కేసు చిన్నదో.. పెద్దదో.. కాసుల మూట ఇవ్వాల్సిందే..!

ABN , First Publish Date - 2020-05-27T08:39:37+05:30 IST

కమిషనరేట్‌లోని ఉపకమిషనర్‌ 2 పరిధిలో ఉన్న..

కేసు చిన్నదో.. పెద్దదో.. కాసుల మూట ఇవ్వాల్సిందే..!

కేసులే కాసులు

లాక్‌డౌన్‌లో ఓ అధికారికి ‘ఫుల్‌’ ఇన్‌కం

మద్యం అక్రమ రవాణాలో అసలు దొంగలకు క్లీన్‌చిట్‌

కారు డ్రైవర్‌పై నామమాత్రపు కేసు

ఉన్నతాధికారులకు చిక్కకుండా  కింది స్థాయి సిబ్బందిపై నోట్‌ఫైల్‌

అందుకు ప్రతిఫలంగా లక్షల కానుక

‘షీట్‌’ తొలగింపునకూ ‘కరెన్సీ  షాట్‌’

కమిషనరేట్‌లో జోరుగా సాగుతున్న చర్చ


ఆంధ్రజ్యోతి - విజయవాడ: ఆయన వద్దకు ఏదైనా కేసు వెళ్లిందంటే కాసుల మూట దొరికినట్టే. ‘పంచాయితీ’ని బట్టి ధర పలికిస్తాడు. కేసు కాస్త చిన్నదైతే వెటకారంగా మాట్లాడి వేలాది రూపాయలను లాగేస్తాడు. అదే కేసు కాస్త పెద్దదైతే లకారాలే.. అధికారిక ముసుగులో వ్యక్తిగత అజెండాను అమలు చేస్తాడు. మనసులో తాను అనుకున్నది చేస్తూనే ఉన్నతాధికారుల దృష్టిలో ఉత్తమ అధికారి అనిపించుకోవడానికి నానా హడావిడి చేస్తాడు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆయన పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.


కమిషనరేట్‌లోని ఉపకమిషనర్‌ 2 పరిధిలో ఉన్న ఓ అధికారి ఏ కేసు డీల్‌ చేసినా ఓ ‘లెక్క’ ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో లెక్కకు మించిన ఆ అధికారి సిత్రాలు ఒక్కొక్కటిగా ఉన్నతాధికారుల వద్దకు చేరుకుంటున్నాయి. కత్తులు పట్టుకుని తిరిగిన కంత్రీలు మొదలుకుని, చీకట్లో మందును తరలించిన వ్యక్తుల వరకు ఈయన ఎవరినీ వదలలేదు. అవకాశాన్నిబట్టి అందినంత దండుకున్నారు.  


ఇదీ మద్యం కథ

గడచిన నెలలో కరోనా విధుల్లో ఉన్న పోలీసులు ఒక కారులో మద్యం వెళ్తున్నట్టు గుర్తించారు. చుట్టుగుంటలోని ఒక ప్రముఖ బార్‌ నుంచి మద్యం సీసాలు కారులోకి వెళ్లాయి. ఈ బార్‌ నిర్వాహకులకు నగరంలో నాలుగైదు బార్లు ఉన్నాయి. సీసాలను తరలిస్తున్నప్పుడు నిర్వాహకులూ అక్కడే ఉన్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులకు వారు బహిరంగంగానే ‘ఆఫర్‌’ ఇచ్చారు. మొత్తం సరుకుతోపాటు అదనంగా నోట్ల కట్టలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీనికి ఆ పోలీసులు అంగీకరించలేదు. కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు.


ఇలా లాభం లేదనుకున్న నిర్వాహకులు నేరుగా ఆ పోలీసుల పైఅధికారి వద్దకు వెళ్లి మొత్తం పంచాయితీని పూస గుచ్చినట్టు చెప్పేశారు. అంతే కథ మారిపోయింది. మద్యం అక్రమ రవాణాను గుర్తించిన పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేకుండా స్టేషన్‌లో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్న మరో మహిళా ఎస్‌ఐ సీన్‌లోకి వచ్చేశారు. ఆమే కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎక్కడా నిర్వాహకుల పేర్లు బయటకు రాలేదు. కేసు నమోదు చేశామని ఉన్నతాధికారులకు చెప్పుకోవడానికి కారు డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్‌ వేశారు. దీనితో కేసు దర్యాప్తు పూర్తయిందనిపించారు.


ఈ కేసులో నిర్వాహకులను పక్కకు తప్పించినందుకు ఆ అధికారికి లక్షలాది రూపాయలు గిట్టుబాటు అయినట్టు కమిషనరేట్‌ మొత్తం కోడై కూస్తోంది. చేయాల్సిందంతా చేసినా ఉన్నతాధికారుల వద్ద తాను మాత్రం నిప్పు అని నిరూపించుకోవడానికి మరో ఎత్తు వేశారు. కింది స్థాయి పోలీసుల నిర్లక్ష్యం వల్లే మద్యం అక్రమంగా తరలి వెళుతోందని అధికారులకు నోట్‌ఫైల్‌ రాశారు. దీన్ని బట్టి ఉన్నతాధికారులు ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే కిందిస్థాయి సిబ్బంది బలైపోతారు. పైగా ఈ మొత్తం కేసు మాఫీలో కీలకంగా వ్యవహరించిన ఆ అధికారి నోట్‌ఫైల్‌ పెట్టేశారు కాబట్టి సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టవుతుంది.

Updated Date - 2020-05-27T08:39:37+05:30 IST