జూబ్లీహిల్స్‌ : పెట్టుబడి పెడతానని నిధుల దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-05-27T14:38:36+05:30 IST

కంపెనీలో పెట్టుబడి పెడతానని సంస్ధలో సీఈఓగా చేరి ...

జూబ్లీహిల్స్‌ : పెట్టుబడి పెడతానని నిధుల దుర్వినియోగం

  • వ్యాపారిపై కేసు నమోదు 


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : కంపెనీలో పెట్టుబడి పెడతానని సంస్ధలో సీఈఓగా చేరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యాపారిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చంద్రశేఖర్‌ వేగే రోడ్డు నెంబరు 36లె గోల్డ్‌ఫిష్‌ అటోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కార్యాలయం ఏర్పాటు చేసి రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణాలు చేపడుతుంటారు. 2013లో జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త వేణుమాధవ్‌తో పరిచయం ఏర్పడింది. వేణుమాధవ్‌ న్యూవెంచర్స్‌ కాపిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థ ద్వారా రియల్‌ వ్యాపారం చేస్తున్నాడు. గోల్డ్‌ ఫిష్‌లో పదిశాతం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉందని చంద్రశేఖర్‌ను నమ్మించాడు. రూ.పది కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పారు. చంద్రశేఖర్‌ దీనికి అంగీకరించాడు. పెట్టుబడి పెట్టక ముందే వేణుమాధవ్‌ సీఈఓ పదవి అప్పగించారు. ఆ తరువాత వేణుమాధవ్‌ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులను ఎవరి అనుమతి లేకుండా గోల్ట్‌ఫిష్‌లోకి మార్చాడు. వారికి అక్రమంగా రూ.1.10 కోట్ల జీతాలు గోల్ట్‌ఫిష్‌ నుంచి చెల్లించాడు. ఖర్చు చేసి తన కార్యాలయానికి మార్పులు చేర్పులు చేశాడు. గోల్ట్‌ఫిష్‌కు చెందిన డబ్బుతో మెర్సిడిజ్‌ బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు.


ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వేణుమాధవ్‌ ఈ యేడాది జనవరిలో కంపెనీకి రాజీనామా చేశాడు. గోల్డ్‌ఫిష్‌ నిర్వాహకుడు కారు తిరిగి ఇవ్వాలని, లెక్కలు అప్పగించాలని కోరినా వేణుమాధవ్‌ స్పందించలేదు. అంతే కాకుండా గోల్డ్‌ఫిష్‌ కార్యకలాపాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వేణుమాధవ్‌ మోసం చేసినట్టు గ్రహించిన కంపెనీ ఎండీ చంద్రశేఖర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో అక్రమంగా జీతాలు చెల్లించడంతో పాటు కార్యాలయ ఆధునికీకరణ పేరిట రూ.50 లక్షలు కంపెనీ నిధులు దుర్వినియోగం చేశాడని, మరో రూ.40 లక్షలు ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి దారి మళ్లించాడని, కంపెనీ కారు తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు వేణుమాధవ్‌పై 406, 409, 420 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2018లో కూడా వేణుమాధవ్‌ మరికొందరు కలిసి ఎన్‌ఆర్‌ఐల వద్ద వ్యాపారం పెరిట పెట్టుబడి తీసుకొని మోసం చేసిన కేసు జూబ్లీహిల్స్‌లోనే నమోదైంది.

Updated Date - 2021-05-27T14:38:36+05:30 IST