Abn logo
Apr 2 2021 @ 12:45PM

తిన్న ఇంటికే కన్నం వేసిన కేర్‌టేకర్‌..

  • విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో ఆభరణాల చోరీ

హైదరాబాద్/మారేడుపల్లి : తిన్న ఇంటికే కన్నం వేసిందో కేర్‌టేకర్‌. విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో రెండు సంవత్సరాలుగా కేర్‌టేకర్‌గా పని చేస్తున్న మహిళ ఇంటి యజమానికే టోకరా పెట్టిన సంఘటన మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ ఎమ్‌ మట్టయ్య తెలిపిన వివరాలు... తుకారాంగేట్‌, వెంకట్‌నగర్‌లో నివసించే జి.భాగ్యలక్ష్మి (38) పికెట్‌లో కుటుంబంతో ఉంటున్న విశ్రాంత శాస్త్రవేత్త కిషన్‌నారాయణ ఇంట్లో పని చేస్తోంది. ఆ వృద్ధ దంపతుల ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి వృద్ధుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని బీరువాలో భద్రపరిచిన 110 గ్రాముల చంద్రహారం, 25 గ్రాముల నానుపతకం, 44 గ్రాముల 2 బంగారు గాజులు, 33గ్రాముల బ్రేస్‌లెట్‌, 47 గ్రాముల కంకణం, దాదాపు 260 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది.

గత నెల 17న కిషన్‌ నారాయణ బ్యాంక్‌లోంచి లక్ష రూపాయల నగదు డ్రా చేసి టేబుల్‌పై పెట్టాడు ఆ సమయంలో డబ్బులను గమనించిన కేర్‌టేకర్‌ భాగ్యలక్ష్మి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను స్విచ్‌ ఆఫ్‌ చేసి రూ. 55 వేలు తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టుకొని తర్వాత ఆఫ్‌ చేసిన సీసీ కెమరాలను తిరిగి ఆన్‌ చేసింది. టేబుల్‌పై ఉన్న 45వేల రూపాయలే ఉన్నా యని సదరు యజమానులు ఆందోళన చెందారు. కేర్‌టేకర్‌ భాగ్యలక్ష్మిపై అనుమానమొచ్చి విచారించగా డబ్బులు దొంగలించే సమయంలో సీసీ కెమెరాలను  కేర్‌టేకర్‌ ఆఫ్‌చేసినట్లు కనిపెట్టారు. దీంతో వెంటనే ఇంట్లో బీరువాలో భద్రపరిచిన బంగారు ఆభరణాలను కూడా పరిశీలించగా అవి కనపించలేదు. దీంతో కిషన్‌ నారాయణ మనవడు మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేర్‌టేకర్‌ను విచారించగా ఆభరణాలు దొంగిలించినట్లు ఒప్పుకుంది. నిందితురాలిని గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement