Abn logo
Mar 5 2021 @ 00:46AM

విప్రో గూటికి క్యాప్కో

ఒప్పందం విలువ రూ.10,585 కోట్లు 


బెంగళూరు: అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌, టెక్నాలజీ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ క్యాప్కోను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విప్రో ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 145 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.10,585 కోట్లు. విప్రో చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్‌. క్యాప్కో కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు ఎండ్‌ టు ఎండ్‌ గ్లోబల్‌ కన్సల్టింగ్‌, సాంకేతిక, పరివర్తన సేవలందించే అతిపెద్ద కంపెనీగా విప్రో అవతరించనుంది. లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న క్యాప్కో.. అమెరికా, యూరప్‌, ఆసియా పసిఫిక్‌లో పలు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలకు డిజిటల్‌, కన్సల్టింగ్‌, టెక్నాలజీ సేవలందిస్తోంది. 


గడిచిన 20 ఏళ్లలో ఈ కంపెనీ.. బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, వెల్త్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, బీమా రంగాలకు చెందిన  పలువురు బిజినెస్‌ ప్రముఖులు, కంపెనీల బోర్డులతో కలిసి పనిచేసింది. అంతేకాదు, ఎనర్జీ, కమోడిటీ ట్రేడింగ్‌ రంగాలకు చెందిన క్లయింట్లకూ క్యాప్కో సేవలందిస్తోంది. ఈ కంపెనీ అత్యంత అనుభవం కలిగిన ఉన్నతోద్యోగులతో పాటు 5,000కు పైగా బిజినెస్‌,  టెక్నాలజీ కన్సల్టెంట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా 30కి పైగా కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30 నాటి కల్లా క్యాప్కో కొనుగోలు ఒప్పందం పూర్తికావచ్చని విప్రో భావిస్తోంది. 


మా క్లయింట్లకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కన్సల్టింగ్‌, సాంకేతిక పరివర్తనం, కార్యకలాపాల నిర్వహణ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. 

- థియరీ డెలాపోర్ట్‌, విప్రో సీఈఓ, ఎండీ 

Advertisement
Advertisement
Advertisement