మళ్లీ ఛాయలు!

ABN , First Publish Date - 2021-03-01T06:41:49+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా వైరస్‌ ఛాయలు ఉనికిలోకి వస్తున్నాయి. రుగ్మత తగ్గుతోందనుకునే సమయంలో సెకండ్‌ వేవ్‌ ప్రతాపం చూపుతోంది. ఏ నిముషానికి ఏమి జరుగుతుందో నని ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మళ్లీ ఛాయలు!
సండే బజార్‌లో భాగంగా కాకినాడ మెయినరోడ్డులో రద్దీ దృశ్యం

  • కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమేపీ పెరుగుతున్న  బాధితులు 
  • ప్రజల్లో పెరుగుతున్న విచ్చలవిడితనం 
  • మాస్కులు ధరించకుండా, శానిటైజర్‌ వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 50 శాతం ప్రజలు 
  • జాగ్రత్తలు తీసుకోకపోతే వదలనంటున్న వైరస్‌

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మళ్లీ కరోనా వైరస్‌ ఛాయలు ఉనికిలోకి వస్తున్నాయి. రుగ్మత తగ్గుతోందనుకునే సమయంలో సెకండ్‌ వేవ్‌ ప్రతాపం చూపుతోంది. ఏ నిముషానికి ఏమి జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గత రెండు వారాలుగా బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. రక్షణ చర్యలు పాటించని వారెవరినీ తాను వదలనంటూ కొవిడ్‌ భయపెడుతోంది. మాస్కులు ధరించకపోవడం, జనసమూహాలు ఉన్నచోట సామాజిక దూరం పాటించకపోవడం, శానిటైజర్‌ వినియోగించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీరోజూ అధికారికంగా విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటినలో మాత్రం సుమారు 20 రోజులుగా వాస్తవాలను వెల్లడించట్లేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకుంటోన్న ప్రజలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాకినాడ టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఓ మహిళ కొవిడ్‌తో బాధపడుతూ మృతి చెందినట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి కుటుంబీకులు వెనుకంజ వేశారు. అలాగే కాకినాడలోని ఓ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిలో పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో ఈ స్కూల్లో చదువుతున్న సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులు ఏడుగురు భయంతో స్కూలు వీడి వసతిగృహానికే పరిమిత మయ్యారు. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అవాస్తవ గణాం కాలను ప్రకటిస్తుండడం గమనార్హం. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ గమనంలో ఉందని, జాగ్రత్తలు పక్కాగా పాటిస్తే వైరస్‌ దరిచేరదని వైద్యులు ఎప్పటికపుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో రెండో దశ ప్రారంభంలో ప్రతీరోజూ 4 నుంచి 6 పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండగా, అనధికారికంగా ఎంతమందికి రుగ్మత సోకిందనే విషయం తెలిసినా ప్రభు త్వం ఆ సంఖ్యను దాచిపెడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

కొవిడ్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ రెండో విడత ప్రారంభమవుతుండగా అదే రీతిలో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అంతంతమాత్రంగానే జరుగుతున్నారు. కొందరు సంపన్నులు అనుమానంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ విషయం అంతా గుట్టుచప్పుడుగా సాగిపోతుంది. అయితే రిపోర్టులను బయటకు పొక్కనీయకుండా ల్యాబ్‌ టెక్నీషియన్లు, సంబంఽధిత వైద్యులు జాగ్రత్తపడుతున్నారని సమాచారం. వైరస్‌ సోకినంత మాత్రాన భయపడేది లేదని, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడితే తగ్గుతోందని చెప్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాజిటివ్‌ సోకిన వ్యక్తుల సమాచారాన్ని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు దాచిపెడుతున్నాయనే అనుమానాలున్నాయి. నిర్ధారణ పరీక్షలు ఏఏ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి, రోజూ ఎంతమందికి పరీక్ష చేస్తున్నారనే విషయాలపై గతంలో అమలయిన నోడల్‌ వ్యవస్థ ఇప్పుడు బలోపేతంగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కొవిడ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను కనీసం 50 శాతం మంది పాటించడం లేదు. ఇటీవల సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ పెరిగింది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు కూడా జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-03-01T06:41:49+05:30 IST