ఇక ఓటీపీతోనే నగదు విత్‌డ్రాయల్‌

ABN , First Publish Date - 2020-09-16T06:26:48+05:30 IST

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఇక నుంచి ఓటీపీ నమోదు చేయడం తప్పనిసరి.

ఇక ఓటీపీతోనే నగదు విత్‌డ్రాయల్‌

శుక్రవారం నుంచి మారనున్న నిబంధనలు : ఎస్‌బీఐ


న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఇక నుంచి ఓటీపీ నమోదు చేయడం తప్పనిసరి. వచ్చే శుక్రవారం నుంచి ఈ మేరకు నిబంధనలు మారనున్నాయి.


రూ.10 వేలు, అంతకు పైబడిన నగదు ఉపసంహరించుకునేందుకు ఏటీఎంలో లాగిన్‌ అయిన వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ, పిన్‌ నంబరు నమోదు చేసినప్పుడే కస్టమర్‌ చేతికి నగదు అందుతుంది. కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్టు ఎస్‌బీఐ  తెలిపింది.

ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలో నగదు విత్‌డ్రాయల్‌ కోసం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రోజు మొత్తానికి విస్తరిస్తున్నట్టు వివరించినట్టు ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. ఓటీపీ ఆధారిత నగదు విత్‌డ్రాయల్‌ సదుపాయం ఎస్‌బీఐ ఏటీ ఎంలకు మాత్రమే పరిమితం.


ఇలా చేయాలి..

 ఏటీఎంలో డెబిట్‌ కార్డు పెట్టి నగదు విత్‌డ్రాయల్‌కు నమోదు చేయగానే ఏటీఎం స్ర్కీన్‌ మీద ఓటీపీ నమోదు చేయమనే సందేశం కనిపిస్తుంది

 రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ నమోదు చేసి, తర్వాత కస్టమర్‌ పిన్‌ నమోదు చేయాలి.

 ఆ రెండూ కరెక్ట్‌ అయితే చేతికి నగదు అందుతుంది. 




ఎస్‌బీఐ కార్డుపై క్రెడిట్‌ స్కోరు

ఎస్‌బీఐ కార్డు విభాగం తమ ఖాతాల ద్వారా లాగిన్‌ అయ్యే కస్టమర్లకు క్రెడిట్‌ బ్యూరో స్కోర్‌ అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఖాతాల ద్వారా లాగిన్‌ అయిన బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే క్రెడిట్‌ స్కోర్‌ చూసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నదని, దాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టడం చాలా అవసరం అని భావించామని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అశ్విన్‌ కుమార్‌ తివారీ చెప్పారు.

దీనిపై తాను తమ అధికారులతో చర్చించానని, వారు దానికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. దీనితో పాటు మరికొన్ని ఇతర సదుపాయాలు కల్పించే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టు తివారీ చెప్పారు. 


Updated Date - 2020-09-16T06:26:48+05:30 IST