ఏపీ @ 4250

ABN , First Publish Date - 2020-06-06T09:37:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. శుక్రవారం మరో 138మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,250కి చేరాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 700మంది, విదేశాల

ఏపీ @ 4250

  • రాష్ట్రంలో 138 కొత్త కేసులు 
  • తూర్పున 22, చిత్తూరులో 21, విశాఖలో 17 మందికి వైరస్‌ 
  • 500 మార్కు దాటేసిన కృష్ణా


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌) : రాష్ట్రంలో కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. శుక్రవారం మరో 138మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,250కి చేరాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 700మంది, విదేశాల నుంచి వచ్చిన 123మంది ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 50మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 84మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి వ్యాధి సోకిందని ఆరోగ్యశాఖ నిర్ధారించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్‌ బారినపడి మరో ఇద్దరు మృతిచెందారు. వీటితో కలిపి మొత్తం కరోనా మరణాలు 73కు పెరిగాయి. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యానికి గురై మూడు రోజుల క్రితం చనిపోయాడు. అతని శాంపిల్స్‌ తీసి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. కృష్ణలంకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందారు. 


ఈ రెండు మరణాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటితో కలిపి ఈ జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజాగా మచిలీపట్నంలో ఇద్దరికి, విజయవాడ నగరం కృష్ణలంకలో ముగ్గురికి, చిట్టినగర్‌లో ఇద్దరికి, అజిత్‌సింగ్‌నగర్‌లో మరొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీటితో కలిపి ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 500 దాటిపోయింది. చిత్తూరు జిల్లాలో మరో 21 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 కేసులు ముంబై మూలాలతోనూ, 3కేసులు కజకిస్థాన్‌ మూలాలతోనూ నమోదైనట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 4, రాజుపాలెం మండలానికి చెందిన ఒకరికి వ్యాధి నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి సహా 9మంది కరోనా బారిన పడ్డారు. కడప జిల్లా మైలవరం మండలంలో ఈ నెల 3న మృతిచెందిన వ్యక్తికి ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, కువైత్‌ నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. నెల్లూరు జిల్లాలో మరో 11కేసులు నమోదయ్యాయి.


రోగిని పరామర్శించిన 14మందికి వైరస్‌ 

తూర్పుగోదావరి జిల్లాలో మరో 22మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల హైదరాబాద్‌లో శస్త్రచికిత్స పూర్తిచేసుకుని అయినవిల్లి మండలానికి వచ్చిన ఓ వ్యక్తిని పెద్దసంఖ్యలో స్థానికులు, అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతలు కలిసి పరామర్శించారు. ఆయననుంచి 14 మందికి వైరస్‌ సంక్రమించినట్లు గుర్తించారు. అలాగే అనపర్తిలో 2, పెదపూడి మండలం మామిడాడ, రాజుపాలెం, కరప, తూరంగిల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్‌లో ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.


విశాఖ విలవిల 

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 17మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇందులో 14మంది అనకాపల్లి ప్రాంతానికి చెందినవారు కాగా మరో ముగ్గురు విశాఖనగర పరిధిలోనివారు. వీటితో కలిపి ఈ జిల్లాలో కేసులు 145కు చేరాయి..


సచివాలయంలో 1,378 కరోనా పరీక్షలు

సచివాలయంలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 1,378 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. శుక్రవారం నాలుగో బ్లాక్‌లోని రెవెన్యూ ఉద్యోగులతో పాటు, వివిధ శాఖలకు చెందిన 380 మంది నమూనాలు సేకరించారు. రెండో బ్లాకులో 394మంది ఉద్యోగులకు గాను 379 మందికి నెగెటివ్‌గా రిపోర్టురాగా మరో 15మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని వైద్యసిబ్బంది తెలిపారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ఉద్యోగులనే సచివాలయంలో విధులకు అనుమతించాలంటూ సీఎస్‌ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2020-06-06T09:37:49+05:30 IST