కనిగిరిలో కరోనా కరాళనృత్యం

ABN , First Publish Date - 2021-05-18T06:58:26+05:30 IST

కనిగిరిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

కనిగిరిలో కరోనా కరాళనృత్యం
కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్న కమిషనర్‌

కనిగిరి, మే 17 : కనిగిరిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా శివారు కాలనీల్లో వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. ఇందిరా కాలనీ, ఎన్జీవో కాలనీ, సాయినగర్‌, శివనగర్‌, కాశిరెడ్డి కాలనీ, కొండకింద కాలనీల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆయా కాలనీల్లో పది మందికి పైగా మృతి చెందారు. పట్టణంలో గత పది రోజుల్లో 650 మంది వైరస్‌ బారినపడ్డారు. వారిలో 256 మంది కోలుకోగా, 393 మంది ఇంకా పోరాడుతున్నారు. ఒక్క ఇందిరా కాలనీలోనే 150 కేసులు నమోదు కాగా అందులో ఇంకా 47 యాక్టివ్‌గానే ఉన్నాయి. శివనగర్‌ కాలనీ 46 మంది ప్రస్తుతం కరోనా బాధితులుగా ఉన్నారు. కాశిరెడ్డి బజారులో పలువురు ఈ మహమ్మారి బారిన పడి అల్లాడుతున్నారు.  ఇందిరా కాలనీ, శివనగర్‌ కాలనీల్లో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టినా కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడచిన రెండు రోజుల్లో ఆ ప్రాంతంలో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు నమోదవుతున్న కాలనీల్లో రోజువారీ కూలి చేసుకుని జీవించే కుటుంబాలు ఎక్కువ. దీంతో వారంతా అల్లాడుతున్నారు. కరోనా మొదటి దశలో ఉన్న పర్యవేక్షణ, వైద్యం నేడు కరువైంది. ప్రభుత్వ  ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేక పేదలు పడరానిపాట్లుపడుతున్నారు.

Updated Date - 2021-05-18T06:58:26+05:30 IST