Abn logo
Jun 18 2021 @ 03:31AM

కార్లున్నా ఆకలి కేకలు

 • కరోనా, లాక్‌డౌన్‌తో రోడ్డుపాలైన క్యాబ్‌ డ్రైవర్లు 
 • హైదరాబాద్‌లో 1.25 లక్షల మంది డ్రైవర్లు
 • వీరిలో 70శాతం మందికి ఉపాధి గల్లంతు
 • గుదిబండగా కారు కిస్తీలు, పన్నులు, పెట్రో ధరలు
 • కిస్తీ కట్టలేక కార్లను కోల్పోయిన 44వేల మంది 
 • పూట గడవని స్థితిలో కుటుంబాల వ్యథ 
 • వాయిదాలపై ఏడాది చివరిదాకా మారటోరియం
 • ప్రతి డ్రైవరుకు అత్యవసర సాయంగా రూ.8,500
 • కరోనాతో చనిపోయిన డ్రైవర్లకు రూ.25లక్షలు
 • తెల్ల రేషన్‌ కార్డులను వెనక్కు ఇవ్వాలి
 • క్యాబ్‌ డ్రైవర్ల డిమాండ్లు 

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ట్యాక్సీ డ్రైవర్లు సొంత కార్లున్న సామాన్యులు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తెల్లారింది మొదలు అర్ధరాత్రి దాటేదాకా పనిచేస్తునే ఉంటారు. వచ్చేకొన్ని పైసల్లో నుంచే సర్కారుకు రకరకాల పన్నులు, కారు కిస్తీలు కట్టి.. మిగిలిన మొత్తంతో కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాంటిది.. కరోనా, లాక్‌డౌన్‌తో వారి బతుకు బండి గాడితప్పింది. కారు రోడ్డెక్కక.. ఎక్కినా ప్రయాణికులు లేక.. నెలనెలా కారు వాయిదాలు, పన్నులు కట్టలేక, కనీసం పూట గడిచే పరిస్థితి లేక  తల్లడిల్లుతున్నారు. సొంతకారున్నా గంజినీళ్లు కూడా దొరకని దీనావస్థలో పడిపోయారు. తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 1.25లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లున్నారు. వారిలో ఎక్కువ శాతం ఊబర్‌, ఓలా కంపెనీలకు అనుబంధంగా వాహనాలను నడుపుతున్నారు. నిరుడు, ఈ ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావంతో వారంతా రోడ్డున పడ్డారు! లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో పనిచేసినా బుకింగ్‌లు పెద్దగా ఉండటం లేదు. వచ్చే ఆ కొద్దిపాటి మొత్తంలోనూ 25-30 శాతం కమీషను సదరు కంపెనీలు తీసుకుంటున్నాయి. ఇంధన ధరలూ అదేపనిగా పెరుగుతుండటంతో వారికి పెద్దగా మిగులుబాటు ఉండటం లేదు. దీంతో కమీషన్‌ను ఐదు శాతం మేర తగ్గించుకోవాలంటూ ఊబర్‌, ఓలా కంపెనీలను డ్రైవర్లు అభ్యర్థిస్తున్నారు. తమ ఆకలి కేకలు, అభ్యర్థనలను కంపెనీలు పట్టించుకోవడం లేదని ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్‌ సభ్యులు వాపోతున్నారు. 

‘వర్క్‌ ఫ్రం హోం’ దెబ్బ

హైదరాబాద్‌లో ఉన్న క్యాబ్‌లలో సుమారు 33వేల వాహనాలు, ఐటీ కంపెనీల మీదే ఆధారపడ్డాయి. కొవిడ్‌కు మునుపు క్యాబ్‌ డ్రైవర్లు ఐటీ ఉద్యోగులను కంపెనీల్లో దిగబెట్టి మళ్లీ ఇళ్లకు చేర్చేవారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో క్యాబ్‌ డ్రైవర్ల ఉపాధికి అక్కడే పెద్ద పడింది. మరో 18 వేల వాహనాలు, పర్యాటక రంగ సేవలో కొనసాగుతున్నాయి. ఏడాదిన్నరగా పర్యాటకరంగం స్తబ్దుగా మారడంతో వారూ ఉపాధి కోల్పోయారు.

  

మారటోరియం వెసులుబాటు ఏది? 

 కిస్తీ కట్టలేక సుమారు 45వేల మంది డ్రైవర్లు తమ వాహనాలను కోల్పోయారని తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ  చైర్మన్‌ సల్లావుద్దీన్‌ చెప్పారు. మొదటి లాక్‌డౌన్‌ తర్వాత వాహనలోన్‌పై ట్యాక్సీ డ్రైవర్లకు ఆరునెలలు మారటోరియం కల్పించారు. రెండో లాక్‌డౌన్‌తోనూ ఉపాధిని కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు అలాంటి వెసులుబాటేమీ లేకపోవడంతో నెల వాయిదాలెలా చెల్లించాలని చాలమాంది డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.

