కేసినో హీట్‌

ABN , First Publish Date - 2022-01-24T06:27:13+05:30 IST

గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌ మారింది.

కేసినో హీట్‌

వెలుగులోకి వస్తున్న ఒక్కో ఆధారం

బయటకు వచ్చిన చీర్‌ గర్ల్స్‌ టికెట్లు


(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌ మారింది. ఈ వేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. కె కన్వెన్షన్‌ హాల్లో అమ్మాయిల చిందులు, కేసినో బోర్డుల వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నప్పటికీ మంత్రి కొడాలి నాని మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతూనే తిట్ల దండకం అందుకుంటున్నారు. కేసినో వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రంగంలోకి దిగిన పోలీసులు దానికి సంబంధించిన మూలాలను బయటకు లాగడం మొదలుపెట్టారు. కేసినో బోర్డులు కె కన్వెన్షన్‌ హాల్లో ఏర్పాటు చేయడానికి కారకులెవరో ఇప్పటికే గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడానికి మాత్రం పోలీసులు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. 


పదివేలు కాదు.. 50 వేలు

కె కన్వెన్షన్‌ హాల్లోకి ప్రవేశించడానికి రూ.10వేలను రుసుముగా నిర్ణయించారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఇది చాలా తక్కువేనని ఇప్పుడు తెలుస్తోంది. లోపలకు వెళ్లే వారి నుంచి రూ.50వేలను ప్యాకేజీగా వసూలు చేసినట్టు సమాచారం. ఈ ప్యాకేజీలో ఉన్న వారికి బస చేయడానికి లాడ్జి, కె కన్వెన్షన్‌ హాలు వద్దకు రావడానికి రవాణా, ప్రవేశం ఉచితంగా కల్పించినట్టు తెలుస్తోంది. 


వెలుగులోకి చీర్‌ గర్ల్స్‌ టికెట్స్‌ 

గోవా నుంచి చీర్‌ గర్ల్స్‌ ముందుగా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మరో విమానంలో విజయవాడకు వచ్చారు. తిరిగే వెళ్లేటప్పుడు విజయవాడ నుంచి బెంగళూరు, అక్కడి నుంచి గోవాకు చేరుకున్నారు. గోవా నుంచి ఇక్కడికి వచ్చిన చీర్‌ గర్ల్స్‌ పేర్లు, వారి టికెట్‌ వివరాలను టీడీపీ నాయకులు సేకరించారు. గోవా నుంచి మొత్తం 13 మంది చీర్‌ గర్ల్స్‌ను గుడివాడలోని కేసినోకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ వివరాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆదివారం మీడియాకు విడుదల చేశారు. ఎయిర్‌ ట్రిప్‌ హైరార్కీ ట్రావెల్‌ ఏజెన్సీ వీరిని బుక్‌ చేసింది. ఇందుకోసం లక్షలాది రూపాయలను వెచ్చించారు. ఆ మొత్తాన్ని కేసినోకి  వెళ్లిన వారి నుంచి వసూలు చేశారు. గుడివాడలో జరిగిన కేసినో పెద్ద దుమారాన్ని రేపుతున్నప్పటికీ పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి జూద క్రీడలకు రాష్ట్రంలో ఎలాంటి అనుమతి లేదు. నిషేధిత కేసినోను నిర్వహించినట్టు వీడియోలు చక్కర్లు కొట్టినప్పటికీ పోలీసులు స్పందించడం లేదు. ఆటను నిర్వహించిన హాలు మంత్రిది కావడంతో వారు అడుగు కదపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 


విచారణ జరిపించాలి

ఎస్పీకి టీడీపీ నాయకుల ఫిర్యాదు

ఆంధ్రజ్యోతి, -మచిలీపట్నం : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుడివాడలో కేసినో నిర్వహించడంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసినో నిర్వహణపై నిజాలు నిగ్గుదేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుడివాడ వెళితే, వైసీపీ గూండాలు అడ్డుకుని దాడి చేశారని, ఆ తరువాత గుడివాడ టీడీపీ కార్యాలయంపై కూడా దాడికి ప్రయత్నించారని, ఈ ఘటనలపై కూడా విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు చెందిన కారు అద్దాలను మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్‌, ఎం.జాన్‌విక్టర్‌ రాయితో పగులగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు గుడివాడ పోలీసులు సహకరించలేదని, వైసీపీ నాయకులకు మాత్రమే సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-24T06:27:13+05:30 IST