చరితకు సారథి

ABN , First Publish Date - 2021-08-11T05:30:00+05:30 IST

పంజాబ్‌ రాష్ట్రం... జలంధర్‌కు విసిరేసినట్టుండే మీఠాపూర్‌ గ్రామం. ఓ మధ్యతరగతి కుటుంబం. తొమ్మిదేళ్ల పిల్లాడు వీడియో గేమ్స్‌లో లీనమైపోయేవాడు.

చరితకు సారథి

పంజాబ్‌ రాష్ట్రం... జలంధర్‌కు విసిరేసినట్టుండే మీఠాపూర్‌ గ్రామం. ఓ మధ్యతరగతి కుటుంబం. తొమ్మిదేళ్ల పిల్లాడు వీడియో గేమ్స్‌లో లీనమైపోయేవాడు. పాటలు వింటూ లోకం మరిచిపోయేవాడు. అలాంటి పిల్లవాడు ఒక రోజు నాన్న, అన్నయ్య హాకీ ఆడుతుంటే చూశాడు. ఆటను ఇష్టపడ్డాడు. ఆ ఇష్టమే తరువాత అతడి లోకం అయిపోయింది. భారత హాకీ జట్టుకు కెప్టెన్‌ని చేసింది. నేడు... అతడు 29 ఏళ్ల కుర్రాడు... 130 కోట్ల మంది భారతీయుల ‘ఒలింపిక్‌ పతకం’ కలను నెరవేర్చి... ఘన చరితకు సారథిగా నిలిచిన మన్‌ప్రీత్‌ సింగ్‌  జర్నీ ఇది. 


టోక్యో ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత హాకీ జట్టు జర్మనీపై 5-4తో గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత భారత హాకీ సాధించిన తొలి ఒలింపిక్‌ పతకం అది. దీని వెనక ఎన్నో ఏళ్ల అలుపెరుగని కృషే కాదు... ఆటగాళ్ల త్యాగాలూ ఉన్నాయి. సీనియర్‌... జూనియర్‌ అన్న తేడా లేకుండా... ఆటగాళ్లందర్నీ ఒక జట్టులా ఏకం చేసింది మాత్రం మన్‌ప్రీత్‌ సింగ్‌. నాలుగేళ్ల కిందట కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టును అతడు కొత్త పుంతలు తొక్కించాడు. ఏ ఆటగాడైనా మైదానంలో రాణించాలంటే ప్రధానమైనది ఫిట్‌నెస్‌. ముందుగా దానిపైనే దృష్టి పెట్టాడు. 


‘‘హాకీలాంటి క్రీడల్లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ కీలకం. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి క్షణం వరకు ఒకే రకమైన ప్రదర్శన ఇవ్వాలంటే అది పూర్తి ఫిట్‌నెస్‌ ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే గత కొన్నేళ్లుగా దాని కోసం విపరీతంగా శ్రమించాం. శిక్షణలో మా ట్రైనర్లు కొన్ని రన్నింగ్‌ డ్రిల్స్‌ చేయించారు. అంతేకాదు... జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడూ ‘యోయో టెస్ట్‌’ను దాటాడు. నాకు తెలిసి ప్రస్తుత భారత జట్టు ప్రపంచ హాకీలోనే అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ఉన్న జట్లలో ఒకటి’’ అంటాడు మన్‌ప్రీత్‌. 


గదికి తాళం వేసినా...  

259 అంతర్జాతీయ మ్యాచ్‌లు... ఎన్నో పసిడి పతకాలు... పదేళ్ల మన్‌ప్రీత్‌ కెరీర్‌లో ఎన్నో కలికితురాయిలున్నాయి. ఇప్పుడంటే అతడు ఒక రోల్‌మోడల్‌. కానీ ఒకప్పుడు అసలు మైదానం ముఖం చూసింది లేదు. ఎప్పుడూ ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్‌ ఆడుకునేవాడు. లేదంటే ఏ పాటలో వినేవాడు. అప్పుడతడికి తొమ్మిదేళ్లు. అనుకోకుండా ఒక రోజు అతడి తండ్రి, అన్నయ్య హాకీ ఆడడం చూశాడు. ఆట బాగా నచ్చేసింది. తనూ ఆడాలనుకున్నాడు. కానీ దెబ్బలు తగులుతాయని ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అయితే మన్‌ప్రీత్‌ మనసంతా దానిపైనే! ఆట మొదలుపెట్టాడు. 


‘‘నేను కోచింగ్‌కు బయలుదేరుతున్నా. ఆ సమయంలో మా అన్నయ్య నన్ను లోపల పెట్టి గదికి తాళం వేశాడు. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. మైదానానికి వెళ్లాను. అక్కడ కోచింగ్‌లో అన్నయ్య కూడా ఉన్నాడు. నన్ను చూడగానే కోపంతో ఊగిపోయాడు. కొట్టినంత పని చేశాడు. ‘ఆటపై అంత ఆసక్తి చూపిస్తున్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి కదా’ అని కోచ్‌ అనడంతో ఊపిరి పీల్చుకున్నా’’... చిన్న నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు మన్‌ప్రీత్‌. 


అమ్మే లేకపోతే... 

