3 కోట్లు దాటిన కేసులు

ABN , First Publish Date - 2021-06-24T09:09:41+05:30 IST

దేశంలో 50,848 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది.

3 కోట్లు దాటిన కేసులు

కొత్తగా 50 వేల మందికి ‘పాజిటివ్‌’

న్యూఢిల్లీ, జూన్‌ 23 : దేశంలో 50,848 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. కొత్త కొవిడ్‌ కేసుల సంఖ్య అంతక్రితం రోజు (మంగళవారం) నాటి కేసుల (42,640) కంటే 19 శాతం పెరగడం గమనార్హం. 2020 డిసెంబరు 19 నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య కోటికి చేరగా, మే 4 నాటికి అవి రెట్టింపై 2 కోట్ల మార్కును దాటాయి. ఆ తర్వాత కేవలం 50 రోజుల్లోనే  (జూన్‌ 23 నాటికి) కొత్తగా మరో కోటి కేసులు పెరిగాయి. ఈ లెక్కన గత ఆరు నెలల వ్యవధిలో దేశంలో 2 కోట్ల కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు మాత్రం 82 రోజుల కనిష్ఠానికి తగ్గాయి. ఇవి గత 24 గంటల వ్యవధిలో 19,327 తగ్గి 6,43,194కు చేరాయి. మరో 68,817 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటిదాకా రికవరీ అయిన రోగుల సంఖ్య 2.89 కోట్లకు చేరింది. గత 41 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీ కేసుల  సంఖ్య ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 1,358 మంది కరోనాతో చనిపోవడంతో మొత్తం మరణాలు 3.90 లక్షలు దాటాయి. 


చూస్తూ కూర్చోవద్దు:వీకే పాల్‌

దేశంలో డెల్టా ప్లస్‌ కరోనా వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి వీటి సంఖ్య 22 ఉండగా, బుధవారంకల్లా 40కి పెరిగాయి.  మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్‌లో 6, కేరళలో 3, తమిళనాడులో 3, కర్ణాటకలో 2, పంజాబ్‌, ఏపీ, జమ్మూలలో ఒక్కో డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న సంఖ్యలో ఉన్న డెల్టా ప్లస్‌ కేసులు భారీ గా పెరిగే దాకా చూస్తూ కూర్చోకూడదని,  దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం పంపిందని వ్యాక్సినేషన్‌ కార్యక్రమ జాతీయ నిపుణుల బృందం సారథి వి.కె.పాల్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. ఇక దేశంలో జూన్‌ 21న వ్యాక్సినేషన్‌ చేయించుకున్న ప్రతి ఐదుగురిలో ముగ్గురు గ్రామీణ ప్రాంతాల వారే కావడంపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తంచేశారు.  జూన్‌ 21న దేశవ్యాప్తంగా 88.09 లక్షల టీకా డోసులతో వ్యాక్సినేషన్‌ చేయగా, వాటిలో దాదాపు 64 శాతం డోసులను గ్రామీణ ప్రజలకే ఇచ్చారని తెలిపారు. 


3 రోజుల్లో రాష్ట్రాలకు 39 లక్షల డోసులు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 39.07 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  బుధవారం ఉదయం 8గంటల వరకు 29.68 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Updated Date - 2021-06-24T09:09:41+05:30 IST