మినీ మునిసిపోల్స్‌లో..కార్‌ స్వీప్‌

ABN , First Publish Date - 2021-05-04T08:56:26+05:30 IST

మినీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది.

మినీ మునిసిపోల్స్‌లో..కార్‌ స్వీప్‌

  • రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలూ గులాబీ వశం
  • గ్రేటర్‌ వరంగల్‌లో 51 స్థానాల్లో కారు జయకేతనం
  • అక్కడ 10 చోట్ల బీజేపీ గెలుపు.. డీలాపడ్డ కాంగ్రెస్‌
  • ఖమ్మం కార్పొరేషన్‌లో మళ్లీ గులాబీ గుబాళింపు
  • వరంగల్‌లో బీజేపీతో, ఖమ్మంలో కాంగ్రెస్‌తో పోటీ
  • సిద్దిపేటలో వన్‌సైడ్‌.. జడ్చర్లలో 27కి 23 వార్డులు
  • కొత్తూరు, నకిరేకల్‌, అచ్చంపేట మునిసిపాలిటీల్లో సగానికి పైగా వార్డులు అధికార పార్టీ ఖాతాలోనే
  • డివిజన్లు, వార్డుల వారీగా బీజేపీపై కాంగ్రెస్‌ పైచేయి


హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): మినీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. అటు సాగర్‌ ఉప ఎన్నికల్లో.. ఇటు మినీ మునిసిపోల్స్‌లోనూ గెలవడం ద్వారా దుబ్బాక ఓటమి భారం నుంచి భారీ ఉపశమనాన్ని పొందింది. ఖమ్మం కార్పొరేషన్లోను, ఐదు మునిసిపాలిటీల్లోనూ టీఆర్‌ఎ్‌సకు ప్రధాన పోటీదారుగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ.. మొత్తంగా బీజేపీ కంటే మెరుగైన ఫలితాలనే సాధించింది. తద్వారా ప్రత్యామ్నాయ రేసులో వెనుకబడకుండా చూసుకుంది. అంతేకాదు..జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్లో బీజేపీ సిట్టింగ్‌ సీటును కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా చేజిక్కించుకుంది. రాష్ట్రంలో వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌, సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీలకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌, మెట్‌పల్లి, బోధన్‌, పరకాల, గజ్వేల్‌ మునిసిపాలిటీల్లోని ఒక్కో వార్డుకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ఓట్ల లెక్కింపునుఎన్నికల కమిషన్‌ సోమవారం  చేపట్టింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.


ఇదీ లెక్క..

వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకుగాను 51 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ ప్రధాన పోటీదారుగా నిలిచిన బీజేపీ.. పది డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను దక్కించుకోగలిగింది. ఇతరులు 3 డివిజన్లలో గెలిచారు. ఇక.. ఖమ్మం కార్పొరేషన్లో సీపీఐతో కలిసి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌.. ఇక్కడా ఏకపక్ష విజయాన్నే నమోదు చేసింది. టీఆర్‌ఎ్‌సతో పొత్తు కుదుర్చుకున్నందుకు తగిన ప్రయోజనాన్ని దక్కించుకున్న సీపీఐ.. 2 డివిజన్లను దక్కించుకుంది. ఇక ఇక్కడ టీడీపీ, సీపీఎంలతో కాంగ్రెస్‌ పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలిచి 10 డివిజన్లను దక్కించుకుంది. సీపీఎం రెండు డివిజన్లలో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్‌ కూటమికి 12 డివిజన్లు దక్కాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ.. ఇక్కడ బోణీ కొట్టింది. ఒక డివిజన్లో గెలిచింది. స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు. మిగిలిన 43 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే పట్టం కట్టిన వరంగల్‌, ఖమ్మం ప్రజలు మరోసారి టీఆర్‌ఎ్‌సకు మద్దతుగా నిలిచినట్లయింది. 


