అక్రమ దందాకు కేరాఫ్‌ పరిగి టౌన్‌

ABN , First Publish Date - 2021-03-05T05:38:30+05:30 IST

అక్రమ దందాకు కేరాఫ్‌ పరిగి టౌన్‌

అక్రమ దందాకు కేరాఫ్‌ పరిగి టౌన్‌
పరిగిలో ఇటీవల పట్టుబడిన కూల్‌డ్రింక్స్‌ మెటీరియల్‌ (ఫైల్‌)

  • యఽధేచ్ఛగా రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తుపదార్థాల రవాణా  
  • ధనార్జనే ధ్యేయంగా వ్యాపారుల పన్ను ఎగవేత 
  • మామూళ్ల మత్తులో ఆయా శాఖలు.. 
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి


 జిల్లాలోని పరిగి పట్టణం అక్రమ వ్యాపారానికి కేంద్రంగా మారింది. పరిగి చిన్న కేంద్రమైనా సరిహద్దులోని నాలుగైదు జిల్లాల వ్యాపార లావాదేవీలకు అడ్డాగా కొనసాగుతోంది. ఇక్కడ జరిగే వివిధ రకాల చట్టవ్యతిరేక వ్యాపారాలతో అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వ్యాపారులు అడ్డదారిని ఎంచుకుంటున్నారు.


పరిగి: పరిగి కేంద్రంలో అక్రమ బియ్యం, బెల్లం, కల్తీకల్లు తయారు చేసే రసాయనాలు, కలప, గంజాయి, మత్తు పదార్థాలు, కలప ఇలా అనేక రకాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం పన్ను ఎగవేత దందా వెలుగుచూడడంతో ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మాముళ్లు అందుతుండటంతో అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యాపారులు కేసు పెడితే ఏమవుతుందిలే.. అనే ధోరణిలో ఉంటున్నారు. ఒకరిద్దరు గత ఆరేడేళ్ల వ్యవధిలో అనేకమార్లు పట్టుబడినా వారిపై నామమాత్రపు కేసులు నమోదు చేయడంతో వారి అక్రమ దందాకు అడ్డుకట్టపడటం లేదు. పట్టుబడినవారిపై కేసులు పెట్టేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారంటే, పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మూడు రోజుల క్రితం పరిగిలో జీరో దందా కింద భారీ ఎత్తున కూల్‌డ్సింక్‌, ఇతర సరుకులు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయంలో పోలీసులు తమ పరిధిలోకి రాదని సున్నితంగా తప్పించుకుని, వాణిజ్య పన్నుల శాఖ వారికి లేఖ రాశారు. బుధవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారుల బృందం పరిగికి వచ్చి రూ.కోటికి పైగా విలువ చేసే జీరో మెటీరియల్‌ లభిస్తే రూ.3,93,500 జరిమానా విధించి తమ పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. అయితే సదరు వ్యాపారిపై కేసు పెట్టాల్సింది పోయి జరిమానాతోనే సరిపెట్టారు. పరిగి కేంద్రంగా జరిగే అక్రమ వ్యాపారాలను షాద్‌నగర్‌, కొడంగల్‌, వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల, మహమూబ్‌నగర్‌, శంకర్‌పల్లి, నారాయణపేట్‌, సదాశివపేట్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ ప్రాంతాలకు విస్తరించి దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


అక్రమ దందాపై గట్టి నిఘా పెట్టాం : డీకే లక్ష్మీరెడ్డి, సీఐ, పరిగి 

అక్రమ దందా, రవాణపై గట్టి నిఘా పెట్టాం. ఇటివల పట్టుబడిన పన్ను ఎగవేత వ్యాపారం గురించి వాణిజ్య పన్నులశాఖకు లేఖ రాయడంతో వారు భారీ జరిమానా విధించారు. చట్ట వ్యతిరేక దందాలు చేసే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణ జరుగుతున్న విషయాన్ని మా దృష్టికి తీసుకువస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-03-05T05:38:30+05:30 IST