ఉగ్రరూపం

ABN , First Publish Date - 2021-04-17T05:15:59+05:30 IST

కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో రోజురోజుకూ

ఉగ్రరూపం
కీసర ఆస్పత్రిలో టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

  • విజృంభిస్తున్న కరోనా వైరస్‌
  • రోజువారీగా 1000నుంచి 1500వరకు పాజిటివ్‌ కేసులు  
  • అవసరమైతేనే ప్రభుత్వ కార్యాలయాల్లో అనుమతి
  • ప్రతిరోజూ 8500మందికి పైగా టీకాలు
  • ఇప్పటివరకు 2,47,538 మందికి వ్యాక్సిన్‌


కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రెండో వేవ్‌లో అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిరోజూ వ్యాక్సిన్‌ను ఎక్కువ మందికి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎవరినీ అనుమతి లేకుండా రానివ్వడం లేదు.


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా రెండోదశలో విజృంభిస్తోంది. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు రెట్టింపు అవుతున్నాయి. భౌతిక దూరాన్ని పాటించకపోవడం తోపాటు మాస్కులు ధరించక పోవడం, శానిటైజ్‌ వంటివి వాడకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణప్రాంతాల్లో రోజువారీగా 1000నుంచి 1500వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జ్వరం, జలుబు, తుమ్ములు వంటివి రాగానే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కొవిడ్‌-19పరీక్షలు చేసిన తర్వాతనే వైద్యులు చికిత్స చేస్తున్నారు.


రోజుకు 8500 మందికిపైగా వ్యాక్సిన్‌

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. దీంతో 45సంవత్సరాలు దాటిన వారందరూ కూడా విధిగా టీకా తీసుకునే విధంగా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచింది. జిల్లాలో ప్రస్తుతం 65ఆస్పత్రుల ద్వారా ప్రజలకు కొవిడ్‌ టీకా వేస్తున్నారు. వీటిలో 32 ప్రభుత్వ పీహెచ్‌సీల్లో, 33 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాను వేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం దాదాపుగా 31లక్షల జనాభా ఉంటుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2,47,538 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రోజువారీగా 8500మందికిపైగా టీకాను వేస్తున్నారు. 


 ప్రభుత్వ కార్యాలయాల్లో అప్రమత్తం

మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఉద్యోగులకూ పాజిటివ్‌ నమోదవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో అన్ని కార్యాలయాల్లోనూ ఇన్‌వార్డు సెక్షన్‌ను మూసివేసి, కార్యాలయం ప్రధాన ఎదుట టప్పాల్‌ డబ్బాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌  ప్రాంగణంలోని వివిధ శాఖల్లోకి పనులు నిమిత్తం వచ్చేవారికి టెంపరేచర్‌ చూసిన తర్వాతనే అనుమతి ఇస్తున్నారు. ప్రధాన గేటు వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసరమైతేనే సంబంధిత అధికారులను సంప్రదించాలని ప్రధాన ద్వారం వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. తప్పనిసరి అయితే అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే అనుమతిస్తున్నారు. మాస్కులేని వారిని కార్యాలయాల ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. 


అన్ని ఆఫీసుల్లో పరిశుభ్రత చర్యలు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని అన్ని జిల్లా, మండల కార్యాల యాల్లోనూ రోజువారీగా క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమావేశాలు నిర్వహించే సమయంలో భౌతికదూరం పాటించేలా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక సంస్థలైనా గ్రామపంచాయతీలు, మునిసి పాలిటీల్లోకి కొంత మంది మాస్కులు ధరించకుండానే వస్తు న్నారు. ఈ నేపథ్యంలో మాస్కులేని వారిని అనుమతించడం లేదు. ప్రతి పంచాయతీ కార్యాలయం ఎదుట ‘మాస్క్‌ ధరించి రాగలరు... మీ ఆరోగ్యాన్ని... అందరి ఆరోగ్యాన్ని కాపాడగలరు’ అంటూ నోటీసులను పెట్టారు. మేడ్చల్‌ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో, నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లలో, 9 మునిసి పాలిటీల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తేనే వైరస్‌ దరి చేరదని, అందరూ విధిగా మాస్కులుఽ ధరించి, శానిటైజ్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. 



Updated Date - 2021-04-17T05:15:59+05:30 IST