Abn logo
Nov 3 2020 @ 01:29AM

సంరక్షణ విధానాలే శరణ్యం

సంరక్షణ విధానాలను అనుసరించవద్దన్న రఘురామ్ రాజన్ సలహాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను రాజకీయ నాయకుల-, ప్రభుత్వాధికారుల కూటమి నియంత్రిస్తుందన్న వాస్తవాన్ని రఘురామ్ రాజన్ గుర్తించ లేదు.


వాణిజ్యంలో పోటీ అనివార్యం. దేశీయ విపణిలో ఇద్దరు వ్యాపారుల మధ్య ఉన్నట్టే అంతర్జాతీయ విపణిలో దేశాల మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను సంరక్షించేందుకు ప్రభుత్వాలు పలు పద్ధతులు అనుసరిస్తుంటాయి. దిగుమతులపై అధిక సుంకాలు విధించడం అటువంటి పద్ధతులలో ఒకటి. ఇటీవల మన ప్రభుత్వం కొన్ని ఉత్పత్తుల విషయంలో దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఇటువంటి సంరక్షణ విధానాల వల్ల పెద్దగా ప్రయోజనముండబోదని, పైగా దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని కొంత మంది ఆర్థికవేత్తల వాదన. రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సైతం దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ‘సంరక్షణవాద’ మార్గాన్ని అనుసరించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ హెచ్చరిక సబబేనా? 


1991లో ఆర్థిక సంస్కరణలకు ఉప్రకమించక ముందు మనదేశం సంరక్షణ విధానాలనే అమలుపరిచింది. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థకు వినాశనకర ఫలితాలు మాత్రమే సమకూరాయి. అప్పట్లో మన దేశంలో లైసెన్స్ పర్మిట్ విధానాలు రాజ్యమేలుతుండేవి. ఫలితంగా కొన్ని దేశీయ కంపెనీలు గుత్తాధిపత్యపు లాభాలు దండుకునేవి. తమ లాభార్జనలో కొంత భాగాన్ని రాజకీయ నాయకులు,- ప్రభుత్వాధికారుల కూటమికి పంచేవి. ఈ ఆదాయ లబ్ధికి మన రాజకీయవేత్తలు, ప్రభుత్వాధికారులు జట్టుకట్టేవారని మరి చెప్పనవసరం లేదు. 


అప్పట్లో దిగుమతులను నిరోధించే లక్ష్యంతోనే సుంకాలను భారీస్థాయిలో విధించేవారు. కొన్ని ఉత్పత్తులపై సుంకాలు 150 శాతం మేరకు ఉండేవి భారీ సుంకాలతో పాటు పరిమాణాత్మక పరిమితులను కూడా విరివిగా విధించేవారు. ఉదాహరణకు ఎవరైనా ఒక భారతీయ పౌరుడు 150శాతం దిగుమతి సుంకం చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ అతను తనకు కావలసిన చిన్నకారును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించేది కాదు!


ఇటువంటి విధానాల వల్లే మన దేశీయ పరిశ్రమలకు దిగుమతుల నుంచి సంపూర్ణ రక్షణ లభించేది. అవి తమ ఉత్పత్తులను ఎలాంటి పోటీ భయం లేకుండా భారీ ధరలకు విక్రయించుకునేవి. తద్వారా ఆర్జించిన లాభాలను రాజకీయ నాయకుల- ప్రభుత్వాధికారుల కూటమికి సముచిత రీతిలో పంచేవారు. 


ఉదాహరణకు ఒక ట్యూబ్‌లైట్ ఉత్పత్తి వ్యయం మన దేశంలోనూ, చైనాలోనూ రూ.500 ఉందనుకుందాం. ఆర్థిక సంస్కరణలకు పూర్వం మన ప్రభుత్వం దిగుమతి అయ్యే ట్యూబ్‌లైట్పై రూ.200 సుంకం వసూలు చేసేది. దీనివల్ల దిగుమతి అయిన ట్యూబ్‌లైట్ ధర రూ.700కి పెరిగేది. దేశీయ ఉత్పత్తిదారులు కూడా తమ ఉత్పత్తులకు రక్షణ ఉందనే భరోసాతో తమ ట్యూబ్‌లైట్ ధరను రూ.700కి పెంచేవారు.- దిగుమతి సుంకాలు భారీగా ఉండడం వల్ల విదేశీ ఉత్పత్తుల నుంచి, లైసెన్స్ పర్మిట్‌రాజ్ వల్ల దేశీయ పోటీ నుంచి వారికి రక్షణ సమకూరేది. అలా ఒక్కో ట్యూబ్‌లైట్పై రూ.200 అనుకోని లాభాన్ని రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులకు పంచేవారు. దిగుమతి సుంకాలను భారీ స్థాయిలో వసూలు చేయడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు ఎదురయ్యే ఇటువంటి హానిని రఘురామ్ రాజన్ గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు ఆయన్ని అభినందించవలసిందే. అయితే రాజకీయ నాయకులు -ప్రభుత్వాధికారుల కూటమి ఇలా అక్రమార్జనలకు పాల్పడడాన్ని అరికట్టడంలో మన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. మార్గాంతరమేమిటి? సంరక్షణ విధానాలే శరణ్యం. 


