సీపీఎం అగ్రనేతలతో సీఎం కేసీఆర్ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ABN , First Publish Date - 2022-01-08T23:56:01+05:30 IST

రళ సీఎం పినరయి విజయన్‌, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు.

సీపీఎం అగ్రనేతలతో సీఎం కేసీఆర్ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

హైదరాబాద్: కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో విజయన్‌, ఏచూరికి కేసీఆర్ విందు ఇచ్చారు. శుక్రవారమే కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ కావాల్సి ఉంది. అనివార్యకారణాలతో భేటీ వాయిదా పడింది. అందువల్ల ఈ రోజు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విందు అనంతరం సీపీఎం నేతలతో గంటన్నరపాటు కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దేశంలో బీజేపీని ఎలా నిలువరించాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు పెద్దలు సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో కమలం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాషాయదళాన్ని నిలువరించేందుకు కొత్త ఎత్తులు, పొత్తులతో కేసీఆర్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులోభాగంగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు గులాబీ బాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కమ్యూనిస్టులతో కలిసి టీఆర్‌ఎస్ పనిచేసింది. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు తోడైతే తమకు అదనపు బలవుతుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎం మమత బెనర్జీ, సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఆ ప్రక్రియకు మధ్యలో బ్రేకులు పడింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా కేసిఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఎంకు కేసీఆర్ స్నేహహస్తం అందిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Updated Date - 2022-01-08T23:56:01+05:30 IST