300దాటేసి

ABN , First Publish Date - 2020-04-07T09:55:13+05:30 IST

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ట్రిపుల్‌ సెంచరీని దాటేసింది.

300దాటేసి

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా

సోమవారం 37 మందికి పాజిటివ్‌

303కు చేరిన వైరస్‌ బాధితులు

అత్యధికంగా కర్నూలులో 74 కేసులు

రాష్ట్రంలో మూడు మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ట్రిపుల్‌ సెంచరీని దాటేసింది. సోమవారం కొత్తగా 37 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య 303కి చేరింది. వీటిలో దాదాపు నాలుగో వంతు... అంటే 74 కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. అందులోనూ ఈ జిల్లాలో కేవలం రెండు రోజుల్లోనే 70 కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో అత్యధికులు ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన వారు, వారి ద్వారా వైరస్‌ సోకిన వారే! సోమవారం కర్నూలు జిల్లాలో 53 పరీక్షల ఫలితాలు వెలువడగా.. వాటిలో 18 పాజిటివ్‌ కేసులు తేలాయి. మరో 67 నమూనాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.


రేపో మాపో వాటిని కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా కేసుల్లో కర్నూలు తర్వాత 42 కేసులతో నెల్లూరు రెండో స్థానంలో ఉంది. గుంటూరు (32), కృష్ణా (29), కడప (27), ప్రకాశం (24), విశాఖపట్నం (20) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  కరోనా కారణంగా ఏపీలో ముగ్గురు మరణించారని అధికారులు ధ్రువీకరించారు. మార్చి 30న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందగా.. కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 4న మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతనితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి కూడా ఈ నెల 4న కరోనాతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మక్కా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తితో అతను సన్నిహితంగా మెలిగాడు. మరోవైపు... కర్నూలు జనరల్‌ ఆస్పత్రిలో  ఒక వ్యక్తి మరణించిన తర్వాత ‘పాజిటివ్‌’గా తేలింది. అయితే, దీనిని అధికారులు కరోనా మృతిగా గుర్తించలేదు.


గుంటూరులో 2 ఢిల్లీ కనెక్షన్‌ కేసులు

గుంటూరులో మరో ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం పది మందికి సంబంధించిన ఫలితాలు రాగా.. ఆనందపేటలో ఒకరికి, ఆర్టీసీ కాలనీకి చెందిన మరొకరికి పాజిటివ్‌ ఉన్నట్లు వెల్లడైంది. 8 మందికి నెగిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 32కు చేరింది. కొత్తగా పాజిటివ్‌గా తేలిన ఇద్దరికి ఢిల్లీ కనెక్షన్‌తోనే వైరస్‌ సోకింది. కాగా.. ఇంకా పరీక్షల నిమిత్తం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. గుంటూరులోనే ల్యాబ్‌ ఏర్పాటు చేసి రోజుకు 60 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఉమ్మడి వెలిగండ్లకు చెందిన యువకుడికి పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు గత నెలాఖర్లో స్వగ్రామానికి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించటంతో రిమ్స్‌కు తరలించారు.


విశాఖలో మరో ఐదుగురికి 

విశాఖ జిల్లాలో సోమవారం మరో ఐదుగురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 20కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ముగ్గురు ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారిగా తెలిసింది. మరో ఇద్దరు.. 4రోజుల కిందట వైరస్‌ బారినపడిన యువకుడి కుటుంబ సభ్యులుగా అధికారులు తెలియజేశారు. గాజువాక కుంచుమాంబ కాలనీలో ఓ మటన్‌ దుకాణం యజమాని (38)కి పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలో సోమవారం వచ్చిన రిపోర్టుల్లో మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఢిల్లీలోని మత సమావేశానికి వెళ్లొచ్చిన వారే ఎక్కువ. నెల్లూరు నగరానికి చెందిన ఆర్థోపెడిక్‌ వైద్యుడు కరోనా పాజిటివ్‌కు గురై పరిస్థితి విషమించటంతో ఆయన్ను సోమవారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లాలో సోమవారం కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనాపై సమీక్షకు నేడు జిల్లాకు మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైద్య, కుటుంబ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ రానున్నారు. 


ఢిల్లీ వెళ్లొచ్చిన భర్త ద్వారా భార్యకు 

విజయవాడలో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. ఢిల్లీలో మర్కజ్‌ సమావేశాలకు హాజరైన విజయవాడ పాయకాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా.. అతని ద్వారా ఆయన భార్యకు కూడా వైరస్‌ సోకింది. తాజా కేసుతో కలిపి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29కి చేరింది. వీరిలో విదేశాల నుంచి వచ్చినవారు నలుగురు కాగా.. మిగిలిన వారంతా ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లొచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారే.  







Updated Date - 2020-04-07T09:55:13+05:30 IST