కులగణన సామాజిక అవసరం

ABN , First Publish Date - 2021-09-29T06:38:00+05:30 IST

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం....

కులగణన సామాజిక అవసరం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది.  75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు. వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడింది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 


ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931 వరకు 16 సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్‌ ప్రక్రియలో అంతరాయం కల్గింది. వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతంత్ర్యానంతరం జనాభా వివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు. దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష, అసమానతలు, ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు, సామాజిక న్యాయం, ప్రధానంగా విద్య, ఉద్యోగాలు, అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. 1931 సెన్సెస్‌ తర్వాత గడచిన 90 సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదనుగుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు. ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు. ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక, అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల సాధించిన పురోగతి, తదనుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయమే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ, బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలుగుతాయి? వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితాలను ఎలా రూపొందిస్తారు? కులాల చేర్పులు మార్పులు ఎలా సాధ్యం? క్రీమీలేయర్‌ విషయంలో ప్రతిపాదనలు ఎలా రూపొందిస్తారు. రిజర్వేషన్‌ కోటాలను ఎలా నిర్థారిస్తారు? కులం వివక్షకు, అసమానతలకు మూలకారణమైన విద్య, ఆరోగ్యం, ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విషయంలో విధాన రూపకల్పన ఎలా సాధ్యం? అదే విధంగా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్‌ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన, నాణ్యమైన గణాంకాలు సెన్సెస్‌ ద్వారానే సాధ్యమని, ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కుల గణాంకాలు నిర్వహించకపోవడం ఎంతవరకు సహేతుకం? అది తర్కానికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం  2011 జనాభా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబంధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్‌ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాల పేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా, అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకరణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారికంగా గుర్తించినప్పటికీ, గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్ట లేకపోయాయి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 2021 సెన్సెస్‌లో కులాధార గణాంకాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది. ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విషయంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్‌.డి.ఎలోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయటనుండి సమర్థించే మరి కొన్ని పార్టీలు, మహారాష్ట్ర, బీహార్‌, ఒడిషా, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రులు, అదే విధంగా సి.పి.ఐ, సిపియం, ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌ పార్టీ, డియంకె, తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణిలో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది. అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ విషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్ని ఓబిసి / బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు, కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021 సెన్సెస్‌లో కుల గణాంకాలు చేర్చాలని చెప్తున్నాయి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామకాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి.


ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు. 1990లలో ఓబీసీలకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తి చేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపై ఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను, సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజికవర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరించాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏ విషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మమని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాంకాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రొ. కె. మురళి మనోహర్‌ 

విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-09-29T06:38:00+05:30 IST