కనబడితే కబ్జా

ABN , First Publish Date - 2022-03-09T06:49:44+05:30 IST

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ(ఎన్నెస్పీ) భూముల్లో అక్రమార్కులు లేఅవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న డ్యాంకు కూత వేటు దూరంలోని టైగర్‌ వ్యాలీలో అటవీ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు.

కనబడితే కబ్జా
సాగర్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం

సాగర్‌లో ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు

అటవీశాఖ భూమినీ వదలని అక్రమార్కులు

నివాస గృహాలు బడా బాబుల చేతుల్లో

పట్టించుకోని మునిసిపాలిటీ, ఎన్‌ఎస్పీ అధికారులు

నార్కట్‌పల్లిలో చెరిగిపోతున్న చెరువుల హద్దులు

నాగార్జునసాగర్‌, నార్కట్‌పల్లి, మార్చి8: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ(ఎన్నెస్పీ) భూముల్లో అక్రమార్కులు లేఅవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న డ్యాంకు కూత వేటు దూరంలోని టైగర్‌ వ్యాలీలో అటవీ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. అయితే వారికి అధికారపార్టీ నేతల అండ ఉండటంతోనే మునిసిపాలిటీ, ఎన్నెస్పీ అధికారులు అటుగా కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నందికొండ(నాగార్జునసాగర్‌) మునిసిపాలిటీలోని ఎన్నెస్పీ క్వార్టర్లను అందులో నివాసించే వారికే కేటాయిస్తామని, 100 గజాల భూమి ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని గత ఏడాది ఫిబ్రవరి 10న నెల్లికల్‌ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా, గత ఏడాది ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో బాడాబాబుల భూదందా మొదలైంది. సాగర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, ప్రస్తుతం సెంటు భూమి లేకుండా కబ్జా చేసేస్తున్నారు.

నాడు నివాస గృహాలు, నేడు ఖాళీ స్థలాలు

సాగర్‌లో రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి కబ్జాల పర్వం పెరిగింది. నందికొండ మునిసిపాలిటీ ఏర్పడక ముందు సాగర్‌ హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల్లో ఖాళీగా ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్ల తాళాలు తీసిమారి అక్రమార్కులు కబ్జా చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి వాటిని ఇతరులకు విక్రయించారు. దీనికి అధికార పార్టీ నేతల అండ ఉందని ఆరోపణలు ఉన్నాయి. పలు ఎన్నెస్పీ క్వార్టర్లు పలువురు ప్రజాప్రతినిధుల పేరుతో అలాట్‌ అయి ఉన్నాయి. మరికొన్ని కబ్జాకు గురయ్యాయి. చివరికి ఎన్‌ఎస్పీ అధికారులు స్థానికంగా నివాసం ఉండేందుకు క్వార్టలర్లు లేక హైదరాబాద్‌, నల్లగొండ, మిర్యాలగూడలో ఉంటూ వచ్చిపోతున్నారు. ప్రస్తుతం క్వార్టర్ల అక్రమణలు పూర్తికాగా, ఖాళీ స్థలాలపై వారి కన్నుపడింది. ప్రభుత్వ, అటవీశాఖ భూములు కబ్జా చేస్తూ బహుళ అంతస్థులు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

డబ్బులిస్తే ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం : మునినాయక్‌, కాంగ్రెస్‌ నాయకుడు

సాగర్‌లోని హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల్లో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమార్కులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. వారి నుంచి ముడుపులు ముడుతుండటంతో అధికార పార్టీ నాయకులు అక్రమార్కుల జోలికి వెళ్లడం లేదు. డబ్బు ఇవ్వలేని నిరుపేదలు చిన్న గుడిసె వేసుకున్నా మునిసిపల్‌, ఎన్నెస్పీ అధికారులతో కూల్చివేయిస్తున్నారు. డబ్బులిస్తే ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం అవుతోంది.

అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు : సైదులుగౌడ్‌, పెద్దవూర తహసీల్దార్‌

నందికొండ మునిసిపాలిటీలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించినా, అక్రమ కట్టడాల నిర్మాణం చేసినా నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 14 అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. మరో విడత అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపడతాం.


