కరోనా బాధితుడు అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-15T05:10:35+05:30 IST

కరోనా బాధితుడు అదృశ్యం

కరోనా బాధితుడు అదృశ్యం

మూడు రోజుల తర్వాత మార్చురీలో శవంగా..

బంధువులకు సమాచారం ఇవ్వని జీజీహెచ్‌ సిబ్బంది

విజయవాడ, మే 14 (ఆంధ్రజ్యోతి)/గుడివాడ : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పట్ల వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుడివాడకు చెందిన ఎంఎన్‌వీ సుబ్రహ్మణ్యం (42) కరోనా బారిన పడటంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఈనెల 12వ తేదీ సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి వైద్యాధికారులు అడ్మిట్‌ చేసుకుని, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని తొమ్మిదో ఐసీయూలో 16వ నెంబరు బెడ్‌ను కేటాయించారు. ఆయన ఆసుపత్రిలో చేరిన రోజు రాత్రే మరణించారు. మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియ జేయలేదు. ఆసుపత్రి బయటే పడిగాపులు కాస్తున్న కుటుంబ సభ్యులు,  సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నాడనుకున్నారు. రోజూ సిబ్బందిని అడుగు తున్నా సమాధానం చెప్పేవారే లేరు. మూడు రోజులు గడిచినా సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు, సిబ్బంది ఏమీ సమాచారం చెప్పకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శుక్రవారం సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్దకు వెళ్లి అక్కడున్న వైద్యులు, నర్సులను ఆరా తీశారు. ఆ పేరుతో పేషెంట్‌ ఎవరూ లేరని వారు సమాధానమిచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యాధికారులు రంగంలోకి దిగి బాధితుడు సుబ్రహ్మణ్యం గురించి ఆరా తీశారు. ఆయన 12వ తేదీ రాత్రే చనిపోయారని, మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తేలింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్‌ నెంబరు ఇవ్వకపోవడంతో సమాచారం అందించలేకపోయినట్లు వైద్యాధికారులు చెప్పారు. చేసేదేమీ లేక మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ వెళ్లిపోయారు. 

Updated Date - 2021-05-15T05:10:35+05:30 IST