Abn logo
May 11 2021 @ 11:38AM

ఆగిన లారీని ఢీకొన్న కారు.. యువకుడి మృతి

  •  ఐదుగురికి గాయాలు 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన

హైదరాబాద్/మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో సోమవారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన వబలోజు కోటాచారి(28), తాడోజు వెంకటాచారిలు 15 ఏళ్లుగా కార్పెంటర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉండటంతో భార్యాపిల్లలను నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంలోని స్వగ్రామంలో దించేందుకు ఆదివారం స్వగ్రామం వచ్చారు. కోదాడలో ఉన్న వీరి బంధువుకు బాగోలేదని తెలియడంతో పరామర్శించేందుకు 8 మంది కుటుంబ సభ్యులతో కారులో సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. 


కోటా చారి డ్రైవింగ్‌ చేస్తుండగా కారులో అతడి భార్య ధనలక్ష్మి, బావ వెంకటాచారి, చెల్లెలు నాగలక్ష్మి, తల్లి గిరమ్మ, కోడలు హని, చెర్రీ, కుమార్తె ఉన్నారు. మునగాల మండల కేంద్రానికి చేరుకోగానే జాతీయ రహదారిపై ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. దీంతో ఈ ప్రమాదంలో వబలోజు కోటాచారి(28) అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో వెళ్లి లారీ కింద చిక్కుకున్న కారులో ప్రయాణిస్తున్న వారిని బయటికి తీశారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటాచారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. నాగలక్ష్మి, ధనలక్ష్మి, ఇతరులను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. కోటాచారికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

క్రైమ్ మరిన్ని...