మళ్లీ నగదు హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-01-11T06:16:23+05:30 IST

కొవిడ్‌-19 దెబ్బకు దేశంలో మళ్లీ నగదుకు గిరాకీ ఏర్పడింది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో ప్రజలు నగదు రూపంలో డబ్బులు చేతిలో ఉంచుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ

మళ్లీ నగదు హల్‌చల్‌

  •  13 శాతం పెరిగిన కరెన్సీ చలామణి
  •  కొవిడ్‌ దెబ్బతో గిరాకీ


ముంబై: కొవిడ్‌-19 దెబ్బకు దేశంలో మళ్లీ నగదుకు గిరాకీ ఏర్పడింది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో ప్రజలు నగదు రూపంలో డబ్బులు చేతిలో ఉంచుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి 1 నాటికి దేశం లో చలామణిలో ఉన్న నగదు రూ.27,70,315 కోట్లకు చేరింది. గత ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న రూ.24,47,312 కోట్లతో పోలిస్తే ఇది 13.2 శాతం ఎక్కువ. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా గా విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.


కాగా 2019-20 ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలలతో పోల్చినా ఇది చాలా ఎక్కువే. 2019 ఏప్రిల్‌ నుంచి 2020 డిసెంబరు మధ్య కాలంలో ఈ పెరుగుదల 6 శాతం మాత్రమే. కొవిడ్‌ కారణంగా ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ఇష్టపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 


కేలండర్‌ ఇయర్‌లో మరింత వృద్ధి: కేలండర్‌ ఇయర్‌ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా 2020లో నగదు చలామణి బాగా పెరిగింది. 2021 జనవరి 1 నాటి కి దేశంలో రూ.27,70,315 కోట్ల నగదు చలామణిలో ఉంది. అంతకు ముందు సంవత్సరం (2019)తో పోలిస్తే ఇది ఏకంగా 22.1 శాతం ఎక్కువ. చలామణిలో ఉన్న బ్యాంకు నోట్లు, నాణేలను కలిపి చలామణిలో ఉన్న నగదు (సీఐసీ)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో 80 శాతానికిపైగా వాటా రూ.500, రూ.2,000 నోట్లదే కావడం విశేషం.


Updated Date - 2021-01-11T06:16:23+05:30 IST