సుదీర్ఘ విరామం తరువాత...

ABN , First Publish Date - 2020-08-11T10:00:17+05:30 IST

సుదీర్ఘ విరామం తరువాత పలాసలోని జీడి పరిశ్రమలు సోమవారం తెరచుకున్నాయి.

సుదీర్ఘ విరామం తరువాత...

తెరచుకున్న జీడి పరిశ్రమలు

మాస్కులతో హాజరైన కార్మికులు


పలాస, ఆగస్టు 10: సుదీర్ఘ విరామం తరువాత పలాసలోని జీడి పరిశ్రమలు సోమవారం తెరచుకున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన తరువాత పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల పరిధిలో పరిశ్రమలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా 50 శాతం కార్మికులతో పరిశ్రమల నిర్వహణకు అనుమతి వచ్చింది.  జంట పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో కేసులు పెరిగిన దృష్ట్యా లాక్‌డౌన్‌ అమలుచేయాలని కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోయారు. ఇటీవల ఆంక్షలు సడలించాలని జంట పట్టణాలకు చెందిన వ్యాపారులు మంత్రి అప్పలరాజుకు విన్నవించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వ్యాపారాలకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో కార్మికులు, వ్యాపార సంఘ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు.


నిబంధనలు పాటిస్తూ పరిశ్రమలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. తహసీల్దారు మధుసూధనరావు వ్యాపారులు,  కార్మికులతో చర్చించారు. సోమవారం నుంచి పరిశ్రమలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో పరిశ్రమలు కార్మికులతో కళకళలాడుతూ కనిపించాయి.సోమవారం 60 శాతం పరిశ్రమలు మాత్రమే తెరుచుకున్నాయి. మిగతావి రెండుమూడు రోజుల్లో తెరవచ్చని వ్యాపార సంఘ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా ఎక్కువగా ఉన్న జంటపట్టణాల్లో జీడి పరిశ్రమలు తెరిపించడం వల్ల లాభాలు కన్నా నష్టాలే అధికంగా ఉన్నాయని, కరోనా వ్యాప్తి చెందితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని జీడి వ్యాపార సంఘ మాజీ ఉపాధ్యక్షుడు తంగుడు వీర్రాజు ప్రశ్నించారు. 

Updated Date - 2020-08-11T10:00:17+05:30 IST