పొంచివున్న వ్యాధులు

ABN , First Publish Date - 2020-10-17T09:36:55+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రజలతోపాటు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

పొంచివున్న వ్యాధులు

ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

...ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభించే అవకాశం

ఇంచుమించుగా ఒకేలా ఉండే కొవిడ్‌-19, ఫ్లూ జ్వరాల లక్షణాలు

అవనసరంగా ఆందోళన చెందొద్దంటున్న వైద్య నిపుణులు

అలాగని నిర్లక్ష్యమూ వద్దని సూచన



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రజలతోపాటు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే అల్పపీడనం ప్రభావంతో కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్‌ జ్వరాలు విజృంభించే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు. అయితే సీజనల్‌ జ్వరాలను కొవిడ్‌గా అనుమానించి ఆందోళన చెందొద్దని, అలాగని...కొవిడ్‌ వైరస్‌ను ఫ్లూ జ్వరంగా భావించి నిర్లక్ష్యమూ చేయొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమ్తతంగా వుండాలని, లక్షణాలను బట్టి ఏ జ్వరమో గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొవిడ్‌ వైరస్‌, ఫ్లూ, ఇతర జ్వరాలకు మధ్య తేడా, కనిపించే లక్షణాలపై స్పష్టమైన అవగాహన కలిగి వుండాలని చెబుతున్నారు. 


కరోనా వైరస్‌: ఫ్లూ జ్వరంలో కనిపించే లక్షణాలు కరోనా వైరస్‌ సోకినా కనిపిస్తాయి. కరోనాలో ప్రధానంగా దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట ప్రధానమైన లక్షణాలుగా ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే వరుసగా ఈ లక్షణాలు పెరుగుతూ వస్తే కొవిడ్‌గా అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో కడుపులో మంట, విరేచనాలు వంటి ఇబ్బందులు కనిపిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. 


ఫ్లూ జ్వరం..: ఫ్లూ జ్వరం లక్షణాలు ఇంచుమించు కొవిడ్‌ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అయితే దగ్గు, జలుబు, జ్వరం వంటివి కామన్‌గా వున్నప్పటికీ...ఒళ్లు నొప్పులు, ఆయాసం వుండవని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తే మాత్రం అనుమానించాల్సిందేనని పేర్కొంటున్నారు. 


మలేరియా..: కొవిడ్‌కు, మలేరియా వల్ల వచ్చే జ్వరానికి అసలు సంబంధమే ఉండదు. దగ్గర పోలికలు కూడా ఉండవు. మలేరియా, కొవిడ్‌లో జ్వరం ఒక్కటే కామన్‌గా ఉంటుంది. మిగిలిన లక్షణాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు. ఇందులో జ్వరం, చలితోపాటు కుదుపు ఉంటుంది. మొదటి రోజు ఎన్ని గంటలకు జ్వరం వస్తే...తరువాత రోజు మళ్లీ అదే సమయానికి జ్వరం వస్తుంది. చెమట ఎక్కువగా పడుతుంది. 


టైఫాయిడ్‌..: వర్షాల తరువాత ఎక్కువగా కనిపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం వల్ల టైఫాయిడ్‌ వస్తుంది. హై గ్రేడ్‌ ఫీవర్‌, తలనొప్పి ఉంటుంది. కొందరిలో కడుపునొప్పి, విరేచనాలు వంటివి కనిపిస్తాయి. 104 వరకు జ్వరం ఉంటుంది. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఇందులో కనిపించవు. 


డెంగ్యూ..: 103-104 జ్వరం ఉంటుంది. తలనొప్పి, ఎముకలు విరిగేంత ఒళ్లు నొప్పులు ఉంటాయి. దీని బారినపడిన కొంత మందిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతాయి. కడుపులో నొప్పి ఉంటుంది. కొందరిలో లంగ్‌ డ్యామేజ్‌ కూడా జరుగుతుంది. అయితే, కరోనాగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. 


ఆందోళన వద్దు...నిర్లక్ష్యం తగదు..

వర్షాలు తగ్గిన తరువాత సీజనల్‌ జ్వరాలు విజృంభించే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో జ్వరం వచ్చినంత మాత్రాన ఆందోళన చెందడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే...మూడు, నాలుగు రోజులు నిరీక్షించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరం బారినపడి.. వైరస్‌ అని ఆందోళన చెందకూడదని, అలాగని వైరస్‌ బారినపడినప్పటికీ..సాధారణ జ్వరంగానే నిర్లక్ష్యమూ తగదని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సోమయాజులు తెలిపారు. లక్షణాలను బట్టి, వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకోవాలని, అనవసరపు ఆందోళనలతో కరోనా టెస్ట్‌, చెస్ట్‌ స్కాన్‌లు వంటివి చేయించుకోవద్దని ఆయన సూచించారు.    

Updated Date - 2020-10-17T09:36:55+05:30 IST