అయితే మన్‌ప్రీత్‌కు అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఇంట్లో వాళ్లను ఒప్పించి హాకీ స్టిక్‌ పట్టుకున్న కొంత కాలానికి ఊహించని సమస్య. అతడి తండ్రి మానసిక సమస్యలతో సతమతమయ్యారు. దీంతో కుటుంబ భారమంతా మన్‌ప్రీత్‌ తల్లి మంజీత్‌ కౌర్‌పైనే పడింది. ముగ్గురు పిల్లల్ని పోషించడం ఒక ఎత్తయితే... హాకీలో రాణించాలన్న మన్‌ప్రీత్‌ కలను సజీవంగా ఉంచడం మరో ఎత్తు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొడుకు కెరీర్‌ విషయంలో ఆమె రాజీపడలేదు. రకరకాల పనులు చేసి, కుటుంబాన్ని నిలబెట్టారు. 


‘‘నాకు అతిపెద్ద స్ఫూర్తి మా అమ్మే. ఆమె లేకపోతే ఇవాళ నేను లేను. డబ్బు, కీర్తిప్రతిష్టలు... జీవితంలో నేను ఏది సంపాదించినా ఆ ఘనత మా అమ్మకే దక్కుతుంది. మా కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎన్నిటినో త్యాగం చేసింది’’ అంటున్న మన్‌ప్రీత్‌ సింగ్‌ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలూ శ్రమించాడు. 


వాళ్లే ఆరాధ్యులు... 

మన్‌ప్రీత్‌కు చిన్నప్పటి నుంచి హాకీ లెజెండ్‌ పర్గత్‌ సింగ్‌ ఆరాధ్య దైవం. ఆయనదీ అతడి ఊరే కావడంతో మరింత ప్రేరణ పొందాడు. ప్రసిద్ధ ‘సుర్జిత్‌ హాకీ అకాడమీ ఆఫ్‌ జలంధర్‌’లో చేరాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, భారత బాక్సింగ్‌ రాణి మేరీకోమ్‌ల జీవిత గాథలు అతడిలో నిరంతర పోరాట స్ఫూర్తి రగిలిస్తాయి. 2012లో తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన్‌ప్రీత్‌ ఆ తరువాత ఏడాది భారత జూనియర్‌ హాకీ జట్టుకు సారథి అయ్యాడు. ‘జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌, ఆసియా కప్‌, సుల్తాన్‌ ఆఫ్‌ జోహార్‌ కప్‌’లలో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 2014 ‘కామన్వెల్త్‌ గేమ్స్‌’లోనూ జట్టును తుది సమరానికి చేర్చడంలో అతడిదే ప్రధాన పాత్ర. ఈ చిరస్మరణీయ విజయాలు 2017లో మన్‌ప్రీత్‌కు భారత హాకీ సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌ను చేశాయి.  


తండ్రి మరణించినా... 

2016లో ‘సుల్తాన్‌ అజ్లాన్‌షా కప్‌’ సమయంలో మన్‌ప్రీత్‌ తండ్రి మరణించారు. జపాన్‌పై గెలిచిన ఆనందంలో ఉన్న మన్‌ప్రీత్‌కు అది పెద్ద షాక్‌. వెంటనే ఇంటికి వచ్చి, తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. అతడు లేని భారత జట్టు... ఆస్ర్టేలియాతో తరువాతి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో మన్‌ప్రీత్‌ తల్లి... ‘‘వెళ్లి ఆడు. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని మీ నాన్న చెప్పేవారు. ఆయన కలను నిజం చెయ్యి’’ అంటూ ధైర్యం చెప్పారు. తిరిగి టోర్నీలో పాల్గొన్న మన్‌ప్రీత్‌ జట్టును ముందుండి నడిపించి ఫైనల్స్‌కు తీసుకువెళ్లాడు. ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ దక్కించుకున్నాడు. కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేసిన సమయంలో వైరస్‌ బారిన పడ్డ మన్‌ప్రీత్‌... కోలుకోవడమే కాదు, తిరిగి ఆ స్థాయి ఫిట్‌నెస్‌ సంతరించుకోవడం సామాన్యం కాదు. ఇలాంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు అతడి జీవితంలో ఎన్నో. 


పతకంతో వస్తా... 

ఒలింపిక్స్‌ కోసం టోక్యో బయలుదేరే ముందు ‘పతకంతో తిరిగొస్తా’నంటూ మన్‌ప్రీత్‌ ధీమా వ్యక్తం చేశాడు. అన్నట్టుగానే 41 సంవత్సరాల తరువాత అతడి సారథ్యంలోని భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. అంతేకాదు... ఈ ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ‘ఇది తనకు దక్కిన అదృష్టం’ అంటూ సంతోషం వ్యక్తం చేసిన మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పినట్టుగానే భారత హాకీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చాడు.


నాకు అతిపెద్ద స్ఫూర్తి మా అమ్మే. ఆమె లేకపోతే ఇవాళ నేను లేను. డబ్బు, కీర్తిప్రతిష్టలు... జీవితంలో నేను ఏది సంపాదించినా ఆ ఘనత మా అమ్మకే దక్కుతుంది. మా కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎన్నిటినో త్యాగం చేసింది.

Updated Date - 2021-08-11T05:30:00+05:30 IST