వైసీపీలో కేసుల గోల!

ABN , First Publish Date - 2020-07-10T08:27:11+05:30 IST

అధికార పక్షం వైసీపీ ప్రజాప్రతినిధులు పరస్పరం కేసులు పెట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని,

వైసీపీలో కేసుల గోల!

  • సొంత ఎంపీపై పోలీసులకు మంత్రి, ఎమ్మెల్యేల ఫిర్యాదు
  • రఘురామరాజును ఉక్కిరిబిక్కిరి చేసేందుకే?

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అధికార పక్షం వైసీపీ ప్రజాప్రతినిధులు పరస్పరం కేసులు పెట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, తన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఇదివరరకే వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇసుక, ఇళ్ల స్థలాల్లో అవినీతి గురించి మాట్లాడినందుకు ఆయనకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీసు జారీచేయడం.. దానికి ఆయన జవాబివ్వడం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను వైసీపీ కోరడం.. తనపై చర్యలు తీసుకోకుండా నిలువరించాలని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు అందరికీ తెలిసినవే.


ఇప్పుడు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వైసీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. ఆయన సొంత జిల్లా పశ్చిమగోదావరిలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారిలో ఆచంట ఎమ్మెల్యే, గృహనిర్మాణ మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్‌ను, తమను రఘురామరాజు దూషించారని.. తమ దిష్టి బొమ్మలను ఎంపీ అనుచరులు దహనం చేశారని వారు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది. అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయం తీసుకునేలోపు.. రఘురామరాజును ఉక్కిరిబిక్కిరి చేయడం... పొమ్మనకుండా పొగపెట్టడమే ఈ ఫిర్యాదుల అంతరార్థమని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-10T08:27:11+05:30 IST