Abn logo
Aug 5 2020 @ 04:48AM

ఆగని విలయం

 కొత్తగా 940 మందికి పాజిటివ్‌

నరసరావుపేటలో ప్రిన్సిపాల్‌ మృతి

ఒకే వ్యక్తికి రెండోసారి పాజిటివ్‌  

12మంది మృత్యువాత


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభణ జిల్లాలో కొనసాగుతోంది. కొత్తగా 940 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో ఒక్క గుంటూరు నగరంలోనే 288 మంది ఉన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 19,440కి చేరుకొంది. వీరిలో కేవలం 4,505 కోలుకొని ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 14,703 మంది కరోనాతో బాధపడుతున్నారు. మంగళవారం 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఈ నెలలో నాలుగు రోజుల్లోనే మరణాల సంఖ్య 45కి చేరుకొన్నది. మొత్తంగా మరణాలు 232కి చేరాయి. జిల్లాలో రోజుకు 6,500 వరకు కరోన టెస్టులు చేస్తుండగా 1000 వరకు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.  నరసరావుపేటలో ఒక్క రోజే మంగళవారం 62 మందికి పాజిటివ్‌ నమోదైంది.  పాజిటివ్‌తో విజయవాడలో చికిత్స పొందుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మృతి చెందినట్టు వైద్య అధికారులు ధ్రువీకరించారు. 


గుంటూరు రోడ్డులో కరోనా నుంచి కోలుకున్న ఓ  వ్యక్తి మరలా పాజిటివ్‌ నమోదు కావడం అందోళన కలిగించే అంశంగా ఉంది. దుర్గి మండలంలో మంగళవారం 18మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అమరావతి మండలంలోని  లింగాపురం గ్రామంలో 15 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి కె శ్రీజ్యోతి తెలిపారు. గురజాల మండలంలో మంగళవారం 25 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  డాక్టరు రేవతి తెలిపారు.


బాపట్ల పట్టణంలో 15మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ భాస్కరరావు తెలిపారు.  వినుకొండ నియోజకవర్గంలో 14 కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి మండలంలో 68 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  అమృతలూరు మండలంలో మంగళవారం 14 కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి.  తెనాలి పట్టణంలో 31, రూరల్‌ మండలంలోని కఠెవరం, కోపల్లె గుడివాడ, పెదరావూరులో ఒకొక్క కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు తెలిపాయి. కరోనాతో మృతిచెందిన మహిళ అంత్యక్రియల్లో తాడేపల్లి తహశీల్దార్‌ వాకా శ్రీనివాసులురెడ్డి పాల్గొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. 

  

కరోనాతో టీడీపీ నేత మృతి

చిలకలూరిపేట పట్టణానికి చెందిన టీడీపీ నేత కూనల చంద్రకుమార్‌(42) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 28న అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచాడు. ఇటీవల మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని 22వ వార్డు టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఆయన మృతికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ కరిముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్‌ సమద్‌ఖాన్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేసినవారిలో ఉన్నారు.

Advertisement
Advertisement