మళ్లీ ‘నగదే’ కింగ్‌

ABN , First Publish Date - 2021-05-17T06:35:45+05:30 IST

కొవిడ్‌-19 ప్రజల ఆర్థిక లావాదేవీల ప్రవర్తనను మార్చేస్తోంది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వేళ ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని భయపడి పోతున్నారు. ఎందుకైనా మంచిదని ముందే వీలైనంత ఎక్కువ నగదు దగ్గర...

మళ్లీ ‘నగదే’ కింగ్‌

  • కొవిడ్‌తో పెరిగిన ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ 

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ప్రజల ఆర్థిక లావాదేవీల ప్రవర్తనను మార్చేస్తోంది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వేళ ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని భయపడి పోతున్నారు. ఎందుకైనా మంచిదని ముందే వీలైనంత ఎక్కువ నగదు దగ్గర పెట్టుకుంటున్నారు. ఇందుకోసం ఏటీఎంల నుంచి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్నారు. తరచూ బ్యాంకులు, ఏటీఎంలకు వెళితే ఎక్కడ కొవిడ్‌ అంటుకుంటుందోనన్న భయం, కేవైసీ నిబంధనలతో ఆసుపత్రుల వంటి సంస్థలు రూ.2 లక్షలకు మించి నగదు చెల్లింపులను అనుమతించడమూ ఇందుకు దోహదం చేస్తోంది. 


పెరిగిన చలామణి

కొవిడ్‌కు ముందు ఎవరైనా ఏటీఎంకు వెళితే మహా అయితే సగటున రూ.2,000 లేదా రూ.3,000 విత్‌డ్రా చేసేవారు. ఇప్పుడది రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఉంటోంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలోనూ ఇదే పరిస్థితి. దీంతో దేశంలో చలామణిలో ఉన్న నగదు మొత్తమూ పెరిగింది. ఈ ఏడాది మార్చి 26 నాటికి దేశంలో రూ.28,58,640 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉంటే, ఈ నెల 7వ తేదీ నాటికి ఇది రూ.29,39,997 కోట్లకు చేరింది. ఈ-కామర్స్‌ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ పద్దతిని అనుమతించి ఉంటే ఇది మరింత పెరిగేదని అంచనా. 


ఆన్‌లైన్‌ చెల్లింపులకూ బూస్ట్‌..

నగదు వాడకం ఎంత పెరిగినా డిజిటల్‌ చెల్లింపుల మొత్తమూ పెరిగింది. గతంలో  ఒక్కో ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీ సగటున రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఉండేది. ప్రస్తుతం ఇది రూ.9,000కు చేరింది. మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా ఉద్యోగులు ఇంటి పట్టునే ఉండి కావలసిన నిత్యావసర సరుకులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వం పేదల కోసం జన్‌ధన్‌ ఖాతాల్లో కొంత సొమ్ము జమ చేయడంతో అల్పాదాయ వర్గాల ప్రజలు కూడా పేమెంట్‌ యాప్స్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T06:35:45+05:30 IST