కబళిస్తున్న మహమ్మారి

ABN , First Publish Date - 2021-05-09T05:34:12+05:30 IST

కబళిస్తున్న మహమ్మారి

కబళిస్తున్న మహమ్మారి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురి మృతి

మృతుల్లో ఖమ్మం కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ 

ఖమ్మం క్రైం/ కొత్తగూడెం/ అశ్వారావుపేట/ దుమ్ము గూడెం, మే 8: కరోనా మహమ్మారి ప్రాణాలను కబళి స్తోంది. ఉమ్మడి ఖమ్మంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఉన్నారు. ఖమ్మంలోని కార్మికశాఖ కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న బిటుకొండ నర సింహరావు(57) కరోనా బారిన పడి శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందారు. 1991లో కార్మికశాఖలో స్టెనోగ్రాఫర్‌గా విధు లు ప్రారంభించిన ఆయన ఏఏల్‌వో, ఏసీఎల్‌గా ఉద్యోగన్నతి పొంది పలుచోట్ల పనిచేశారు. 2019లో డిప్యూటీ కమి షనర్‌గా ఉద్యోగన్నతి పొంది ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల ఒకటి న కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో రెండు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడంతో 4వతేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కార్మికులకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారన్న పేరున్న నరసింహారావు.. పలుమార్లు ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్‌ నుంచి అవార్డులు అందుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ మృతితో కార్మికశాఖలో తీవ్రవిషాదం నెలకొంది. దీంతో పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది, కార్మికసంఘ నాయకులు సంతాపం తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన నలుగురు శనివారం మృతిచెందారు. మృతుల్లో పాల్వంచ మండలానికి చెందిన ఓ వీఆర్వో ఉన్నారు. అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన మొడియం ధర్మారావు(48) పాల్వంచ మండలంలో వీఆర్వోగా పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకటంతో కుటుంబసభ్యులు ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే శనివారం సాయంత్రం మృతి చెందారు. ఇదే ఉసిర్లగూడెం గ్రామానికి వగ్గెల ఆదిలక్ష్మీ(38) కొంతకాలంగా ఇతర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. అయితే ఆమె కుటుంబంలో కరోనా పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఆమెకు కూడా కరోనా లక్షణాలున్నట్టు తెలుస్తోంది. అశ్వారావుపేట పట్టణానికి చెందిన జాన్‌బీ(68) అనే మహిళ నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడగా.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంసభ్యులు అశ్వారావుపేటలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జాన్‌బీ శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఊట్లపల్లి గ్రామానికి చెందిన కె.వెంకటరావు(78))కు పది రోజుల క్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన పరిస్థితి విషమించగా కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు వెళ్లిన వెంకటరావు అక్కడే కుప్పకూలి మృతిచెందారు. 

కరోనా బారిన ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు.. 

ఓ సభ్యురాలికి తీవ్ర అనారోగ్యం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లా బస్తర్‌ అటవీప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం ఉందని దంతెవాడ ఎస్సీ అభిషేక్‌పల్లవ్‌ శనివారం వెల్లడించారు. వీరిలో రూ.25లక్షల పోలీసు రివార్డు ఉన్న కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత కరోనా లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. బస్తర్‌ అటవీ ప్రాంతంలోని గంగలూరు, దర్భా ఏరియా కమిటీలకు చెందిన మొత్తం 50మందికి పైగా కరోనా బారిన పడ్డారని, వీరంతా అటవీప్రాంతంలోనే వైద్య చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిసిందన్నారు. మలంగీర్‌ ఏరియా కమిటీకు చెందిన ఒక మహిళా మావోయిస్టు కలుషిత ఆహారం తిని మృతి చెందినట్టు భావిస్తున్నామన్నారు. 

కరోనా సోకిన మావోయిస్టులు 

లొంగిపోతే వైద్యం అందిస్తాం  

భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ సునిల్‌ దత్‌ 

మావోయిస్టు పార్టీలోని కొందరు నాయకులు, దళ సభ్యులు కరోనా బారిన పడి, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తమక సమాచారం అందిందని, అలాంటి వారు ఎవరైనా లొంగిపోయి వైద్యసాయం పొందవచ్చని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌దత్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా, తద్వారా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులు ఎవరైనా మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చి పోలీసుశాఖ సాయాన్ని పొందవచ్చ న్నారు. కిందిస్థాయి నాయకులు, సభ్యులు మెరుగైన వైద్యం పొందేందుకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు నిరాకరించిన పరిస్థితుల్లో వెంటనే మావోయిస్టు పార్టీని వీడి బయటకు వచ్చి పోలీసు సమక్షంలో లొంగిపోతే వారికి తప్పనిసరిగా కరోనా వైద్య పరీక్షలు, చికిత్సలు చేయిస్తాయని, వారి కుటుంబాలకు సాయం అందిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భద్రాద్రి ఎస్పీ కోరారు.

Updated Date - 2021-05-09T05:34:12+05:30 IST