అదనపు శక్తి కోసం...

ABN , First Publish Date - 2020-03-14T05:48:54+05:30 IST

పరీక్షల వేళ... పిల్లలకు సరైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. వారి మెదడు చురుకుగా పనిచేయాలంటే అదనపు శక్తి అవసరం అవుతుంది. రెగ్యులర్‌ వంటకాలను కాసేపు పక్కన పెట్టి, పోషకాలు అధికంగా ఉండే ‘ఎగ్జామ్‌ ఫుడ్‌’ అందివ్వడం వల్ల పిల్లలు అలసిపోకుండా చదువుతారు.

అదనపు శక్తి కోసం...

పరీక్షల వేళ... పిల్లలకు సరైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. వారి  మెదడు చురుకుగా పనిచేయాలంటే అదనపు శక్తి అవసరం అవుతుంది. రెగ్యులర్‌ వంటకాలను కాసేపు పక్కన పెట్టి, పోషకాలు అధికంగా ఉండే ‘ఎగ్జామ్‌ ఫుడ్‌’ అందివ్వడం వల్ల పిల్లలు అలసిపోకుండా చదువుతారు. క్యారెట్‌ అన్నం, ఓట్స్‌ చాట్‌, మిల్లెట్‌ దోశ, పెరుగు శాండ్‌విచ్‌... ఇవన్నీ కూడా  పిల్లల మెదడును చురుగ్గా మారుస్తాయి. ఇవి రుచికరంగా ఉండటమేగాక, వారికి అదనపు శక్తి ని అందిస్తాయి. మరెందుకు ఆలస్యం... మీరూ ట్రై చేయండి!


క్యారెట్‌ అన్నం

కావలసినవి

క్యారెట్‌ తురుము - ఒక కప్పు, బాస్మతి బియ్యం - ఒక కప్పు, సాంబార్‌ పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, గరంమసాలా - చిటికెడు, కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - అర టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ

ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి.

అన్నం ఉడికే సమయంలోనే కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్‌ నూనె వేయాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి.

ఉల్లిపాయలు వేగాక క్యారెట్‌ తురుము వేయాలి.

సాంబార్‌ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాల పాటు చిన్నమంటపై ఉడికించాలి.

ఇప్పుడు గరంమసాలా వేసి దించాలి. 

వండి పెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని కలపాలి.

కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. 



ఓట్స్‌ చాట్‌

కావలసినవి

ఓట్స్‌ - పావు కప్పు, పెరుగు - మూడు టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు - ఒక టేబుల్‌స్పూన్‌, చాట్‌ మసాలా - పావు టీస్పూన్‌, జీలకర్రపొడి - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా, గ్రీన్‌చట్నీ - టీస్పూన్‌, స్వీట్‌చట్నీ - టీస్పూన్‌, కారప్పూస - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఓట్స్‌ను చిన్నమంటపై వేగించాలి.

ఒక పాత్రలో పెరుగు, చాట్‌ మసాలా, జీలకర్రపొడి వేసి కలపాలి.

స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ వేసి కలియబెట్టాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేగించిన ఓట్స్‌లో వేసి కలపాలి.

దానిమ్మ గింజలు, కొత్తిమీర, కారప్పూసతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.




పెరుగు శాండ్‌విచ్‌

కావలసినవి

బ్రెడ్‌ ముక్కలు - నాలుగు, పెరుగు - పావు కప్పు, క్యాప్సికం - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, ఎండు మిర్చి - ఒకటి.


తయారీ

పెరుగును ఫ్రిజ్‌లో అరగంట పాటు పెట్టాలి. పెరుగులో నీళ్లు లేకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి.

క్యాప్సికం, ఉల్లిపాయ, క్యాబేజీ, కొత్తిమీరను కట్‌ చేసుకోవాలి. ఎండుమిర్చిని పొడిపొడిగా చేయాలి.

వాటిని పెరుగులో వేసి కలపాలి. 

బ్రెడ్‌ ముక్కలు తీసుకుని వెన్న రాయాలి. తరువాత బ్రెడ్‌పై పెరుగు మిశ్రమం వేసి, పైన మరొక బ్రెడ్‌ పెట్టాలి.

రుచికరమైన ఈ పెరుగు శాండ్‌విచ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.



మిల్లెట్‌ దోశ

కావలసినవి

ఊదలు - అరకప్పు, మినప్పప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు, టొమాటోలు - రెండు, ఎండుమిర్చి - నాలుగు, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ

ఊదలు, మినప్పప్పు, కందిపప్పును శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టాలి.

తరువాత నీళ్లను తీసేసి, ఎండుమిర్చి వేసి మిక్సీలో గ్రైండ్‌ చేయాలి.

టొమాటోలను ముక్కలుగా కట్‌ చేసి వేసి మరొకసారి గ్రైండ్‌ చేసి పేస్టులా పట్టుకోవాలి. దోశలు వేసుకునేందుకు అనువుగా పిండి కాస్త పలుచగా ఉండేలా చూసుకోవాలి. 

తగినంత ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి వేసుకుని కలియబెట్టాలి.

పెనం స్టవ్‌పై పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేయాలి. రెండు వైపులా కాల్చి వేడివేడిగా పిల్లలకు అందించాలి.

Updated Date - 2020-03-14T05:48:54+05:30 IST