కరోనా కాలం

ABN , First Publish Date - 2021-05-13T11:28:43+05:30 IST

మనసులో రేగిన సందేహం తీరాలంటే మరణించే దాకా ఎదురు చూడటమే.! ఇక ఇప్పుడు కాలం కరోనాపై నడుస్తోంది...

కరోనా కాలం

మనసులో రేగిన సందేహం తీరాలంటే

మరణించే దాకా ఎదురు చూడటమే.!

ఇక ఇప్పుడు కాలం కరోనాపై నడుస్తోంది

గతియైనా చితియైనా రెప్పపాటు కాలమే.!


ఎన్ని దూరతీరాలు సృష్టించామో

అన్నీ జనసంద్రాల్లో ముంచేశాం

ఎన్నికల చలివేంద్రాల్లోనూ

తుఫానులు సృష్టించడమే కదా రాజముద్ర.!


కనిపించని శత్రువు కోసం పరుగులెత్తి

ఎంత ఆకస్మికంగా బందీలయ్యామో

అంతే వేగంగా రోడ్డున పడ్డాం

ఇక దొరకని వ్యాక్సినేషనే దైవంగా 

సాగిలబడటం!


యంత్రభూతాల్లో చెమట 

ఇంధనాలు ఇంకిపోతూ

మట్టిపూల గాలి సంతకాలు చెదురుతుండగా

రైతులు చింతిస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో 

రాజ్యమేలుతున్న అంగళ్ళ 

సరికొత్త సంతాపం!


మనిషి సృష్టించుకున్న సంపదల విలువ

మనిషినే వింతగా చూస్తూ పరిహాసిస్తోంది

మరణిస్తున్న అప్తుల్ని చూడలేని మనిషిని చూసి

ప్రాణవాయువుకు సైతం 

మృత్యుభయం సోకింది

ఇప్పుడు కాలం కరోనాపై నడుస్తోంది

ఏలికల ప్రాప్త కాలజ్ఞత 

మనల్ని పరాజితం చేస్తోంది

మిత్ర

Updated Date - 2021-05-13T11:28:43+05:30 IST