కరోనా ఎఫెక్ట్... సరుకు రవాణాపై ప్రభావం... కంటైనర్లు స్టాప్...

ABN , First Publish Date - 2020-10-20T22:28:02+05:30 IST

కరోనా వైరస్ నేపధ్యంలో గత ఆరు నెలలుగా దేశంలోకి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కంటెయినర్లు కూడా తగిన సంఖ్యలో రావడంలేదు. మొత్తంమీద ఈ క్రమంలో... దిగుమతులు దాదాపు 19.6 శాతం మేర క్షీణించాయి. ఇదే క్రమంలో... ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం పడింది.

కరోనా ఎఫెక్ట్... సరుకు రవాణాపై ప్రభావం... కంటైనర్లు స్టాప్...


ముంబై : కరోనా వైరస్ నేపధ్యంలో గత ఆరు నెలలుగా దేశంలోకి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కంటెయినర్లు కూడా తగిన సంఖ్యలో రావడంలేదు. మొత్తంమీద ఈ క్రమంలో... దిగుమతులు దాదాపు 19.6 శాతం మేర క్షీణించాయి. ఇదే క్రమంలో... ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. 


ప్రత్యేకించి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు సరుకు రవాణాకు సంబంధించి కంటైనర్ల కొరత నేపధ్యంలో  ఎగుమతిదారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ క్రమంలో... అంతర్జాతీయ రవాణా మార్గాల్లో సరుకు రవాణా రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. కంటైనర్లు స్వదేశానికి తక్కువగా తిరిగి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తుల చేస్తున్నారు. ఎగుమతుల నేపథ్యంలో ఖాళీ కంటైనర్లను తిరిగి భారత్‌కు రప్పించేలా చొరవ తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ కోరింది. కంటైనర్ల కొరత కారణంగా గత మూడు నెలల కాలంలో అమెరికాకు ఎగుమతులపై ధరలు 60 శాతం మేర పెరిగాయి. ఇక... ఆఫ్రికన్ ఓడ రేవులకు ఎగుమతి చేయడానికి ధరలు రెండింతలు దాటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరోప్‌కు ఎగుమతి చేయడానికి కంటైనర్ ధరలు 50 శాతం మేర పెరిగాయి.ః


భారీగా పెరిగిన కంటైనర్ ధరలు... 

ఎగుమతులకు సంబంధించి ఈ మూడు నెలల కాలంలో ధరలు సగటున 50 శాతం పెరిగాయని ఫెడరేషన్ ప్రెసిడెంంట్ శరద్ కుమార్ సరఫ్ అవెల్లడించారు. పరిస్థితి ఇప్పటికీ మెరుగు పడటం లేదని,  ఖాళీ కంటైనర్లను తిరిగి రప్పించేలా ఇండియన్ మారీటైమ్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆదేశాలు జారీ చేయడమొక్కటే మార్గమని పేర్కొన్నారు. 


జైపూర్‌కు చెందిన లాజిస్టిక్ స్టార్టప్ జీఎక్స్‌ప్రెస్ ప్రతి వారం 10 నుండి 15 కంటైనర్లలో అమెరికాకు ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ధరలు పెరగడంతో ఒక్కో కంటైనర్‌కు 3,600 డాలర్లను చెల్లిస్తోంది. కరోనాకు ముందు 1,700 డాలర్ల నుండి 1,800 డాలర్లు చెల్లించేవారు. 


రెండింతలకు పైగా పెరిగిన సమయం...

ముంబై నుండి న్యూయార్క్‌కు కంటైనర్ ద్వారా ఎగుమతులకు 28 రోజుల నుండి 30 రోజులు పడుతోందని, కొన్ని షిప్పింగ్ సంస్థలు ధరలను కాస్త తక్కువగానే తీసుకుంటున్నప్పటికీ, సరుకు రవాణాకు మాత్రం 60 రోజుల వరకు సమయం పడుతుంది. వివిధ అంశాలతో పాటు ప్రధానంగా దిగుమతులు భారీగా తగ్గిపోవడం వల్ల కంటైనర్ల కొరత ఏర్పడి, షిప్‌మెంట్ ధరలు పెరుగుతున్నాయి. 


సీన్ రివర్స్... 

కరోనాకు ముందువరకు... ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండేవి. దీంతో దేశంలో కంటైనర్ల సమస్య పెద్దగా ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే... కరోనా నేపథ్యంలో దేశంలోకి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో కంటైనర్ల సమస్య తలెత్తింది.  


ఆరు నెలల కాలంలో ఇలా...

సెప్టెంబర్ నాటికి భారత్ ఎగుమతులు కాస్త సానుకులంగా మారాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 5.99 శాతం వృద్ధిని సాధించి 27.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.. ఇక... దిగుమతులు 19.6 శాతం తగ్గి 30.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 


ఇక... ప్రస్తుత పరిస్థితుల్లో కంటైనర్ల సంక్షోభం ఎప్పుడు తొలగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2020-10-20T22:28:02+05:30 IST