ఆర్థిక సంస్కరణలకు పూర్వం ఉన్న పరిస్థితులకు, ప్రస్తుతమున్న పరిస్థితులకు మధ్య మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటి తేడా, గతంలో మనం దిగుమతులపై పరిమాణాత్మక పరిమితులతో పాటు నిరోధక సుంకాలు అంటే భారీ సుంకాలను విధించే వాళ్ళం. ఇంతకుముందు ప్రస్తావించినట్టు 150శాతం సుంకం చెల్లించడానికి సిద్ధమయినప్పటికీ ఎవరూ చిన్న కారును దిగుమతి చేసుకోవడం సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతానికి వస్తే మనం దిగుమతి సుంకాలను స్వల్ప స్థాయిలో పెంచాం. ఉదాహరణకు ప్రభుత్వం ఒక ట్యూబ్‌లైట్ పై రూ.200 దిగుమతి సుంకం విధిస్తే రాజకీయ నాయకుల- ప్రభుత్వాధికారుల కూటమి గరిష్ఠంగా రూ.200 మాత్రమే దండుకోగలుగుతుంది. కనుక ఈ అక్రమార్జనకు ఇప్పుడు ఒక గరిష్ఠ పరిమితి ఉంది. 


రెండో వ్యత్యాసం, 1980 దశకంలో దేశీయ గుత్తాధిపత్యాలకు అమిత ప్రాధాన్యముండేది. ఉదాహరణకు టాటా కంపెనీ దశాబ్దాల క్రితమే చిన్నకార్లను ఉత్పత్తి చేసేందుకు ఉబలాటపడింది. అయితే చిన్న కార్ల ఉత్పత్తిరంగంలో బిర్లాల గుత్తాధిపత్యాన్ని కాపాడడం కోసం టాటా కంపెనీకి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ రంగంలోకి దిగిన అనంతరం బిర్లాల గుత్తాధిపత్యం బీటలు వారింది. ప్రస్తుతం మనం లైసెన్స్ పర్మిట్‌రాజ్‌ను కూల్చివేశాం. ప్రతి వ్యాపారరంగంలో దేశీయ కంపెనీల మధ్య పోటీ రాజ్యమేలుతోంది. 


ఈ కారణంగా గుత్తాధిపత్యపు లాభాలను ఆర్జించడ మనేది ఇప్పుడు అసాధ్యం లేదా అందుకు అవకాశాలు చాలా తక్కువ. మూడో తేడా, మన పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలకు ప్రపంచ తయారీరంగ, మార్కెటింగ్ పద్ధతుల గురించిన అవగాహన, అనుభవం చాలా తక్కువ. ఇప్పుడు పలువురు భారతీయ వ్యాపార వేత్తలు చైనాలో ఫ్యాక్టరీల నేర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి చేసిన సరుకులను మన దేశంలోకి దిగుమతి చేస్తున్నారు. మన పారిశ్రామికవేత్తలు అత్యాధునిక సాంకేతికతలను సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు దిగుమతి సుంకాలను భారీగా పెంచినా 1980వ దశకం నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం లేదు. 


ఈ పరిస్థితుల వల్ల దేశీయ మార్కెట్‌లో సరుకుల ధరలు పెరుగుతాయి. ట్యూబ్ లైట్ ధర రూ.500 నుంచి రూ.700కి పెరుగుతుంది రాజకీయ నాయకులు, -ప్రభుత్వాధికారుల కూటమి సంరక్షణ పద్ధతుల మాటున తమ అక్రమార్జనను తప్పక పెంచుకుంటుంది. అయినప్పటికీ బడా వ్యాపార సంస్థల మధ్య పోటీ గుత్తాధిపత్యపు లాభాలను నిరోధిస్తాయి. దేశీయంగా ఉత్పత్తి అయిన ట్యూబ్‌లైట్ ధర రూ.600, దిగుమతి అయిన ట్యూబ్‌లైట్ ధర రూ.700గా ఉండగలదని నా అంచనా. ఫలితంగా ప్రస్తుతం చైనాలో ట్యూబ్‌లైట్స్‌ను ఉత్పత్తి చేసి, భారత్‌కు దిగుమతి చేస్తున్న భారతీయ వ్యాపారులు తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి తరలిస్తారు. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ విజయవంతమయ్యేందుకు దోహదం చేస్తారు. ఈ దృష్ట్యా సంరక్షణ విధానాలను అనుసరించవద్దన్న రఘురామ్ రాజన్ సలహాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను రాజకీయ నాయకులు,- ప్రభుత్వాధికారుల కూటమి నియంత్రిస్తుందన్న వాస్తవాన్ని రాజన్ గుర్తించలేదు.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...