హీథర్‌ దంచెన్‌!

ABN , First Publish Date - 2021-06-17T09:23:12+05:30 IST

కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (95), ఓపెనర్‌ టామీ బ్యూమాంట్‌ (66) అర్ధ శతకాలతో రాణించడంతో.. భారత్‌తో ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మహిళల జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.

హీథర్‌ దంచెన్‌!

ఇంగ్లండ్‌ 269/6 

స్నేహ్‌ రాణాకు 3 వికెట్లు

భారత మహిళలతో ఏకైక టెస్ట్‌


బ్రిస్టల్‌: కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (95), ఓపెనర్‌ టామీ బ్యూమాంట్‌ (66) అర్ధ శతకాలతో రాణించడంతో.. భారత్‌తో ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మహిళల జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. బుధవారం ఆరంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లకు 269/6 పరుగులు చేసింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి సోఫియా డంక్లే (12), కేథరిన్‌ బ్రంట్‌ (7) క్రీజులో ఉన్నారు. స్కివర్‌ (42) రాణించింది. భారత జట్టులో అరంగేట్రం ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (3/77) మూడు వికెట్లు, దీప్తి శర్మ (2/50) రెండు వికెట్లు పడగొట్టారు. స్నేహ్‌తోపాటు భారత్‌ తరఫున షఫాలీ, దీప్తి, పూజ, తానియా భాటియా టెస్టుల్లో తొలిసారి బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌ తరఫున నల్లజాతీయురాలు సోఫియా అరంగేట్రం చేసింది. 


ఆరంభంలో నెమ్మదిగా..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను పేసర్లు జులన్‌, శిఖా పాండే ఆరంభంలో ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత విన్‌ఫీల్డ్‌.. శిఖా బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా ఇన్నింగ్స్‌ తొలి సిక్స్‌ను సాధించింది. అయితే, జోరు మీదున్న విన్‌ఫీల్డ్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన పూజ.. టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చింది. బ్యూమాంట్‌-విన్‌ఫీల్డ్‌ తొలి వికెట్‌కు 69 రన్స్‌ జోడించారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ నైట్‌, బ్యూమాంట్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 86/1తో నిలిచింది. 


ఆఖర్లో దెబ్బకొట్టిన దీప్తి..:

రెండో సెషన్‌లో బ్యూమాంట్‌ వికెట్‌ తీసినా.. టీమిండియా బౌలర్లు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. 31వ ఓవర్‌లో దీప్తి బౌలింగ్‌లో సింగిల్‌తో బ్యూ మాంట్‌ కెరీర్‌లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. అయితే, సెటిల్డ్‌ బ్యాట్స్‌వుమన్‌ బ్యూ  మాంట్‌ను అవుట్‌ చేసిన స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా.. రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరదించింది. షార్ట్‌ లెగ్‌లో షఫాలీ క్యాచ్‌ అందుకోవడంతో బ్యూమాంట్‌ నిష్క్రమించింది. ఈ దశలో నైట్‌కు జతకలసిన స్కివర్‌ ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే, ఆఖరి సెషన్‌లో దీప్తి తన స్పిన్‌ మాయాజాలంతో స్కివర్‌తోపాటు సెంచరీ దిశ గా సాగుతున్న హీథర్‌ను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ జోరుకు కళ్లెం వేసింది. హీథర్‌-స్కివర్‌ మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అమీ జోన్స్‌ (1), ఎల్విస్‌ (5)ను రాణా వెనక్కిపంపింది. 


స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: విన్‌ఫీల్డ్‌ (సి) భాటియా (బి) పూజ 35, బ్యూమాంట్‌ (సి) షఫాలీ (బి) స్నేహ్‌ 66, హీథర్‌ నైట్‌ (ఎల్బీ) దీప్తి 95, స్కివర్‌ (ఎల్బీ) దీప్తి 42, అమీ జోన్స్‌ (ఎల్బీ) స్నేహ్‌ 1, సోఫియా డంక్లే (12 బ్యాటింగ్‌), ఎల్విస్‌ (సి) దీప్తి (బి) స్నేహ్‌ 5, కేథరిన్‌ బ్రంట్‌ (7 బ్యాటింగ్‌); ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 92 ఓవర్లలో 269/6; వికెట్ల పతనం: 1-69, 2-140, 3-230, 4-236, 5-244, 6-251; బౌలింగ్‌: జులన్‌ గోస్వామి 18-2-44-0, శిఖా పాండే 11-3-36-0, పూజా వస్త్రాకర్‌ 12-3-43-1, స్నేహ్‌ రాణా 29-4-77-3, దీప్తి శర్మ 18-3-50-2, హర్మన్‌ప్రీత్‌ 4-0-16-0. 

Updated Date - 2021-06-17T09:23:12+05:30 IST