కదలని రెవెన్యూ రికార్డుల తారుమారు కేసు

ABN , First Publish Date - 2020-09-26T10:38:09+05:30 IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజిపల్లిలో అసైన్డ్‌ భూముల కేటాయింపులో సస్పెండ్‌ అయిన కామారెడ్డి

కదలని రెవెన్యూ రికార్డుల తారుమారు కేసు

మరికొందరిపై నమోదు కాని క్రిమినల్‌ కేసులు

అమలు కాని సీఎస్‌ ఆదేశాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 25 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజిపల్లిలో అసైన్డ్‌ భూముల కేటాయింపులో సస్పెండ్‌ అయిన కామారెడ్డి ఆర్డీవో జి.నరేందర్‌, మెదక్‌ కలెక్టరేట్‌లోని డిప్యూటీ తహసీల్దార్‌ కె.నారాయణ తదితరులపై నమోదైన క్రిమినల్‌ కేసులో విచారణ ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. నలుగురు మాజీ సైనికులకు ఒక్కొక్కరికీ ఐదెకరాల చొప్పున ఖాజీపల్లిలో కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాలను కేటాయించారు. 2012-13లో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన, కామారెడ్డి ఆర్డీవోగా ఇటీవల వరకు పని చేసిన జి.నరేందర్‌, నాడు డిప్యూటీ తహసీల్దార్‌ (పౌరసరఫరాలు)గా పని చేసిన, ప్రస్తుతం మెదక్‌ కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న కె.నారాయణ, అప్పుడు వీఆర్వోగా పని చేసి నర్సాపూర్‌ గిర్దావర్‌గా రిటైరైన జి.వెంకటేశ్వర్‌రావు అసైన్‌మెంట్‌ కమిటీ, పహానీ తదితర రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో కేటాయించినట్లు జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు జరిపించిన విచారణలో వెల్లడైంది. దాంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ దశరథ్‌ గత నెల 14న ఐడీఏ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కామారెడ్డి ఆర్డీవో నరేందర్‌, మెదక్‌ డిప్యూటీ తహసీల్దార్‌ కె.నారాయణ, రిటైరైన గిర్దావర్‌ వెంకటేశ్వర్‌రావుతో పాటు నలుగురు మాజీ సైనికులపై సెక్షన్లు 420, 468, 470 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 


ఈ నెల 15వ తేదీన ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో నరేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కె.నారాయణను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌కుమార్‌ ఈ కేసుతో సంబంధం ఉన్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్దన్‌, సర్వేయర్‌ ఎన్‌.లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌ఎం.ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ ఎం.సహదేవ్‌, 2019లో పనిచేసిన సంగారెడ్డి ఆర్డీవోపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ ఉత్తర్వులు వచ్చి పది రోజులు గడిచినా చీఫ్‌ సెక్రటరీ పేర్కొన్న మరో ఐదుగురు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసు విచారణ కోసం బొల్లారం సీఐ ప్రశాంత్‌కు ఇవ్వాల్సిన రెవెన్యూ రికార్డులు, డాక్యుమెంట్లను ఇప్పటివరకు ఆయనకు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా ఉన్నతాధికారులు, రాజకీయనేతలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-09-26T10:38:09+05:30 IST