గుండె తరుక్కుపోతోంది!

ABN , First Publish Date - 2020-11-21T08:29:30+05:30 IST

వేల కోట్లతో చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని నిలిపేసి, మూడు రాజధానుల కోసం ముచ్చటపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

గుండె తరుక్కుపోతోంది!

రాజధాని తరలింపు ‘మతిలేని చర్య’గాక మరేమిటి?

3 వేల కోట్లతో అభివృద్ధి చేసి అర్ధంతరంగా ఆపేస్తారా?

నిలిచిపోయిన నిర్మాణాలతో ప్రజాధనం వృథా కాదా?

మేం ఆదేశాలిచ్చిన తర్వాత కూడా పిటిషనర్లను 

ఖాళీ చేయించడం మతిలేని చర్య కాదా?

హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్‌ ఆఫీసుగా మారిందంటారా?

స్వయంగా ఒక ఎంపీ ఆ వ్యాఖ్యలు చేయడమేమిటి?

ఇలాంటి ధోరణులు మొదటిసారిగా చూస్తున్నాం

నిందితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి

లేదంటే.. నేరస్థులే ఉన్నత పదవులు చేపడతారు

ప్రజాస్వామ్యాన్ని అనుకూలంగా వాడుకుంటారు

నిప్పుతో చెలగాటం వారినే దహించి వేయడం ఖాయం

హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు


వివిధ సమస్యలపై పిటిషన్లు వేసిన వారిపై రకరకాలుగా దాడి చేస్తున్నారు. పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉపసంహరించుకునేందుకు అనుమతించం!


ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలి. అలాంటి రక్షణ కల్పించకపోవడం వల్లే వారు కోర్టును ఆశ్రయిస్తున్నారు.


నేరస్థులు అధికారంలోకి రాకుండా నిలువరించే చట్టాల రూపకల్పనపై ఎవ్వరూ ఆలోచించడం లేదు. సుప్రీంకోర్టు సైతం ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోంది. నేరస్థులు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. ఏదో ఒక రోజు వారిని దహించివేయడం ఖాయం!   

-హైకోర్టు ధర్మాసనం

ప్రజలు భావోద్వేగంతో ఉంటారు. తీర్పు నచ్చకపోతే సరిగ్గా లేదనడం పరిపాటే. ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదు!

- ప్రభుత్వ న్యాయవాది

హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్‌ ఆఫీసుగా మారిపోయిందని ఒక ఎంపీ టీవీల ముందు అన్నారు. ఇది తీర్పు బాగాలేదనడమా? ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదా? ప్రజాస్వామ్య దేశంలో ఇదేనా పద్ధతి? అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా! 

- ధర్మాసనం


అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వేల కోట్లతో చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని నిలిపేసి, మూడు రాజధానుల కోసం ముచ్చటపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.3వేల కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని అభివృద్ధి పనుల్ని అర్ధంతరంగా ఆపివేయడం మతిలేని చర్య కాదా అని నిలదీసింది. ఇంత అభివృద్ధి జరిగాక పనులను ఎక్కడికక్కడ నిలిపేయడమేంటని ప్రశ్నించింది. దీని వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, అంతిమంగా క్షోభ అనుభవించేది ప్రజలే అని ఆక్రోశించింది. ‘‘ఇంత అభివృద్ధిని నిలిపేశారే? ఇబ్బంది పడుతున్నదెవరు?’’ అని నిలదీసింది. రాజధాని ప్రాంతంలో అర్ధంతరంగా నిలిచిపోయిన భవనాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించింది. వ్యక్తుల అక్రమ నిర్బంధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన వివిధ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా లేదా అన్నది తేలుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇందులో భాగంగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖ పర్యటనకు వెళ్లిన విపక్ష నేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.రాజధాని తరలింపు, నేరమయ రాజకీయాలు, న్యాయ వ్యవస్థపై దూషణలు తదితర అంశాలపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మతిలేని చర్య’ అనే పదాలు ప్రయోగించడంపై ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. 


హైకోర్టుపై పార్టీ ముద్ర వేస్తారా?