మాయమవుతున్న చెరువు శిఖం

నార్కట్‌పల్లి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం విస్తరిస్తుండగా, చెరువులు, కుంటలు ఆక్రమణల కు గురవుతున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నీటిపారుదలశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో చెరువులు, కుంటలు ఆనవాళ్లు కోల్పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రియల్‌ బూంతో

నార్కట్‌పల్లి నుంచి జాతీయ రహదారులు వెళ్తుండ గా, ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధి చెందుతోంది. దీంతో గత ఎనిమిదేళ్లుగా రియల్‌బూం పెరిగింది. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను చెరువు శిఖాలపై పడింది. సంబంధిత అధికారులతో వారు కుమ్మక్కై చెరువు శిఖాల్లో వెంచర్లు చేసి చేసి విక్రయిస్తుండగా, వాటిని కొనుగోలుచేసిన వారు కొన్నాళ్ల తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెర్వుగట్టు రెవెన్యూ శివారు పరిధిలో ఓ కుంట శిఖంలో ఏర్పాటుచేసిన యశోధర టౌన్‌షిప్‌ వివాదమే ఇందు కు నిదర్శనం. ప్రధానంగా మండల కేంద్రంతో పాటు ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు, ఏపీలింగోటం, ఎం.ఎడవల్లి, గోపలాయపల్లి గ్రామాల్లో రియల్‌ వ్యాపారం జోరుగా ఉండగా, కబ్జాల పర్వం కూడా అంతేస్థాయి లో కొనసాగుతోంది. అయితే చెరువులు, కుంటలకు హద్దురాళ్లు లేకపోవడంతో అక్రమార్కుల పని సులభమవుతోంది. భూములు ఆక్రమణకు గురికాకుండా అటవీశాఖ హద్దురాళ్లుగా కాంక్రీట్‌ దిమ్మెలు ఇటీవల ఏర్పాటుచేసింది. అందుకు ఒక్కో దిమ్మెకు రూ.7000 చొప్పున వెచ్చించింది. ఈ కాంక్రీట్‌ దిమ్మెలను కూల్చడం అంత సులువు కాదు. దీంతో చెరువు శిఖాల్లో సైతం ఇలాంటి దిమ్మెలు ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.

హద్దురాళ్ల టెండర్‌ రద్దు

చెరువు శిఖాలు అన్యాక్రాంతం కాకుండా హద్దురాళ్ల ఏర్పాటుకు గతంలో టెండర్లు పిలిచారు. చర్లపల్లి చెరువుకు శిఖంలో ఇలాంటి హద్దురాళ్లను ఒక్కోటి రూ.2,500 వెచ్చించి ఏర్పాటుచేశారు. నార్కట్‌పల్లి పెద్ద చెరువు వద్ద సైతం ఇలాంటి దిమ్మెల ఏర్పాటుకు టెండర్లు పిలవగా, కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో దాన్ని రద్దు చేశారు. ఆ తరువాత మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

ఫిర్యాదులు వస్తే సర్వే చేస్తున్నాం : పావని, ఐబీ డీఈఈ

డివిజన్‌ పరిధిలో చెరువు లేదా కుంట ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి సర్వే చేసి హద్దులు నిర్ధారిస్తున్నాం. పట్టాభూములుంటే సాగు మాత్రమే చేసుకోవాలని, పక్కా నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరిస్తున్నాం. హద్దురాళ్లు ఏర్పా టు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ విషయా న్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.

విచారించి చర్యలు తీసుకుంటాం : పల్నాటి శ్రీనివా్‌సరెడ్డి, తహసీల్దార్‌

చెర్వులు,కుంటల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. సర్వే నిర్వహించి భూ ఆక్రమణ నిజమని తేలితే స్వాధీనం చేసుకోవడంతోపాటు చట్టపర చర్యలు తీసుకుంటాం.


అక్రమంగా మట్టి తరలింపు

తిరుమలగిరి(సాగర్‌): మండలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూముల నుంచి యథేచ్ఛగా మట్టి తరలిపోతోంది. మండలంలోని ఎల్లాపురంతండాలో సర్వేనెంబర్‌ 229లో ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎక్స్‌కవేటర్‌ సహాయంతో మట్టి తవ్వి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ మట్టిని సుమారు రూ.500 చొప్పున అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. కొద్ది నెలలుగా ఈ దందా కొనసాగుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుట్ట వద్ద సుమారు 10ఎకరాల ప్రభుత్వం భూమి కబ్జాకుగురైంది. ఇటీవల రంగుండ్ల సమీపంలో సైతం గుట్టను ఆక్రమించి తవ్వకాలు ప్రారంభించారు.

Updated Date - 2022-03-09T06:49:44+05:30 IST