 

మాట తప్పిన ఓలా 

‘‘ప్రధాన ట్యాక్సీ సర్వీసుల్లో ఒకటైన ఓలా కంపెనీ నగరంలో సుమారు 8 వేల మంది డ్రైవర్లను ఎంపికచేసి మరీ, వాళ్లకు కార్లు ఇచ్చింది. అందులో ఒక్కొక్కరూ రోజుకి రూ.1175 చొప్పున 3.4 ఏళ్లు చెల్లిస్తే చాలు, ఆ వాహనం సొంతమవుతుందని ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా వాళ్ల వద్ద రూ.36వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. కరోనా సమయంలో ఆ వాహనాలన్నింటినీ శానిటైజ్‌ చేస్తామని చెప్పి, చాలామంది వద్ద నుంచి కార్లను తీసుకుంది. ఆ తర్వాత కార్లను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వాహనాలిమ్మని అడిగిన డ్రైవర్లకు వారు చెల్లించిన అడ్వాన్సులో సగాన్ని తిరిగిచ్చి పొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం?’’ అని తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ సల్లావుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరున్న ఒక ప్రముఖ సంస్థే ఇలా పేదలపట్ల మోసపూరితంగా వ్యవహరిస్తే, తమకు మరెవరు దిక్కు? అని డ్రైవర్లు వాపోతున్నారు. ఓలా కంపెనీ నిర్వాకంపై న్యాయపోరాటం చేయనున్నట్లు తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 


ప్రభుత్వమూ ఆలోచించాలి

ప్రైవేటు వాహనాల్లో సుమారు ఇరవై శాతం ట్యాక్సీలు ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దెకు తిరుగుతుంటాయి. అందుకు నెలకింత అని కిరాయి చెల్లిస్తారు. లేదా పాతిక వందల కిలోమీటర్లకు నగర పరిధిలో రూ34వేలు, జిల్లాల్లో రూ.33వేలు అద్దె చెల్లిస్తుంటారు. పెట్రో, డీజిల్‌ లీటరు ధర రూ.100 దాటినా, వాహనాల కిరాయి మాత్రం అంతే ఉందని ట్యాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు. కనీసం కిలోమీటరుకు రూ.17 చెల్లిస్తేగానీ డ్రైవరు కుటుంబం బతుకుతుందని టీసీడీవోఎప్‌ కన్వీనర్‌ ఈశ్వరరావు పేర్కొన్నారు. ఓలా, ఊబర్‌ వంటి ప్రైవేటు సంస్థలు సైతం అంతే ధర డ్రైవరుకు చెల్లించేవిధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉందని డ్రైవర్ల అసోసియేషన్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ’

3 నెలలుగా వాయిదాలు కట్టలేదు 

నా పేరు లక్ష్మి. మా ఆయన సత్తయ్య(45)నిరుడు కరోనాతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యత నామీదే పడింది. నా కూతురు డిగ్రీ, కొడుకు ఇంటర్‌ చదువుతున్నారు. అంతకు ముందు నుంచే నేను స్కూలు వ్యాను నడి పే ఉద్యోగంలో ఉన్నాను. మూడేళ్ల కిందట బ్యాకు లోనుతో రూ. 10లక్షలకు మ హీంద్రా జైలో కారు కొన్నాను. ప్రతినెలా రూ. 22,630 వాయిదా చెల్లిస్తున్నాను. లాక్‌డౌన్‌ వల్ల మూడు నెలలుగా కిస్తీ కట్టలేకపోయా. వాళ్లెక్కడ ఇంటిమీదకి వస్తారేమోనని భయంగా ఉంది. మాకు సొంతిల్లుకూడా లేదు. ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీఎం కేసీఆర్‌ మాకు అండగా నిలవాలి.   

 - దండు లక్ష్మి, ట్యాక్సీ డ్రైవర్‌


ఆకలితో చనిపోతారేమో! 

 ప్రతిమూడు నెలలకు రోడ్డు ట్యాక్సుతో పాటు రెండేళ్లకొకసారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ అని, బోర్డర్‌ ట్యాక్సు అని క్యాబ్‌ డ్రైవర్లు గా రకరకాల పన్నులు చెల్లిస్తాం. జీఎస్టీ రూపంలోనూ పన్నులు కడుతున్నాం. కానీ మమ్మల్ని ఈ కష్టకాలంలో ఆదుకునేందుకు ప్ర భుత్వాలు ముందుకురాకపోవడం బాధాకరం. చాలామంది డ్రైవర్లకున్న తెల రేషనుకార్డులను తొలగించారు. ఆ కార్డులను తిరిగిఇవ్వడంతో పాటు తక్షణ సాయం అందించండి. లేకుంటే ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది. 

- షేక్‌ సలావుద్దీన్‌, చైర్మన్‌, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ .


769 మందికి కరోనా.. 10 మంది మృతి 

నగరంలోని 1.25లక్షల ట్యాక్సీ డ్రైవర్లలో 769 మంది కరోనా బారినపడ్డారు. వారిలో పదిమంది మృతిచెందారు. లాక్‌డౌన్‌తో సుమారు 70 శాతంమంది ఉపాధి కోల్పోయారు. వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. నగరంలో ఉపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లలో కొందరికి ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత నిత్యావసర సరుకులు పంచారు. వెయ్యి రూపాయలు విలువచేసే బియ్యం, పప్పు, నూనె వంటి వంట సరుకులతో కూడిన వంద కిట్లను ఆమె ట్యాక్సీ డ్రైవర్ల కుటుంబాలకు అందించారు.


ఇవీ ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్లు 

తెలంగాణ డ్రైవర్ల సంక్షేమ బోర్డును నెలకొల్పాలి.

ప్రతి డ్రైవరు కుటుంబానికి అత్యవసర సాయంగా రూ.8,500 అందించాలి.

ఫిట్‌నెస్‌ అండ్‌ రోడ్డు ట్యాక్స్‌ త్రైమాసిక చెల్లింపులను రద్దు చేయాలి.

వాహన లోనుపై ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మారటోరియం కల్పించాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క డ్రైవరుకూ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలి.

ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలి. 

కరోనాతో చనిపోయిన ఒక్కో డ్రైవరు కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి.