కొత్త కోరలు!

ABN , First Publish Date - 2020-05-23T08:31:30+05:30 IST

రాజధాని భూములపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ ఉత్తర్వులకు తాజాగా కొత్త కోరలు తొడిగింది.

కొత్త కోరలు!

‘రాజధాని భూముల’ విచారణ పరిధిలోకి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 5ఏ

కేసు తేలితే జీవితకాల శిక్ష, భారీ జరిమానా

సీబీఐకి నిర్దేశిస్తూ సవరణ జీవో 54 జారీ 


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాజధాని భూములపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర  ప్రభుత్వం... ఆ ఉత్తర్వులకు తాజాగా కొత్త కోరలు తొడిగింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (పీఏవో) పరిధిలో జీవితకాల శిక్ష తోపాటు జరిమానా విధించే సెక్షన్‌ ‘5 ఏ’ను విచారణ పరిధిలోకి తీసుకొచ్చింది.  దీనిపై రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం జీవో 54ను జారీచేశారు. రాజధాని భూములపై సీబీఐ విచారణ కోరుతూ మార్చి 23న ప్రభుత్వం జీవో 46ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కుట్రకోణంతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం-1977లోని పలు సెక్షన్ల కింద విచారణ, కేసుల నమోదు ఉండాలని సీబీఐకి దిశానిర్దేశం చేశారు.


అయితే, పీఏవో చట్టంలోని 5ఏ సెక్షన్‌ కింద కూడా విచారణ, కేసుల నమోదు ఉండాలని ప్రత్యేక విచారణ బృందానికి(సిట్‌) నేతృత్వం వహిస్తున్న డీఐజీ ఈనెల 20న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ వెంటనే విచారణ పరిధిలోకి ఆ సెక్షన్‌ను తీసుకొస్తూ, మార్చి 23న జారీ చేసిన జీవో 46లో కోరిజెండమ్‌ (సవరణలు) చేస్తూ కొత్తగా జీవో 54ను జారీ చేశారు.  5ఏలో రెండు అంశాలున్నాయి. ఐపీసీ 45 ఆఫ్‌ 1860 కిందకు వచ్చే కేసుల్లో నేరం నిరూపితమైతే పదేళ్లు, అంతకు మించిన శిక్షలు ఉంటాయి. 5ఏ కింద అట్రాసిటీ చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.


ఇది యాదృచ్ఛికమా?

కోరిజెండమ్‌ జీవోపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.   రాజధాని భూములపై సీబీఐ విచారణకు  ఆదేశిస్తూ సర్కారు మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు సర్కారుకు నాలుగు అంశాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజధాని భూములను ఇళ్లస్థలాలకు కేటాయించడాన్ని, విశాఖలో ఇళ్లస్థలాలకోసం ఆరువేల ఎకరాలు సేకరించాలన్న ఉత్తర్వు అమలును హైకోర్టు నిలిపివేసింది.


ఇంటిస్థలాలను ఆరేళ్ల తర్వాత అమ్ముకునేలా అవకాశం కల్పించే కన్వేయెన్స్‌ డీడ్‌ల జారీకి సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. దీనికితోడు శాసనమండలి రద్దు అంశం ప్రస్తావనకు రాకుండానే పార్లమెంట్‌ సమావేశాలు వాయిదాపడ్డాయి. సరిగ్గా అదే రోజు సాయంత్రం రాజధాని భూములపై సీబీఐ విచారణ కోరుతూ సర్కారు జీవో 46ని జారీ చేసింది. సరిగ్గా రెండునెలల తర్వాత అలాంటి సీనే కనిపించింది. శుక్రవారం మూడు ప్రధాన అంశాల్లో హైకోర్టు వెలువరించిన ఆదేశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ సమయంలోనే రాజధాని భూములపై సీబీఐ విచారణకు కోరిజెండమ్‌ ఇస్తూ కేసుల తీవ్రతను పెంచేలా సర్కారు నుంచి జీవో వెలువడింది.

Updated Date - 2020-05-23T08:31:30+05:30 IST