చైనా.. బందీఖానా!

ABN , First Publish Date - 2020-02-19T07:58:46+05:30 IST

బయటకు వెళ్లాలంటే భయం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా.. ప్రజా రవాణా వ్యవస్థలేవీ పనిచేయట్లేదు! దీంతో దేశంలో సగం జనాభా.. అంటే 78 కోట్ల మందికిపైగా ఎటూ వెళ్లలేని స్థితి!! ప్రపంచాన్ని వణికిస్తున్న...

చైనా.. బందీఖానా!

  • 78 కోట్ల మందిపై ప్రయాణ ఆంక్షలు
  • ఇప్పటిదాకా 72,436 మందికి వైరస్‌
  • నిర్మానుష్యంగా పలు ప్రధాన నగరాలు
  • కొవిడ్‌-19 మృతుల సంఖ్య 1,868కి


బీజింగ్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బయటకు వెళ్లాలంటే భయం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా.. ప్రజా రవాణా వ్యవస్థలేవీ పనిచేయట్లేదు! దీంతో దేశంలో సగం జనాభా.. అంటే 78 కోట్ల మందికిపైగా ఎటూ వెళ్లలేని స్థితి!! ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ వల్ల చైనీయులు పడుతున్న ఇబ్బంది ఇది. ఎప్పుడూ సందడిగా ఉండే వూహాన్‌, దాని చుట్టుపక్కల నగరాలు భయపెట్టేంత నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.


అయితే లోపల బందీలుగా ఉండిపోయామన్న నిస్పృహ రాకుండా ఉండేందుకు.. వైర్‌సను కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ పెద్దపెద్దగా అరుస్తూ ఒకరినొకరు ఉత్తేజపరుచుకుంటున్నారు. వూహాన్‌ నుంచి భారతీయులను తీసుకువచ్చిన విమాన సిబ్బంది కూడా అక్కడి భయానక పరిస్థితి గురించి వివరించారు. తాము వూహాన్‌ విమానాశ్రయంలో ల్యాండయ్యే సరికి కేవలం ముగ్గురు గ్రౌండ్‌ సిబ్బందే ఉన్నారని.. అంత పెద్ద విమానాశ్రయాన్ని అలా నిర్మానుష్యంగా చూసేసరికి ఏదో జాంబీ సినిమా సెట్టింగ్‌ చూసిన అనుభూతి కలిగిందని కెప్టెన్‌ కమల్‌మోహన్‌ తెలిపారు.కాగా.. చైనాలో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 1868కి చేరింది. 72,436 మంది ఆ వైరస్‌ బారిన పడ్డారు. వైర్‌సకు కేంద్రస్థానమైన వూహాన్‌లో.. బాధితులకు వైద్యం అందిస్తున్న ‘వూచాంగ్‌’ ఆస్పత్రి డైరెక్టరే కొవిడ్‌-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


మరోవైపు.. జపాన్‌ తీరంలో క్వారంటైన్‌గా మార్చిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 542కు చేరింది. నౌకలో ఇప్పటికే వైరస్‌ బారిన పడిన ఆరుగురు భారతీయులూ చికిత్సకు బాగా స్పందిస్తున్నట్టు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. కాగా.. నౌకలో వైరస్‌ బారిన పడనివారిని బుధ, గురు, శుక్రవారాల్లో బయటకు పంపనున్నట్టు తెలిపారు.   వైరస్‌ ముప్పు నేపథ్యంలో అసలే మాస్కుల కొరత భయపెడుతుంటే.. జపాన్‌లో కొందరు దుండగులు రెడ్‌క్రాస్‌ ఆస్పత్రి నుంచి 6000 మాస్కులు దొంగిలించారు.


తల్లి మృతదేహం కోసం..

ప్రయాణ ఆంక్షల కారణంగా.. జనవరి 24 నుంచి చైనాలోని ఒక మార్చురీలో ఉండిపోయిన తన తల్లి మృతదేహాన్ని భారత్‌కు రప్పించాలని ముంబైకి చెందిన ఒక వైద్యుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన పేరు పునీత్‌మెహ్రా. జనవరి 24న ఆయన తన తల్లితో కలిసి మెల్‌బోర్న్‌ నుంచి ముంబైకి విమానంలో వస్తున్నారు. మార్గమధ్యంలో విమానంలోని మరుగుదొడ్డికి వెళ్లిన ఆయన తల్లి.. లోపలే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


విమానాన్ని చైనాలోని ఝెంగ్‌జౌ ఎయిర్‌పోర్టులో దింపేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయారు.మృతదేహాన్ని భారత్‌కు తరలించాలంటే ఫ్యునరల్‌ హోమ్‌లో ఎంబామింగ్‌ చేయించాలి. కానీ ఫ్యునరల్‌ హోమ్స్‌పై ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 7 దాకా తల్లి భౌతికకాయం కోసం ప్రయత్నించిన పునీత్‌ మెహ్రా భారత్‌కు తిరిగి వచ్చేశారు. దీంతో సాయం కోరుతూ రాష్ట్రపతికి, విదేశాంగ శాఖలకు లేఖలు రాశారు. కాగా.. వైర్‌సపై పోరులో భారత్‌ చేసిన సాయానికి చైనా కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు తమ భూభాగంలోకి ప్రవేశించకుండా చైనీయులపై రష్యా నిషేధం విధించిందని అక్కడి వార్తాసంస్థలు వెల్లడించాయి. 



10 శాతం పెరగనున్న ఎల్‌ఈడీ బల్బుల ధర
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఈడీ బల్బులేమైనా కావాలా? అయితే వెంటనే కొనేసుకోండి. మరో పదిరోజులు ఆగితే.. వాటి ధరలు 8 నుంచి 10 శాతం దాకా పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం.. కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌. ఎల్‌ఈడీ బల్బుల తయారీకి అవసరమైన ఎలకా్ట్రనిక్‌ కాంపొనెంట్లు (చిప్స్‌ వంటివి) 30 శాతం దాకా చైనా నుంచే దిగుమతి అవుతాయి. కానీ, వైరస్‌ కారణంగా సరఫరా బాగా తగ్గిందని ఎలక్ట్రిక్‌ ల్యాంప్‌ అండ్‌ కాంపొనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. పరిస్థితి చక్కబడి మళ్లీ ధరలు తగ్గడానికి 3-4 నెలలు పడుతుందని అంచనా వేస్తోంది.  


విశాఖ యువతికి కరోనా పరీక్షలు!
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా కలకలం విశాఖపట్నానికి పాకింది. చైనా నుంచి వారం క్రితం నగరానికి వచ్చిన 18 ఏళ్ల యువతి విరేచనాలు, జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ అనుమానంతో ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. కాగా, సదరు యువతి అంటువ్యాధులు, ఛాతీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించగా.. అవేవీ లేవని తేలిందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరాక యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. జ్వరం, విరేచనాలు తగ్గాయని చెప్పారు. అయితే ముందు జాగ్రత్తగా ఆమె శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు తెలిపారు.

Updated Date - 2020-02-19T07:58:46+05:30 IST