ప్రభుత్వం తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... ‘ప్రజలు ఉద్వేగంతో ఉంటారు’ అంటూ హైకోర్టుపై దూషణలు చేసిన వారిని సమర్థించేలా వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం మరింత మండిపడింది. ‘‘ప్రజలు కాదు... కొంతమంది వ్యక్తులు మాత్రమే అలా ఉన్నారు! సాధారణ ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. ఈ ధోరణులను మొదటిసారిగా గమనిస్తున్నాం. హైకోర్టు తీర్పు వెలువరిస్తే స్వయంగా ఒక పార్లమెంటు సభ్యుడు టీవీల ముందుకెళ్లి న్యాయస్థానంపై ఆరోపణలు చేస్తారా?’’ అని ప్రశ్నించింది.


మతిలేని చర్యకాక మరేమిటి... 

చంద్రబాబు విశాఖ పర్యటనను అక్కడి ప్రజలు వ్యతిరేకించారని ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. అదే పార్టీకి చెందిన నేత పిల్‌ వేయడాన్ని ‘పొలిటికల్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌’గానే భావించాల్సి ఉంటుందన్నారు. ఈ పిల్‌లో అన్ని జిల్లాల అధికారులను ప్రతివాదులుగా చేర్చారన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన మైండ్‌లెస్‌ యాక్షన్‌  (మతిలేని చర్య)లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చంద్రబాబు విశాఖ బయలుదేరారు’ అని అఫిడవిట్‌లో పేర్కొనడంపై ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మతిలేని చర్య’ అనే పదాలు ప్రయోగించడం ఏమాత్రం సరి కాదన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ ప్రభుత్వ తీరును కోర్టుకు తెలియపరచాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది.


అయితే... ‘‘ఎవ్వరూ పరిమితులు దాటరాదు. మన భాషను మనం తెలుసుకోవాలి’’ అని ప్రసాద్‌ పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తమ స్థలాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ మా ముందుకు చాలా పిటిషన్లు వస్తున్నాయి. వాటిని పరిశీలించి చట్టాన్ని అతిక్రమించకుండా, నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని మేం ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది ప్రభుత్వ మతిలేని చర్య గాక ఇంకేమిటి? దీనినేమంటారు? కచ్చితంగా మతిలేని చర్యే’’ అని కటువుగా వ్యాఖ్యానించింది. ‘‘అంతేగాక రూ.3 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని నిర్మాణ పనుల్ని అర్థంతరంగా నిలిపివేయడం మతిలేని చర్య కాదా?’’ అని నిలదీసింది. రాజధాని అంశాన్ని ప్రస్తావించడంపై  ఎన్‌ఎస్‌ ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రాజధానుల పిటిషన్లను విచారించే ధర్మాసనంలో మీరు లేరు. నేను న్యాయవాదిగా లేను. అది ఇక్కడ అప్రస్తుతం. రాజధాని విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశం. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. న్యాయస్థానాలు కూడా విచారణ పరిధిని, తమ పాత్రలను విస్మరిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘అంటే మీ ప్రభుత్వం మాత్రం ఈ సమాజాభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం కోసమే అన్నీ చేసేస్తోందా? ఇలాంటివి మా వద్ద చెప్పకండి’’ అని కటువుగా వ్యాఖ్యానించింది. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది. కోర్టుకు వచ్చివెళ్లేటప్పుడు నిర్మాణం నిలిచిపోయిన భారీ భవనాలను చూస్తే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తగిన సౌకర్యాలు లేకపోవడంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని... ఆ బాధతోనూ ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొంది. సీనియర్‌ కౌన్సిల్‌ వాదనలు కొనసాగిస్తూ.. కోర్టుకు వచ్చి కనీసం మంచినీరు, టీ కూడా దొరక్క ఇబ్బంది పడ్డామన్నారు. చీకటిపడితే వెనక్కి రావడం కష్టమన్నారు. అనారోగ్యానికి గురైనా దిక్కులేదని తెలిపారు. చుట్టుపక్కల 30 కిలోమీటర్ల మేర ఏమీ దొరకవన్నారు. గత పాలనా యంత్రాంగం ఆ అడవికి ఎందుకు తీసుకెళ్లిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని ఇక్కడే ఉంటే సుమారు రూ.100 కోట్ల నష్టం జరుగుతుంది. తరలిస్తే నష్టం రూ.10 కోట్లు మాత్రమే’’ అని తెలిపారు.


