ముందే బంద్‌.. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ కొరత

ABN , First Publish Date - 2021-04-18T05:22:11+05:30 IST

ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా ఆసుపత్రి అధికారుల సమన్వయలోపం కరోనా వ్యాక్సినేషన్‌కు వచ్చేవారికి శాపంగా మారింది. వ్యాక్సినేషన్‌కు వచ్చిన వారికి కావాల్సిన మేరకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయకపోవటంతో జిల్లా ఆసుపత్రిలోని మూడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ముందే మూతపడ్డాయని వ్యాక్సిన్‌కు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ముందే బంద్‌..  ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ కొరత
ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద రద్దీ

రెండు కేంద్రాల్లో మధ్యాహ్నం 2గంటలవరకే వ్యాక్సినేషన్‌

మూడో కేంద్రంలోనూ 3గంటలవరకే..

లబ్ధిదారులు గోడవతో మరికొందరికి టీకా

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కరోనా పడకల పెంపు 

ఖమ్మంసంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 17: ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా ఆసుపత్రి అధికారుల సమన్వయలోపం కరోనా వ్యాక్సినేషన్‌కు వచ్చేవారికి శాపంగా మారింది. వ్యాక్సినేషన్‌కు వచ్చిన వారికి కావాల్సిన మేరకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయకపోవటంతో జిల్లా ఆసుపత్రిలోని మూడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ముందే మూతపడ్డాయని వ్యాక్సిన్‌కు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు 24గంటలు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో శనివారం లెప్రసీ వార్డు, ఆయుష్‌ విభాగం, ఏఎన్‌ఎం శిక్షణ కేంద్రంలో మూడు ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలు నిర్వహించారు. వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో లెప్రసీ వార్డు, ఆయుష్‌ విభాగం వ్యాక్సినేషన్‌ మధ్యాహ్నం 2గంటలకే మూత వేశారని విమర్శలు వెలువడ్డాయి. ఇక మూడో వ్యాక్సినేషన్‌ కేంద్రంలో మధ్యాహ్నం 3గంటలకే వ్యాక్సిన్‌ కొరత ఏర్పాడింది. తెచ్చిన వయల్స్‌ పూర్తికావటంతో వ్యాక్సిన్‌లేదని ఏఎన్‌ఎం శిక్షణ  కేంద్రం మూసి వేశారు.

వెనుదిరిగిన ఆర్‌టీసీ, ఎస్‌బీఐ ఉద్యోగులు

గతంలో 45ఏళ్లు పైబడిన ఆర్‌టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. 45ఏళ్లు వయస్సు వారికి శనివారం మధ్యాహ్నం జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ వేసేందుకు సమయం ఇచ్చారు. దీంతో ఆర్‌టీసీ ఉద్యోగులు పదుల సంఖ్యలో జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో వెనుదిరిగారు. ఇదే బాటలో ఎస్‌బీఐ అధికారులు, ఉద్యోగులు, ఎక్సైజ్‌ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు వెనుదిరిగారు. కాగా ఆర్‌టీసీ ఉద్యోగులుతో పాటుగా ఓ ఉపాధ్యాయుడు దివ్యాంగురాలైన తన తల్లిని వ్యాక్సినేషన్‌ కోసం తీసుకొచ్చి తమకు ఎందుకు వ్యాక్సిన్‌ ఇవ్వరని ప్రశ్నించటంతో జిల్లా వ్యాక్సిన్‌ మెనేజర్‌ వెంకటరమణ ఒక వయల్‌ తెప్పించి డోసులు ఉన్నంతవరకు  అందించారు. 

5,218 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ

ఖమ్మం జిల్లాలో కొవ్యాగ్జిన్‌ అందుబాటులోకి రావటంతో అనూహ్యంగా వ్యాక్సినేషన్‌ పెరిగింది. శనివారం జిల్లాలో కొవిన్‌యాప్‌లో నమోదు చేసుకున్న 4,837మందితో పాటుగా హెల్త్‌కేర్‌ వర్కర్లు 35మంది, ప్రెంట్‌లైన్‌ వర్కర్లు మరో 346మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో వ్యాక్సిన్‌ పొందిన వారి సంఖ్య 5,218కి చేరింది. 

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కరోనా పడకల పెంపు 

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌కు వార్డుకు కరోనా రోగుల తాకిడి మేరకు జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశాలతో పడకలను పెంచారు. ఇప్పటికే దశల వారీగా 110పడకలు ఏర్పాటు చేయగా అవన్నీ నిండిపోవడంతో ఈనెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘పెద్దాసుపత్రిలో పడకలు పుల్‌’ కథనంపై  కలెక్టర్‌ కర్ణన్‌ స్పందించారు. జిల్లా ఆసుపత్రిలోని ఎన్‌ఆర్‌సీ సెంటర్‌, ఇతర వార్డులను కరోనా ఐసోలేషన్‌వార్డులుగా ఏర్పాటుచేయాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో శనివారం ఎన్‌ఆర్‌సీ సెంటర్‌, ఫీమేల్‌, మేల్‌ మేడికల్‌ వార్డులను మార్పులు చేశారు. మొత్తం జిల్లా ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 200పడకలను సిద్ధం చేశారు. రోగుల తాకిడి పెరిగితే అవసరమైతే 320 పడకలతో వైద్యసేవలు అందించేందుకు అందించేందుకు పడకలు, ఆక్సిజన్‌ ఇతర ఏర్పాట్లు ప్రారంభించారు. 


Updated Date - 2021-04-18T05:22:11+05:30 IST