నర్సీపట్నంలో కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-09-29T06:00:50+05:30 IST

స్థానిక ఐదు రోడ్ల కూడలిలో కారు బీభత్సం సృష్టించింది.

నర్సీపట్నంలో కారు బీభత్సం
ప్రమాదం జరిగిన నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలి

వృద్ధుడి మృతి, ఇద్దరు విద్యార్థులకు గాయాలు

మైనర్‌ బాలుడు డ్రైవింగ్‌ చేస్తుండగా ప్రమాదం


నర్సీపట్నం, సెప్టెంబరు 28: స్థానిక ఐదు రోడ్ల కూడలిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వృద్ధుడు మృతిచెందగా, ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా కారు డ్రైవింగ్‌ చేస్తున్నది బాలుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ ఎస్‌ఐ దివాకర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తవీధికి చెందిన పదిహేడేళ్ల బాలుడు విశాఖలో పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మునిసిపల్‌ ఆఫీస్‌ పక్కన నివాసం వుంటున్న హరి అనే వ్యక్తి (కుటుంబ స్నేహితుడు) ఇంటికి వెళ్లి, చిన్న పని నిమిత్తం కారు కావాలని, తనకు డ్రైవింగ్‌ వచ్చని చెప్పాడు. దీంతో అతను కారు తాళాలు ఇచ్చాడు. బాలుడు అక్కడి నుంచి కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ మునిసిపల్‌ కార్యాలయం రోడ్డు నుంచి ఐదు రోడ్ల కూడలి వైపు వస్తున్నాడు. ఈ సమయంలో బ్రేక్‌ అనుకుని ఎక్స్‌లేటర్‌పై కాలు పెట్టడంతో కారు అదుపుతప్పి, ఎదురుగా మోటార్‌ సైకిల్‌పై వస్తున్న పీనారిపాలేనికి చెందిన రుత్తల చిన్నఅయ్యన్నపాత్రుడు(65)ని ఢీకొన్నది. తర్వాత జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను, పార్కింగ్‌ చేసి వున్న బైక్‌ని, గ్రంథాలయం ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చినఅయ్యన్నపాత్రుడుకి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతిచెందాడు. నిందితుడిని అదుపులోక తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ట్రాఫిక్‌ ఎస్‌ఐ దివాకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-09-29T06:00:50+05:30 IST