపాలన, వైదిక సిబ్బందిలో భయం నెలకొంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కరోనా రక్షణ చర్యలపై దృష్టిసారిస్తున్నారు. ఈసారి కరోనా పాజిటివ్‌లు లక్షణాలు లేకుండా సైతం వస్తుండటంతో పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని పలువురు వాపోతున్నారు. ఏ మాత్రం ఎమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేళ దేవస్థానం అధికారులు, వైదిక పరిపాలన సిబ్బంది 50 మందిలోపు ఉండేలా చూడాలని ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు మొత్తం సంఖ్య 50కి మించకుండా ఉండేలా చూడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈసారి కల్యాణాన్ని చిత్రకూట మండపంలో నిర్వహిద్దామని తొలుత  దేవస్థానం అధికారులు నిర్ణయించారు. కానీ నిత్య కల్యాణ వేదిక వద్ద విశాలమైన స్థలం, వెలుతురు, గాలి ఉండే అవకాశం ఉండటంతో గత ఏడాది మాదిరిగానే నిత్య కల్యాణ వేదిక వద్ద నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మళ్లీ దానినే ఖరారు చేశారు. కాగా ఈసారి కరోనా రెండో ఉధృతి అధికంగా ఉండటంతో ఈ ప్రభావం మరింతగా దేవస్థానం పరిపాలన వైదిక సిబ్బందిపై పడకూడదనే ఉద్దేశ్యంతో నివారణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-19T05:48:55+05:30 IST