కారు మబ్బుల్లో ఆర్థికం

ABN , First Publish Date - 2022-01-24T06:54:29+05:30 IST

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై పలు దట్టమైన మరకలున్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు మంచి జిలుగులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు....

కారు మబ్బుల్లో  ఆర్థికం

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ 

రఘురామ్‌ రాజన్‌


న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై పలు దట్టమైన మరకలున్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు మంచి జిలుగులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం భారీ లోటుకు తావు లేకుండా విభిన్న వ్యయాలను నిర్ణయించాలని ఆయన సూచించారు. దేశంలో నిరుద్యోగిత అధికంగా ఉండడం, దిగువ మధ్య తరగతి వర్గా ల కొనుగోలు శక్తి క్షీణించడం, చిన్న/మధ్య తరహా పరిశ్రమలపై ఆర్థిక ఒత్తిడి వంటివి ఆర్థిక వ్యవస్థపై గల దట్టమైన మరకలని ఆయన వివరించారు.


ఇదే సమయంలో భారీ పరిశ్రమలు, ఐటీ/ఐటీ ఆధారిత పారిశ్రామిక రంగాలు, యునికార్న్‌ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం ఆర్థిక వ్యవస్థకు గల సానుకూలత అని రాజన్‌ చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను కె-షేప్‌ రికవరీ (ఆర్థిక వ్యవస్థలో భిన్న వర్గాల మధ్య విభిన్న తీరులో రికవరీ) నుంచి కాపాడడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. తాను ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, చిన్న/మధ్యతరహా పరిశ్రమలు, భవిష్యత్‌ తరానికి ప్రతీకలైన బాలల గురించే ఆందోళన చెందుతున్నట్టు ఆయన చెప్పారు. డిమాండు పెరిగినప్పడు ఏర్పడే ప్రాథమిక పునరుజ్జీవం తర్వాతనే వీరందరూ కోలుకోగలుగుతారని ఆయన అన్నారు. ప్రస్తుత వాతావరణంలో 5 నుంచి 10 సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో కూడిన విజన్‌ పత్రం రావాలని తాను కోరుతున్నట్టు ఆయన తెలిపారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల కాలానికి సమీకృత రుణ లక్ష్యం నిర్దేశించడంతో పాటు బడ్జెట్‌ నాణ్యతకు దిశానిర్దేశం చేయడానికి స్వతంత్ర ఆర్థిక మండలి ఏర్పాటు కావాలని రాజన్‌ సూచించారు.

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణుల గురించి మాట్లాడుతూ ఏ దేశానికైనా ద్రవ్యోల్బణం ఆందోళనకరమేనని, భారతదేశం అందుకు అతీతం కాదని ఆయన చెప్పారు. రాబోయే బడ్జెట్లో మరిన్ని సుంకాల కోతలు, సుంకాల ప్రోత్సాహకాలు తక్కువ ఉండేలా చూడాలన్నది తన అభిప్రాయమన్నారు. 

Updated Date - 2022-01-24T06:54:29+05:30 IST