Sankranthi Festivalకు సొంతూరు వెళ్దామా.. వద్దా.. వెళ్తే తిరిగి వస్తామా..!?

ABN , First Publish Date - 2022-01-09T05:29:05+05:30 IST

మహమ్మారి పేరు మార్చుకుని మరోసారి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత రెండేళ్లుగా...

Sankranthi Festivalకు సొంతూరు వెళ్దామా.. వద్దా.. వెళ్తే తిరిగి వస్తామా..!?

  • పండుగ ప్రయాణంపై సందిగ్ధం
  • రెట్టింపు వేగంగా ఒమైక్రాన్‌
  • పొరుగు రాష్ర్టాల్లో ఎక్కువగా కేసులు
  • అక్కడి నుంచే పండుగ ప్రయాణాలు
  • వైరస్‌ వ్యాప్తి అధికమంటూ హెచ్చరికలు 
  • అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

 

మహమ్మారి పేరు మార్చుకుని మరోసారి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత రెండేళ్లుగా మన జీవితంలో భాగమైన వైరస్‌ ప్రభావం ఇప్పుడు పెద్ద పండుగపై పడుతోంది. దాని బారి నుంచి నూతన ఏడాదిలో బయటపడ్డామనుకునే లోపే రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. ఆ పాత రోజులు మళ్లీ చూడాలనే భయం అందరిలో మొదలైంది. పండుగలు కూడా జరుపుకోనీయకుండా ఏంటీ ఖర్మ అనే ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. బంధువులతో కళకళ లాడతాయనుకుంటున్న లోగిళ్లు బోసిబోతాయనే భయం నెలకొంది.  


థర్డ్‌వేవ్‌ పేరుతో ఒమైక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. జనవరి 1న నెమ్మదిగా ఉన్న వైరస్‌ వ్యాప్తి శనివారం నాటికి దేశవ్యాపితంగా 7.74శాతంగా నమోదైంది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు ప్రకటిస్తున్నాయి. 

 

గుంటూరు(తూర్పు), జనవరి 8: పండుగకు సొంతూరు వెళ్దామనే వారిని వైరస్‌ వ్యాప్తి మరింత సందిగ్ధంలో పడేసింది. ఊరు వెళ్తే తిరిగి వస్తామా.. లేదా ప్రయాణ సమయంలో వైరస్‌ బారిన పడతామేమో అనే అయోమయం నెలకొంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు జనవరి 14 శుక్రవారం సెలవుగా ప్రకటించారు. ఆ తరువాత శని, ఆది వారాలు ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి మూడు రోజులు సొంతూరిలో గడపవచ్చు అనుకున్నారు. ప్రస్తుత వేరియంట్‌ వేగం వారి ఆశలపై నీళ్లు చల్లింది.

 

కలవర పెడుతున్న వైరస్‌ 

గత రెండేళ్లుగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వర్క్‌ఫ్రమ్‌హోం పేరుతో ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే 25శాతం మంది ఆఫీసులకు వెళ్తున్నారు. వీరితోపాటు బ్యాంకు ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు సొంతూళ్లకు రావాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే బుక్‌ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్‌ చేసుకోవాల లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.  పెద్దవారు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డవారు ఈసారి ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మంచిదని ఆయా ప్రభుత్వాలు కూడా  సూచిస్తున్నాయి.  


ఆ నాలుగు రాష్ర్టాల నుంచే..

మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటితోపాటు పొరుగున ఉన్న తెలంగాణాలో గత రెండురోజుల్లోనే ఒక్కసారిగా వేలల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల నుంచే పండుగ వేళల్లో జిల్లాకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువుగా ఉంటుంది కాబట్టి ఎక్కువశాతం రద్దు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.


గండాంతర రోజుల్లో పండుగ

ఈ సారి గండాతరంలో సంక్రాంతి రోజులు ఉన్నాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఒక రాశిలో నాలుగోపాదం నుంచి మరో రాశిలోని మొదటి పాదంలో ఉండే కాలాన్ని గండాతరంగా అభివర్ణిస్తుంటారు. కుజుడు ఇలా రాశులే మారే సమయంలో ప్రమాద సూచీలు కనబడుతుంటాయని పండితులు చెబుతుంటారు. అలాగే కాలసర్పయోగం కూడా జనవరి 14తో ముగుస్తుంది. సరిగ్గా పండుగ సమయంలో  ఇటువంటి ప్రమాదాలు ఏర్పడటంతో, జాగ్రత్తలు పాటించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.  ముఖ్యంగా 14 నుంచి 18వతేదీల మధ్యలో ప్రయాణాలు అంత మంచిది కాదని, వృద్ధులు వీలైనంతవరకు బయటకు రాకూడదని సూచిస్తున్నారు.  


పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

రెండుసార్లు వ్యాక్సినేషన్‌ తరువాత కూడా కరోనా బారిన పడడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సందేహలపై అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ తన తాజా పరిశోధనల నివేదికలను వెల్లడించింది. కొవిడ్‌ సోకి మృతిచెందిన వారు, కోలుకున్న 44 మందిపై పరిశోధనలు నిర్వహించారు. కొవిడ్‌ తరువాత కూడా శరీరంలో 236రోజుల పాటు మెదడు సహా పలు అవయవాల్లో వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. స్వల్ప లక్షణాలు, తీవ్ర లక్షణాలు ఉన్నావారిలో వైరస్‌ అదేస్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నారు. అత్యధికంగా శ్వాసకోశం, ఊపిరితిత్తుల్లో ఉన్నట్టు గుర్తించారు. 

  

మరికొన్ని జాగ్రత్తలు..

రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త వేరియంట్‌ వ్యాప్తి ప్రభావవంతంగా లేకపోవడంతో కొంతమంది ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. అటువంటి వారు పాటించాల్సిన జాగ్రత్తలపై వైద్యులు తగు సూచనలు చేస్తున్నారు.

- ప్రయాణాలు చేసేవారు రెండు వ్యాక్సిన్‌ డోసులు పూర్తి చేసుకుని ఉండాలి.

-12-18 సంవత్సరాల మధ్య వయస్సు వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

- మాస్క్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.

- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

- జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినపుడు హోం క్వారంటైన్‌లోనే ఉండాలి.

- సాధ్యమైనంత వరకు పండుగను ఇంటి సభ్యుల మధ్యనే జరుపుకోవాలి.

- సొంతూరు చేరుకున్నాక తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

- ప్రయాణ సమయాల్లో బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.

 

 అప్రమత్తంగా ఉండాలి..

జిల్లాలో చాలా తక్కువసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అయినా నిర్లక్ష్యంగా ఉండకూడదు. రానున్న 10 రోజులు చాలా కీలకం. మన ఆరోగ్యంపై భిన్న వేరియంట్లు చూపే ప్రభావంపై మనకు అవగాహన ఉండదు. వ్యాక్సిన్‌ తరువాత కూడా జాగ్రత్తలు పాటించాలని ఒమైక్రాన్‌ నేర్పుతుంది. గతంలో ప్రయాణాల సమయంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండేది. దీన్నిబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. తప్పనిసరి అయితే మాత్రం పలు జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువమంది నగరాల నుంచి పల్లెటూరు వస్తుంటారు కాబట్టి గ్రామీణ ప్రాంత వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి.

- ఎన్‌.ప్రభావతి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌.

Updated Date - 2022-01-09T05:29:05+05:30 IST