పరరాష్ట్రాల్లో ఓబీసీల కుల ధ్రువీకరణలు

ABN , First Publish Date - 2021-10-14T08:23:40+05:30 IST

దేశజనాభాలో అత్యధిక శాతం గల వెనుకబడిన తరగతుల ప్రజానీకం , రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్ల ఫలితాలు అందిపుచ్చుకోవడంలో - ఈ నాటికీ వెనుకబడి ఉండటం అత్యంత విషాదకర వాస్తవం. ‘ఆజాదీ అమృతోత్సవ్‌’ అట్టహాసంగా...

పరరాష్ట్రాల్లో ఓబీసీల కుల ధ్రువీకరణలు

దేశజనాభాలో అత్యధిక శాతం గల వెనుకబడిన తరగతుల ప్రజానీకం , రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్ల ఫలితాలు అందిపుచ్చుకోవడంలో - ఈ నాటికీ వెనుకబడి ఉండటం అత్యంత విషాదకర వాస్తవం. ‘ఆజాదీ అమృతోత్సవ్‌’ అట్టహాసంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం గట్టిగా సంకల్పించిన తరుణంలో ఈ బీసీ వర్గాలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా, మోదీ ప్రభుత్వం దృష్టి సారించాలి.


వెనుక బడిన వర్గాల ప్రజలు 29 రాష్ట్రాల పరిధిలో వందలాది సంఖ్యలో కులాలుగా విడిపోయి వున్నారు. ఒకే బీసీ కులానికి, ఉపకులాలు ఎన్నో ఉన్న పరిస్థితులు.అయితే స్వాతంత్య్రం సిద్ధించిన కొన్ని దశాబ్దాలలోనే, వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు, వివిధ వర్గాల మేధావుల ఆధ్వర్యంలో కమిషన్లు ఏర్పడ్డాయి. చిన్న చిన్న అంతరాలున్నా దాదాపు అయిదు దశాబ్దాలుగా, ఆనాడు ఏర్పాటైన బీసీ కమిషన్‌ సిఫార్సులే ఈనాటికీ అనేక రాష్ట్రాలలో అమలులో వున్నాయి. 


అయితే దేశంలో అనేక సాంఘిక, ఆర్థిక పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా విద్యాభివృద్ధి గణనీయంగా జరిగింది. ఇదే సమయంలో వ్యవసాయం లాభసాటిగా లేక, అనేక స్థాయిల వారు, ఉద్యోగాల నిమిత్తం, ఇతర చిన్న చిన్న ఉపాధి పనుల నిమిత్తం, స్వరాష్ట్రం నుంచి ఇతర, సుదూర రాష్ట్రాలకు వలసలు పెరిగాయి. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి జరుగుతోంది. దాని ఫలితంగా తర్వాతి తరాలలో విద్యా, ఉపాధి నిమిత్తం కుల ధ్రువీకరణ పత్రాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.


ఎట్టకేలకు బీసీ వర్గాల కోరిక ఫలించి, 1990లో బి.పి. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు జాతీయ స్థాయిలో అమలులోకి వచ్చాయి. అయితే ‘చేతికందిన కూడు... నోటి కందని’ చందంగా ఈ మండల్‌ కమిషన్‌ ఫలితాలు సకాలంలో సక్రమంగా వివిధ రాష్ట్రాలలో, వలస జీవితాలు గడుపుతున్న వారికి అందుబాటులో లేకపోవడం నగ్న సత్యం. బీసీ వర్గాల లక్షలాది ప్రజలు తమ స్వంత రాష్ట్రాలలో బీసీ కేటగిరీలలో ఉంటారు. దాని వలన కొందరు ఒ.బి.సి. (ఇతర వెనుకబడిన తరగతులు) జాబితాలోకి పరిగణింపబడి కొన్ని మంచి అవకాశాలు పొందగలుగుతున్నారు. 


కానీ దురదృష్ట వశాత్తూ, ఒక రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న కులాలు పక్క రాష్ట్రంలో (ఇతర రాష్ట్రాల్లో) బీసీ కేటగిరీ గా గుర్తించబడటం లేదు. దీని వలన ఎంతో నష్ట పోతున్నారు. తమ పిల్లల విద్యా, ఉపాధి అవకాశాల నిమిత్తం కుల ధ్రువీకరణ పత్రాలు పొందలేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా మహనీయుడు బి.పి. మండల్‌ సదాశయాలు, సంబంధిత వర్గాలకు మేలు చేకూర్చ లేకపోతున్నాయి,


అందువలన, ఓబీసీ జాబితాలో చేర్చబడిన బీసీ కులాలకు చెందిన వారు, ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా, వారి బీసీ ధ్రువీకరణ పత్రం తమ రాష్ట్రానికి చెందినది ఉన్నా లేకపోయినా, వారి ముందు తరం వారి బీసీ కుల ధ్రువీకరణ పత్రం ద్వారా, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.


అలా కాని పక్షంలో ప్రపంచీకరణ నేపథ్యంలో, తమ మాతృ దేశంలోనే సంబంధిత వర్గాల ప్రజలు ఎన్నో అవకాశాలు కొల్పోతున్నారు. అన్ని పాలక పక్షాలు ఈ వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లు అమలు జరపడంలో చూపుతున్న శ్రద్ధ , ఇలాంటి సాంకేతిక అంశాలలో చూపడం లేదు. తరాల అంతరం వలన అన్ని రాష్ట్రాలలోనూ ఈనాడు వెనుకబడిన వర్గాల నిజమైన సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు తగిన అవగాహన, అంకిత భావం కలిగిన నాయకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తుంది.


నిజానికి 90వ దశకం తర్వాత, మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, దేశంలో రాజకీయ పెను మార్పులకు దోహదపడింది. కోట్లాది మంది, వెనుక బడిన వర్గాల ప్రజలు కోటి ఆశలతో ఆయా రాష్ట్రాలలో నూతన రాజకీయ శక్తులకు దశాబ్దాలుగా అధికారం కట్టబెడుతూనే ఉన్నారు. అయినా అసలు ప్రయోజనాలు అందుబాటులోకి రాక, ఎదుగు బొదుగు లేని బతుకులు వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించిన నాడే నిజమైన ఆజాదీ అమృతోత్సవ్‌ ! పాలకులు గుర్తించాలి. 

బి.వి.అప్పారావు

Updated Date - 2021-10-14T08:23:40+05:30 IST