మూగ జీవాల కేర్‌ టేకర్‌!

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

‘‘నోరు లేని జీవాలు అనారోగ్యంతో, ప్రమాదాలతో పడుతున్న వేదనే నేను చేస్తున్న కార్యక్రమాలకు ప్రేరణ!’’ అంటారు నిఖితా అయ్యర్‌. పంథొమ్మిదేళ్ళ వయసులోనే జంతువుల సంరక్షణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారీ జంతు ప్రేమికురాలు. కర్ణాటకలోని

మూగ జీవాల కేర్‌ టేకర్‌!

‘‘నోరు లేని జీవాలు అనారోగ్యంతో, ప్రమాదాలతో పడుతున్న వేదనే నేను చేస్తున్న కార్యక్రమాలకు ప్రేరణ!’’ అంటారు నిఖితా అయ్యర్‌. పంథొమ్మిదేళ్ళ వయసులోనే జంతువుల సంరక్షణ కోసం ఒక సంస్థను  ఏర్పాటు చేశారీ జంతు ప్రేమికురాలు. కర్ణాటకలోని బళ్ళారి కేంద్రంగా పని చేస్తున్న ఆ సంస్థ ఇప్పటి వరకూ ఆరువేలకు పైగా జంతువులను అక్కున చేర్చుకుంది.


ఇప్పటి వరకూ ఆరు వేలకు పైగా జంతువులను రక్షించాం. వీధి కుక్కలకు యాంటీ-రేబిస్‌ వ్యాక్సిన్లు వేయిస్తున్నాం. చాలామంది మాతో కలిసి పని చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛందంగా సాయం అందిస్తున్నారు. 


‘‘మనుషులమైన మనం ఏ కష్టం వచ్చినా చెప్పుకోగలం. కానీ జంతువుల కష్టాన్ని పట్టించుకోం. వాటి బాధ మనకు పెద్ద విషయం కాదన్నట్టు ప్రవర్తిస్తాం. అవి మౌనంగా ఆ కష్టాలను భరిస్తూ ఉంటాయి. మనలాగానే ఈ భూమి మీద సురక్షితంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు వాటికి కూడా ఉంది. ఆ హక్కును వాటికి అందించాలన్నదే నా ఆకాంక్ష’’ అంటున్నారు నిఖితా అయ్యర్‌. తొమ్మిదేళ్ళ కిందట ఆమె ఏర్పాటు చేసిన ‘కన్సర్వేషన్‌ అండ్‌ రెస్క్యూ’ (కేర్‌)  సంస్థ కర్ణాటకలోని బళ్ళారిలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జంతువుల రక్షణ కోసం, సంరక్షణ కోసం పని చేస్తోంది. ఈ ఏడాది నుంచి ఆ సంస్థ పేరును ‘హ్యుమన్‌ వరల్డ్‌ ఫర్‌ యానిమల్స్‌’ (హెచ్‌డబ్ల్యూఏ)గా మార్చారు. 


ఆ హింసను చూడలేక...

‘‘చిన్న వయసు నుంచీ జంతువులంటే నాకు ఎంతో ఇష్టం. అయితే వాటి కోసం ఒక సంస్థ ఏర్పాటు చేస్తానని మాత్రం అనుకోలేదు’’ అంటారు నిఖిత. కొన్నేళ్ళ కిందట ఎదురైన ఒక సంఘటన ఈ దిశగా ఆమె ముందడుగు వేసేలా చేసింది. నిఖిత బాల్యమంతా తమిళనాడులోని చెన్నైలో గడిచింది. నిఖితకు పన్నెండేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం కర్ణాటకలోని బళ్ళారికి వచ్చి స్థిరపడింది. వారి పెంపుడు కుక్క ఆరు పిల్లల్ని పెట్టింది. ఆ తరువాత వాటికి ‘కనైన్‌ డిస్టెంపర్‌’ అనే వ్యాధి సోకింది. తల్లి, అయిదు పిల్లలు మరణించాయి. ఉన్న ఒక్క కుక్కపిల్ల కూడా ఆ వ్యాధితో మూడు నెలలు బాధపడింది. నిఖిత కుటుంబం దాన్ని కంటికి రెప్పలా చూసుకోవడంతో అది కోలుకుంది. నాలుగేళ్ళ తరువాత దానికి టెస్టిక్యులర్‌ కేన్సర్‌ వచ్చినా, తట్టుకోగలిగింది.


‘‘మా కుక్క పిల్లతో పాటు మా వీధిలో ఉన్న మరికొన్ని శునకాలకు కూడా మేము ఆహారం పెడుతూ ఉండేవాళ్ళం. ఒక రోజు కొందరు తాగుబోతులు వాటికి విషం ఇంజక్షన్లు ఇచ్చారు. మేం వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. నా పెంపుడు కుక్క నడవలేని పరిస్థితిలో రోడ్డు మీద పడి ఉండడం చూసి నాకు కన్నీళ్ళు ఆగలేదు. మనుషుల క్రూరత్వానికి బలవుతున్న, అనారోగ్యం పాలైన,  జంతువుల కోసం ఏదైనా చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అంటారు నిఖిత. తన స్నేహితులతో ఈ విషయాన్ని చర్చించి మరో నలుగురితో కలిసి కేర్‌ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారామె.


