Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా... వారికి భారీగా కలిసొచ్చింది...

హైదరాబాద్ : టాప్-10 లిస్టెడ్‌ కార్పొరేట్ ఆసుపత్రులు గత ఎనిమిది నెలల్లో... అనూహ్యమైన లాభాలనార్జించాయి. ప్రత్యేకించి... కరోనా సమయంలో కుప్పలుతెప్పలుగా కూడగట్టాయి. ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాయి. వీటి స్టాక్‌ వాల్యుయేషన్లు కూడా ఇదే స్థాయిలో ఎగబాకాయి. అపోలో హాస్పిటల్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, కిమ్స్, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, హెల్త్‌కేర్ గ్లోబల్, కోవై మెడికల్, షాల్బీ, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్‌ హాస్పిటల్‌ చైన్లు, 2020 జూన్‌లో రూ. 964 కోట్ల నష్టాల్లో ఉన్నాయి.


నిరుడు(2021) సెప్టెంబరు నాటికి అవి ఆ నష్టాలను భర్తీ చేసుకుని రూ. 937 కోట్ల లాభాల్లోకి రావడం గమనార్హం. అంటే... కేవలం ఆరు త్రైమాసికాల్లోనే రూ. 1,901 కోట్లు సంపాదించాయి. అంతేకాదు... ఈ కాలంలో వాటి ఆదాయం రెట్టింపయ్యింది. ఎబిటా మార్జిన్‌ 17.6 శాతానికి చేరింది. ముందటేడు(2019) డిసెంబరు త్రైమాసికంలో ఇది 14.7 శాతం. మొదటి లాక్‌డౌన్‌లో కాస్త తగ్గినప్పటికీ, ఆ తర్వాత మాత్రం  గణనీయంగా పుంజుకుంది. కరోనా పరీక్షలు, చికిత్సలు, టీకాలు, కొవిడ్‌యేతర వ్యాపారంతో భారీగా వసూళ్లు చేసి, నష్టాలను భర్తీ చేసుకున్నాయని చెబుతున్నారు. కరోనా కంటే ముందునుంచీ పనిచేస్తూ, ఇబ్బందుల్లో ఉన్న కొత్త ఆసుపత్రుల దశ కరోనా రాకతో మారిపోవడం గమనార్హం. అవి కూడా భారీ వ్యాపారాన్నే నిర్వహించుకోగలిగాయి. హాస్పిటల్‌ చైన్స్‌ తమ అప్పులను భారీగా తగ్గించుకున్న నేపధ్యంలో... చెల్లించాల్సిన వడ్డీలు 2020 మార్చి త్రైమాసికంలోని రూ. 393 కోట్ల నుండి, 2021 సెప్టెంబరు త్రైమాసికంలో దాదాపు 30 శాతం మేర  తగ్గిపోయి, రూ. 280 కోట్లకు పడిపోయాయి.


దేశంలోని అతి పెద్ద ప్రైవేటు హాస్పిటల్ చైన్ అయిన అపోలో హాస్పిటల్స్ అప్పు ...2020 జూన్ చివరి నాటికి ఉన్న రూ. 3,014 కోట్ల నుంచి 2021 సెప్టెంబరు చివరి నాటికి రూ. 1,297 కోట్లకు తగ్గిపోయింది. ఈ కాలంలో ఇది ఆక్యుపెన్సీ, వాల్యూమ్స్‌, మార్జిన్లలో బాగా పెరుగుదల సాధించింది. 


ఇక... కేన్సర్ కేర్ హాస్పిటల్ చైన్ అయిన హెల్త్‌కేర్ గ్లోబల్, 2021 సెప్టెంబరు త్రైమాసికంలో అత్యధిక త్రైమాసికాదాయాన్ని, ఎబిటాను పోస్ట్ చేసింది. గల్ఫ్, దక్షిణ భారతదేశంలో బిజినెస్‌ చేస్తోన్న హాస్పిటల్ చైన్ ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్... దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునేందుకు, తన వ్యాపారంలో దేశీయ వాటాను 40 %కి చేర్చడానికి... క్యాపెక్స్‌ పెంచే దిశగా యోచిస్తోంది. మహమ్మారి తర్వాత, డిజిటలైజేషన్, టెలిమెడిసిన్‌ల్లో ఆస్పత్రులు పెట్టుబడులను పెంచాయి. ప్రోటాన్, రోబోటిక్ సర్జరీల వంటి కొత్త సాంకేతికతలను స్వీకరించే వేగం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. తద్వారా, రోగుల నుంచి వచ్చే సగటు ఆదాయం పెరిగినట్లైంది.  


మొత్తంమీద... ఈ చర్యలు వీటి స్టాక్స్‌లోనూ ప్రతిఫలించాయి. ముందటేడు(2020) మార్చిలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, అపోలో హాస్పిటల్స్ షేర్ ధర దాదాపు నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. నారాయణ హృదయాలయ, ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు కూడా రెట్టింపును దాటి పెరిగిపోయాయి. 2020 ఆగస్టులో లిస్ట్ అయినప్పటి నుంచి మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్ ధర 3.5 రెట్లు పెరిగింది. గత జూన్‌లో లిస్టైన కిమ్స్‌ హాస్పిటల్‌ చైన్‌ 40 % లాభపడింది. మేదాంత, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, క్లౌడ్ నైన్ హాస్పిటల్స్, పార్క్ హాస్పిటల్స్ తదితర పలు చైన్లు ఐపీఓ O కోసం ఆఫర్ డాక్యుమెంట్లను ఇప్పటికే అందించడమో, లేదా ఆ ప్రక్రియలో ఉండడమో జరిగింది. ఇక... ఒకవేళ కరోనా బిజినెస్‌ తగ్గినా.., హై-ఎండ్ ఎలక్టివ్ ప్రొసీజర్స్, మెడికల్ టూరిజం ఈ ఆసుపత్రులకు జవసత్వాలను అందిస్తూనే ఉంటాయన్న అంచనాలున్నాయి. 

Advertisement
Advertisement