లోయలో కారు బోల్తా

ABN , First Publish Date - 2021-11-07T13:56:02+05:30 IST

ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌ సమీపంలో 200 అడుగుల లోయలో కారు బోల్తాపడి పసిబిడ్డ సహా ముగ్గురు మృతి చెందారు. మదురై జిల్లా సమయనల్లూరు సమీపం తేనూరులో గోకుల్‌ (30), నందిని భారతి (27) అనే

లోయలో కారు బోల్తా

- పసిబిడ్డ సహా ముగ్గురి దుర్మరణం

- కొడైకెనాల్‌ వద్ద దుర్ఘటన

   

చెన్నై(Chennai): ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌ సమీపంలో 200 అడుగుల లోయలో కారు బోల్తాపడి పసిబిడ్డ సహా ముగ్గురు మృతి చెందారు. మదురై జిల్లా సమయనల్లూరు సమీపం తేనూరులో గోకుల్‌ (30), నందిని భారతి (27) అనే దంపతులు నివసిస్తున్నారు. గోకుల్‌ మదురై హైకోర్టు బెంచ్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరికి యాళిని అనే మూడు నెలల కుమార్తె ఉంది. శుక్రవారం గోకుల్‌, నందిని భారతి, గోకుల్‌ అత్తగారైన అళగురాణి (48), బావమరిది కార్తికేయన్‌ (25)తో కలిసి కారులో కొడైకెనాల్‌కు విహారయాత్రగా వెళ్ళారు. కొడైకెనాల్‌లో అన్ని ప్రాంతాలను దర్శించిన తర్వాత గోకుల్‌ అత్తగారైన అళగురాణి స్వస్థలమైన సుబ్బులాపురానికి అందరినీ వెంటబెట్టుకుని కొడైకెనాల్‌ అడుక్కమ్‌ రహదారిలో కారులో బయలుదేరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ మార్గంలో పలుచోట్ల మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో కెళవిపారై అనే మలుపువద్ద ఆ కారు వెళుతుండగా అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న 200 అడుగుల లోతు లోయలో బోల్తాపడింది. కారు లోయలో పడిన శబ్దం విని సమీప ప్రాంతాల్లో నివసిస్తున్నవారంతా అక్కడికి పరుగెత్తుకెళ్ళారు. లోయలో పడిన కారును చూసి వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం సభ్యులు లోయలో పడిన కారు శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే కారులో ప్రయాణించిన గోకుల్‌ భార్య నందిని భారతి, అళగురాణి, మూడేళ్ల కుమార్తె తీవ్రగాయాలతో మృతి చెందినట్టు కనుగొన్నారు. ముగ్గురి మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన గోకుల్‌, ఆయన బావమరిది కార్తికేయన్‌ను వెలికి తీశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపారు. వైద్యనిపుణులు వారికి చికిత్సలందిస్తున్నారు. లోయలో పడి ధ్వంసమైన లగ్జరీ కారును కూడా అగ్నిమాపకదళం సభ్యులు వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.



Updated Date - 2021-11-07T13:56:02+05:30 IST