శాంతిభద్రతల బాధ్యత పోలీసులదే

పోలీసులు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చి, అదే సమయంలో అధికార పార్టీ వారికి కూడా అక్కడే అనుమతి ఇస్తున్నారని పిటిషనర్‌ చెప్పడం సరికాదని... ఒక సమావేశం నచ్చకపోతే, ప్రజలు ఏం గలాటా చేస్తారో ఎలా చెప్పగలమని ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. అలాంటి పరిస్థితి నుంచి రక్షించడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించింది. పరిస్థితులు శ్రుతిమించుతున్నప్పుడు ఫిర్యాదు చేయకపోయినా, ఎవ్వరూ అడగపోయినా పోలీసులు అక్కడికెళ్లి అదుపు చేయాల్సిందేనని పేర్కొంది. శాంతి భద్రతలను పరిరక్షించడం వారి బాధ్యత అని స్పష్టం చేసింది. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మందడం వెళ్తుండగా పోలీసులు నిలువరించడంపై ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వివరణ ఇస్తూ... పవన్‌ కల్యాణ్‌ వెంట చాలామందితో కూడిన కాన్వాయ్‌ వచ్చిందన్నారు. ప్రతి రాజకీయ నేతా తన బలప్రదర్శన చేయాలనుకుంటారన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. దేశంలో అన్ని రాజకీయ పార్టీల తీరు అలాగే వుందని వ్యాఖ్యానించింది. 


ఆ ఏసీపీని డిస్మిస్‌ చేయాలి

విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మండలస్థాయి తహసీల్దారుకు చట్ట నిబంధనలు తెలియవని భావించవచ్చని, అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ స్థాయి అధికారి చట్ట నిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెక్షన్‌ 151 కింద నోటీసు ఇవ్వడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ ఏసీపీపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని సీనియర్‌ కౌన్సిల్‌ వివరించగా.. అసలు సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయాలని ధర్మాసనం కటువుగా వ్యాఖ్యానించింది. తదుపరి వాదనల కొనసాగింపు కోసం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 


నిందితులు పోటీ చేయకుండా చట్టం!

ఒక సాధారణ వ్యక్తి సర్పంచ్‌ స్థాయికి వెళ్లి... కొన్ని రోజులకే ధనవంతుడైపోయాడు. పెద్ద పెద్ద కార్లలో తిరిగాడు. ఇదెలా సాధ్యమవుతోంది? ఇలాంటివి కట్టడి చేయాల్సిందే!


వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పనిసరిగా చట్టం చేయాలి. లేకుంటే... క్రిమినల్స్‌ ఉన్నత పదవుల్లో కూర్చుని ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు.


ప్యూన్‌ ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి విద్యార్హతలు, సర్టిఫికెట్లు పరిశీలించి, అతని నేరచరిత్ర గురించి ఆరా తీస్తారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవేవీ అవసరం లేదా!


బిహార్‌లో పప్పూ యాదవ్‌ ఓ హత్య కేసులో నిందితుడు. జైలులో ఉన్న ఆయన ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు అనుమతించాలని పిటిషన్‌ వేశారు. దాంతో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అధ్యయం చేయాల్సి వచ్చింది. జైలులో ఉన్నంత కాలం ఓటు వేయకుండా అడ్డుకోవచ్చుననే నిబంధన ఉంది. కానీ... జైలులో ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులూ లేవు. ప్రజాస్వామ్యంలో ఇదో పెద్ద లోపం!


నేరస్థులు అధికారంలోకి రాకుండా నిలువరించే చట్టాల రూపకల్పనపై ఎవ్వరూ ఆలోచించడం లేదు. సుప్రీంకోర్టు సైతం ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోంది. నేరస్థులు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. ఏదో ఒక రోజు వారిని దహించివేయడం ఖాయం!


బిహార్‌లో ఒకసారి ఓ క్రిమినల్‌ ఎన్నికల్లో పోటీ చేసి... ఆ తర్వాత హోంమంత్రి అయ్యాడు. తన కానిస్టేబుల్‌ ఈడ్చుకెళ్లిన క్రిమినల్‌కు ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్లి తాను స్వాగతం పలకాల్సి వస్తోందని ఆ రాష్ట్ర డీజీపీ గోడు వెళ్లబోసుకున్నారు. ఏంటిది? నేరస్థుల రాజకీయాలపై ఏదో ఒకటి జరగకపోతే క్రిమినల్సే పాలించే రోజు వస్తుంది!

- జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌

Updated Date - 2020-11-21T08:29:30+05:30 IST