దర్జాగా చెరువు కబ్జా

ABN , First Publish Date - 2022-01-28T06:04:14+05:30 IST

మండల కేంద్రం సమీపంలోని ముత్యాలమ్మ చెరువు ఆయకట్టు భూమి ఆక్రమణకు గురవుతోంది. గ్రామస్థులు, మత్స్యకారులు అడ్డు చెప్పినా; అధికారులు హెచ్చరించినా ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు.

దర్జాగా చెరువు కబ్జా
చెరువు ఆయకట్టులో మట్టి తోలి చదును చేయిస్తున్న ఆక్రమణదారులు

 గ్రామస్థులు, మత్స్యకారులే అడ్డుచెప్పినా వినని వైనం 

అధికారుల హెచ్చరికలూ బేఖాతర్‌

పన్‌పహాడ్‌, జనవరి 27 : మండల కేంద్రం సమీపంలోని ముత్యాలమ్మ చెరువు ఆయకట్టు భూమి ఆక్రమణకు గురవుతోంది.  గ్రామస్థులు, మత్స్యకారులు అడ్డు చెప్పినా;  అధికారులు హెచ్చరించినా ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు. స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం సమీపంలోని ముత్యాలమ్మ చెరువు సుమారు 75 ఎకరాల్లో విస్తరించగడా, ఆయకట్టు 25 ఎకరాలు ఉంది. 1989 నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన 53 మంది మత్స్యకారులు చెరువులో చేపల వేట జీవనాధారంగా జీవిస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని 25 ఎకరాల్లో 18 మంది రైతులు సేద్యం చేస్తూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన ముస్లింలు గురువారం కబరస్థాన్‌ ఈద్గా నిర్మాణాల కోసం నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు చెరువు భూమిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో పూడ్చి, చదును చేశారు. భూఆక్రమణను అడ్డుకోవాలని మత్స్యకా రులు తహసీల్దార్‌ శేషగిరిరావుకు సమాచారం ఇచ్చి వినతిపత్రం కూడా అందజేశారు. 

సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు వెళ్లి మొరపెట్టుకున్నప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చెరువు ఆక్రమణ రాత్రి వరకు కొనసాగుతూనే ఉందని మత్స్యకారులు బంటు రాములు, నారాయణ, రామనర్సయ్య, లింగయ్య, శంకర్‌, సైదులు, వెంకన్న తెలిపారు.

అధికారులు హెచ్చరించినా..

చెరువు ఆక్రమణపై మత్స్యకార్మికుల ఫిర్యాదు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఐబీ ఏఈ లింగయ్య ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించి, పనులు నిలిపివేయాలని ఆదేశించి వెళ్లారు. అయినప్పటికీ చదును, పూడ్చివేత పనులు ఆక్రమణదారులు కొనసాగించారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. అనుమతులు లేకుండా చెరువును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 





Updated Date - 2022-01-28T06:04:14+05:30 IST