వేధింపులు తప్పడం లేదు...

అనారోగ్యంగా ఉన్న, గాయపడిన, ఆశ్రయం లేని, హింసకు గురవుతున్న జంతువులను కాపాడడం, వాటికి పునరావాసం కల్పించడం వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యం. జంతువుల పట్ల దయగా వ్యవహరించేలా, వాటిని సంరక్షించేలా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ‘కేర్‌’ బృందం అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. కుక్కలు, పిల్లులు, పందులు, ఆవులు, పక్షులనే కాదు, కొన్ని సందర్భాల్లో పాములు, ఎలుగుబంట్లు, ముంగిసలు, కోతుల్లాంటి వన్య జంతువులను కూడా అటవీ శాఖ సాయంతో ఈ సంస్థ కాపాడింది. ‘‘ఇప్పటి వరకూ ఆరువేలకు పైగా జంతువులను రక్షించాం. వీధి కుక్కలకు యాంటీ-రేబిస్‌ వ్యాక్సిన్లు వేయిస్తున్నాం. చాలామంది మాతో కలిసి పని చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛందంగా సాయం అందిస్తున్నారు. అయితే ఈ పని కనిపిస్తున్నంత సులువు కాదు. వీధుల్లో ఉండే జంతువులకు ఆహారం అందించేలా కొందరిని ప్రోత్సహించాం. అయితే వాటికి తిండి ఎందుకు పెడుతున్నారంటూ స్థానికులు వారిపై భౌతిక దాడులకు కూడా కొన్నిసార్లు దిగారు. దీంతో జంతువుల పట్ల ప్రేమ ఉన్నా, దాడుల భయంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నాం’’ అంటారీ జంతు ప్రేమికురాలు. 


దాని కోసమే శ్రమిస్తున్నాం!

‘‘ప్రస్తుతం వీధి జంతువులకు ఆహారం సిద్ధం చేయడం, అవసరమైన వాటికి చికిత్సలు అందించడం లాంటివన్నీ ఒక పాత భవనంలో జరుగుతున్నాయి. ఆ భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకుంటోంది. కాబట్టి సొంత స్థలాన్ని సమకూర్చుకొని, సహాయక కేంద్రం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం.. కొన్ని సందర్భాల్లో జంతువులను కాపాడడం కోసం ఎక్కువ సాయం అవసరం అవుతుంది. కొన్నాళ్ళ కిందట ఒక కుక్క పిల్లను కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆ శునకం చికిత్స కోసం బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోని ఆసుపత్రుల్ని సంప్రతించాం. చివరకు ఢిల్లీకి చెందిన ఒక సంస్థ సహాయానికి ముందుకొచ్చింది. అక్కడికి దాన్ని జాగ్రత్తగా చేరవేసి, బతికించగలిగాం’’అన్నారు నిఖిత. ఈ సంస్థ నిర్వహణకు నెలకు సుమారు రెండున్నర లక్షలు అవసరమవుతాయి. ఈ మొత్తంలో చాలా వరకూ విరాళాల ద్వారా సేకరిస్తారు. సొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కిందటి ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో, బళ్ళారి పరిసరాల్లో ఉన్న దాదాపు 1,200 శునకాలకు ఆహారం అందించడానికి ప్రతి రోజూ 75 కిలోల బియ్యంతో అన్నం, 200 లీటర్ల పాలు, 50 కిలోల బ్రెడ్‌, రస్కులు సిద్ధం చేసేవారు. 


‘‘మా కార్యకలాపాలను సమీపంలో ఉన్న హోస్పేట, రాయచూరు, హస్సన్‌, గుంతకల్లు, హుబ్లీ, ధార్వాడ్‌ ప్రాంతాల్లో కూడా చేపడుతున్నాం. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని బృందాలకు సాయం అందిస్తున్నాం. అయితే వనరుల కొరత పెద్ద సమస్య అవుతోంది. మాకు కనీసం అంబులెన్స్‌ కూడా లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఏది ఏమైనా వీధి జంతువుల కోసం బళ్ళారి కేంద్రంగా పూర్తి సౌకర్యాలున్న సహాయక కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యడం, వాటి చికిత్స కోసం వైద్య నిపుణుల్ని నియమించడం నా కల. దానికోసం శ్రమిస్తున్నాం. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజలు సహకరిస్తే అది నెరవేరడం కష్టం కాదనుకుంటున్నా!’’ అని అంటున్నారు నిఖిత.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST