కర్పూర చక్కెరకేళితో కాసులపంట

ABN , First Publish Date - 2022-01-22T05:40:54+05:30 IST

రాజంపేట, రైల్వేకోడూరు అరటికి పెట్టింది పేరు. ఇటీవల ఇక్కడ కర్పూర చక్కెరకేళి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇవి ఏకంగా టన్ను రూ.11వేలు పలుకుతూ రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.2లక్షల ఆదాయం వస్తోంది.

కర్పూర చక్కెరకేళితో కాసులపంట
రాజంపేట మండలం హస్తవరంలో దిగుబడి అయిన కర్పూర చక్కెరకేళి

ప్రస్తుతం టన్ను రూ.11 వేలు

తెగుళ్లు తక్కువ రావడం.. కాయ మాగకుండా ఉండటం దీని ప్రత్యేకత

రాజంపేట, జనవరి 21: రాజంపేట, రైల్వేకోడూరు అరటికి పెట్టింది పేరు. ఇటీవల ఇక్కడ కర్పూర చక్కెరకేళి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇవి ఏకంగా టన్ను రూ.11వేలు పలుకుతూ రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.2లక్షల ఆదాయం వస్తోంది. ఇతర రరాల కంటే దీని సాగు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ కావడంతో చాలామంది రైతులు దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారు.

రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతంలో చాలా కాలంగా పచ్చఅరటి-జి9, అమృతపాణి, సుగంధాలు ఇతరత్రా రకాలు సాగుచేస్తున్నారు. వీటికి ఎక్కువగా తెగుళ్లు రావడం, డిమాండ్‌ లేకపోవడంతో రెండేళ్లుగా కర్పూర చక్కెరకేళి వైపు మొగ్గు చూపుతున్నారు. తెగుళ్లు రాకుండా ఉండటం, పండు ఈగ సోకకుండా ఉండటం అతి తక్కువ ఎరువుల వాడకం, పిచికారీ మందు వేసినా, వేయకపోయినా దిగుబడి రావడం ఈ పంట ప్రత్యేకత.


ఎకరాకు 1200 పిలకలు : కర్పూర చక్కెరకేళిని కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి నాటుతున్నారు. నాటిన 10 నెలల నుంచే పంట దిగుబడి వస్తుంది. ఇక్కడకు రావడానికి ఒక్కో పిలకకు రూ.8.50 ఖర్చు అవుతోంది. ఎకరాకు 1200పిలకలు వేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, నెల్లూరు, హైదరాబాదు ప్రాంతాలకు ఈ పంటను ఎగుమతి చేస్తున్నారు. కర్పూర చక్కెరకేళిలో ప్రధానమైన అంశం ఏంటంటే గెలకొట్టిన తర్వాత వారం రోజులైనా మాగదు. ఈ ప్రత్యేకత వల్ల మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒక కాయ మాగినా పక్కనున్న కాయ మాగడానికి చాలా సమయం పడుతుంది. అదే ఇతర రకాలు ఒక కాయ మాగితే వెంటనే ఇతర కాయలు మాగిపోతాయి. ఎక్కువ రుచి కూడా ఉండటం చక్కెరకేలి ప్రత్యేకత. అందువల్ల రెండేళ్లుగా ఇక్కడి హస్తవరం, కొత్తపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, పాళెం, దేవసముద్రం, చవనంవారిపల్లె, మేకవారిపల్లె, టి.కమ్మపల్లె, సాదువారిపల్లె, రెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో సుమారు 5వేల ఎకరాల్లో కర్పూర చక్కెరకేళిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రోజూవారి రెండు లారీల కాయలను పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు.


ఈ రైతు పేరు ప్రసాద్‌రెడ్డి. ఇతను ఆదర్శ రైతు. హస్తవరం గ్రామంలో ఈయన సేంద్రియ ఎరువులతో అనేక పంటలు పండిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది కర్పూర చక్కెరకేళి పంటను రెండు ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేశారు. ఖర్చులు పోను రెండు ఎకరాల్లో రూ.4లక్షల ఆదాయాన్ని గడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని కర్పూర చక్కెరకేళి ద్వారా పొందవచ్చన్నారు. దీనికి తెగుళ్లు తక్కువని, పండు ఈగ అస్సలు సోకదని అన్నారు. గెలకొట్టిన వారం రోజుల వరకు కాయ మాగదన్నారు. ఈ కాయలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని, ఇతర రకాలు టన్ను రూ.7 వేలు ఉంటే వీటి ధర రూ.11 వేలు ఉందన్నారు.


ఇటీవల ఎక్కువగా సాగు చేస్తున్నారు

కర్పూర చక్కెరకేళి పంటను ఇటీవల రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ పిలకలను దిగుబడి చేసుకుంటున్నారు. తెగుళ్లు తక్కువగా సోకడం, పండు ఈగ సోకకుండా ఉండటం, తక్కువ ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందులు లేకపోయినా సేంద్రియ ఎరువులతో ఈ పంట బాగా పండుతోంది. నాణ్యతగా కాయలు దిగుబడి రావడంతో మంచి డిమాండ్‌ ఉంది. అందువల్ల కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో కర్పూర చక్కెరకేళి పంట సాగు పెరిగింది. 

 - హరినాధరెడ్డి, ఉద్యానవన శాఖాధికారి, రాజంపేట 


Updated Date - 2022-01-22T05:40:54+05:30 IST