పల్లెలపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-19T07:40:17+05:30 IST

పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయి.

పల్లెలపై కరోనా పంజా
పర్యటిస్తున్న తహసీల్దార్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందం

ఒకే రోజు 33 కేసులు

బూతంవారిపల్లిలో ఒకరి మృతి

కనిగిరి, మే 18 : పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజే మాచవరం, గురవాజీపేట పీహెచ్‌సీల పరిధిలో 33 కేసులు నమోదయ్యాయి. బూతంవారిపల్లిలో ఒక మరణం సంభవించింది. గానుగుపెంట, బడుగులేరుల్లో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆ రెండు గ్రామాల్లో పర్యటించింది. గ్రామస్థులను అప్రమత్తం చేసింది. 

మాచవరం పీహెచ్‌సీ పరిధిలో 12 మందికి పాజిటివ్‌ 

కరోనా సెకండ్‌వేవ్‌ గ్రామీణ ప్రజలను వణికిస్తోంది వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తోంది. మాచవరం పీహెచ్‌సీలో మంగళవారం 25 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. బూతంవారిపల్లిలో ఒకరు మృతి చెందారు. ఆయన నాలుగు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కనిగిరి ఏరియా వైద్యశాలలోని కరోనా సెంటర్‌కు తరలించారు. సోమవారం రాత్రి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఆయన తల్లి కూడా వైరస్‌ బారిన పడి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. దీంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండటంపై ఆందోళన చెందుతున్నారు. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వలంటీర్లు అసలు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడి ప్రాథమిక కాంటాక్టులపై అధికారులు దృష్టి సారించారు. వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు. 

గురవాజీపేట పీహెచ్‌సీ పరిధిలో.. 

గురువాజీపేట పీహెచ్‌సీ పరిధిలో కొత్తగా 21 కేసులు నమోదైనట్లు డాక్టర్‌ నాగరాజ్యలక్ష్మి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నామని తెలిపారు. వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తామని చెప్పారు. 

గ్రామాల్లో పర్యటించిన అధికారులు 

అత్యధిక కేసులు నమోదవుతున్న బడుగులేరు, గానుగపెంట, చల్లగిరగల గ్రామాల్లో తహసీల్దార్‌ పుల్లారావు ఇతర టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో కలసి మంగళవారం పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైరస్‌ బాధితులను పరామర్శించారు. 

నామమాత్రంగా ఫీవర్‌ సర్వే

ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఫీవర్‌ సర్వే తూతూమత్రంగా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏఎన్‌ఎంలు, ఆశాలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది జ్వర పరీక్షలు నిర్వహించకుండా ఆయా ఇళ్ల ముందు నిల్చొని జియోలో నమోదు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీని వలన ప్రభుత్వ ఆశయం నీరు గారడంతోపాటు, కేసుల సంఖ్య పెరుగుతున్నదని వారు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా చేయించాలని కోరుతున్నారు. 

పీసీపల్లిలో మరో 13 మందికి పాజిటివ్‌

పీసీపల్లి : మండలంలో మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మెట్టవారిపాలెం, దివాకరపల్లి, నేరేడుపల్లి, పెదఇర్లపాడు, కొత్తపల్లి, కమ్మవారిపల్లి, మలినేనివారిపల్లి గ్రామాలలో మంగళవారం 98 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్త కేసులు తేలాయి.   

మారెళ్లలో జడ్పీ సీఈవో పర్యటన

పీసీపల్లి, మే 18 : మండలంలో రెడ్‌జోన్‌గా ప్రకటించిన మారెళ్ల గ్రామంలో మంగళవారం జడ్పీ సీఈవో కైలాష్‌గిరీశ్వర్‌ పర్యటించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందంతో కలిసి గ్రామంలో వైరస్‌ బారిన పడిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉంటే కరోనా బారినుంచి త్వరగా కోలుకోవచ్చని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలోని రోడ్లను పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్‌ శింగారావు, ఎంపీడీవో కుసుమకుమారి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-05-19T07:40:17+05:30 IST