మునిసిపాలిటీల విషయానికి వస్తే.. మంత్రి హరీ్‌షరావు ఇలాకా అయిన సిద్దిపేట మునిసిపాలిటీలో 43 వార్డులకుగాను 36 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క వార్డునూ దక్కించుకోలేదు. బీజేపీకి మాత్రం ఒక వార్డు దక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలను పక్కకు నెట్టి... ఇతరులు 6 వార్డులను కైవసం చేసుకున్నారు. అటు నకిరేకల్‌ మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను టీఆర్‌ఎ్‌సకు 11 దక్కగా.. కాంగ్రె్‌సకు రెండు వార్డులే దక్కాయి. ఇక్కడా ఇతరులు ఏడు వార్డులను కైవసం చేసుకున్నారు. కొత్తూరు మునిసిపాలిటీలో టీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. మొత్తం 12 వార్డులకుగాను ఏడు వార్డులను అధికార టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ ఐదు వార్డులను దక్కించుకుంది. జడ్చర్ల మునిసిపాలిటీలో 27 వార్డులకుగాను 23 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీలు చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అచ్చంపేట మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను 13 టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. కాంగ్రెస్‌ ఆరు, బీజేపీ ఒక వార్డు చొప్పున దక్కించుకున్నాయి. మరోవైపు.. వివిధ మునిసిపాలిటీల్లోని ఐదు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మూడు వార్డుల్లోను, కాంగ్రెస్‌, బీజేపీలు చెరో వార్డులోనూ గెలిచాయి. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి పరిధిలోని లింగోజీ గూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవగా.. పరకాల మునిసిపాలిటీలోని ఓ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. మిగిలిన మూడు వార్డులూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 


కాంగ్రె్‌సకు ఊరట..!

ఎన్నికలు జరిగిన అన్నిచోట్లా బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. 

ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ 10 డివిజన్లు దక్కించుకోగా.. బీజేపీ ఒకటి మాత్రమే గెలిచింది. 

వరంగల్‌ కార్పొరేషన్లో బీజేపీ పది డివిజన్లు గెలవగా కాంగ్రెస్‌ 2 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది.  

జడ్చర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు పార్టీలూ చెరిసమానంగా వార్డులు దక్కించుకున్నాయి. 

సిద్దిపేటలో బీజేపీకి ఒక వార్డు దక్కగా.. కాంగ్రెస్‌ బోణీ కూడా కొట్టలేకపోయింది.

అచ్చంపేటలో కాంగ్రె్‌సకు 6 వార్డులు రాగా.. బీజేపీకి ఒక్కటే దక్కింది. కాంగ్రెస్‌ కొత్తూరులో 5 వార్డుల్లో, నకిరేకల్‌లో 2 వార్డుల్లో గెలవగా.. ఆ రెండు చోట్లా బీజేపీకి అసలేమీ రాలేదు. వెరసి ఐదు మునిసిపాలిటీల్లో 15 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలుపొందగా.. బీజేపీకి దక్కినవి నాలుగే.. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కనిపించిన టీఆర్‌ఎస్‌ హవా.. మినీ మునిసిపోల్స్‌లో కొనసాగిందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పెద్ద విజయాలను నమోదు చేయకున్నా.. టీఆర్‌ఎస్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రత్యామ్నాయ రేసులో బీజేపీతో కొత్త తలనొప్పులు రాకుండా చూసుకోగలిగింది. అలాగే.. ప్రత్యామ్నాయ రేసులో మరింత ముందుకు దూసుకుపోయే అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేక పోయిందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. 


ప్రజలకు కృతజ్ఞతలు: సీఎం కేసీఆర్‌  

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్‌ఎ్‌సను గెలిపించి.. 74ు వార్దుల్లో పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్‌ఎ్‌సను, 3 స్థానాల్లో మిత్రపక్షమైన సీపీఐని.. వెరసి 184 స్థానాల్లో గెలిపించి, టీఆర్‌ఎ్‌సకు తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీయే మా పార్టీ’’ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని తెలిపారని హర్షం వ్యక్తం చేశారు. కాగా.. సిద్దిపేట మునిసిపాలిటీని టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యంతో కైవసం చేసుకోవడం సంతోషాన్నిచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  

Updated Date - 2021-05-04T08:56:26+05:30 IST